స్కూళ్లు, కాలేజీలు బందాయె.. ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావాయె

స్కూళ్లు, కాలేజీలు బందాయె.. ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావాయె
  • స్టూడెంట్లు పరేషాన్
  • దగ్గరపడుతున్న ఎగ్జామ్స్​.. టెన్షన్​ పడుతున్న స్టూడెంట్స్​ ​
  • మే 1  నుంచి ఇంటర్​,17 నుంచి టెన్త్​ పరీక్షలు
  • స్మార్ట్​ ఫోన్లు లేక రూరల్​ విద్యార్థుల అవస్థలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. దాదాపు 11 నెలల తర్వాత ఓపెన్ చేసిన స్కూళ్లు, కాలేజీలు నెలన్నర రోజులు కూడా పనిచేయలేదు. కరోనా పేరుతో మార్చి 24  నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూసేసింది. ఓవైపు ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటే, మరోవైపు ఆన్ లైన్ క్లాసులు అర్థం కాక స్టూడెంట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రూరల్​ ఏరియాల్లోని టెన్త్, ఇంటర్ పిల్లల్లో టెన్షన్​ ఎక్కువగా కనిపిస్తోంది. ఉన్నపళంగా యూనివర్సిటీలు, హాస్టళ్లు  కూడా క్లోజ్ చేయడంతో పైచదువులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారు. 
 

ముంచుకొస్తున్న ఎగ్జామ్స్ 
టెన్త్, ఇంటర్  పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. మే ఫస్ట్ నుంచి ఇంటర్, మే 17 నుంచి టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెట్టడానికి ఆయా బోర్డులు రెడీ అవుతున్నాయి. వాస్తవానికి కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో స్కూళ్లు, కాలేజీలు బందవగా సెప్టెంబర్​ నుంచి ఆన్​లైన్​ క్లాసులు స్టార్ట్​ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూళ్లు, కాలేజీలు తెరిచారు. అప్పటివరకు ఆన్ లైన్ లో చెప్పిన పాఠాలను  ఫిజకల్ క్లాసెస్ లో టీచర్లు, లెక్చరర్లు రివైజ్​  చేస్తుండగా ఉన్నట్టుండి మళ్లీ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం మూసేసింది. ఆన్​లైన్​ క్లాసులు కంటిన్యూ అవుతాయని చెప్పింది. మళ్లీ ఆన్ లైన్ క్లాసులు పెట్టడం వల్ల ఫిజికల్ క్లాసుల్లోనే ఒకటికి రెండు సార్లు చెప్పినా అర్థం చేసుకోని పిల్లలు ఎగ్జామ్తో ఇబ్బందిపడుతారని టీచర్లు, పేరెంట్స్​ అంటున్నారు. ఎగ్జామ్స్​ పూర్తయ్యే వరకైనా కరోనా గైడ్​లైన్స్​ పాటిస్తూ స్కూళ్లు , కాలేజీలు ఓపెన్​ చేయాలని కోరుతున్నారు. 
 

సిలబస్ తగ్గించినా..​ 
కరోనా ఎఫెక్ట్​తో  సిలబస్ ను ప్రభుత్వం కుదించింది. టెన్త్ స్టూడెంట్స్ కు 30 శాతం సిలబస్ ను అసైన్ మెంట్ కు  పరిమితం చేసి, మిగతా 70 శాతం సిలబస్​కు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అలాగే ఇంటర్ లో కూడా సిలబస్ ను 70 శాతానికి పరిమితం చేసింది. గతంలో ఆన్ లైన్ క్లాసుల్లో మెజార్టీ స్టూడెంట్స్ సీరియస్ గా క్లాసులు వినలేదని విద్యాశాఖ వర్గాలే చెప్తున్నాయి. ఫిజికల్ క్లాసెస్ ద్వారా పిల్లలు కాస్త కుదుట పడి క్లాసెస్ ను సీరియస్ గా వినేటైమ్ లో మళ్లీ స్కూల్స్, కాలేజీలను క్లోజ్ చేయడంతో మెజార్టీ స్టూడెంట్స్  కన్ఫ్యూజన్ లో పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. 
 

ఆరో క్లాసోళ్లకు హిందీ అక్షరాలు రాకముందే ..
ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచి హిందీ సబ్జెక్టు బోధిస్తుంటారు. గత ఏడాది కరోనా కారణగా 5వ తరగతి పిల్లలను ప్రమోట్ చేశారు. ఆరో తరగతిలో హిందీ సబ్జెక్టు కొత్తగా పరిచయం అవుతుంది. వీరికి టీచర్స్ ముందుగా హిందీ అక్షరాలు నేర్పిస్తుంటారు. అయితే ఆరో తరగతి స్టూడెంట్లకు  ఫిబ్రవరి 24 నుంచి స్కూళ్లలోనే క్లాసులు బోధించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరిగి  నెలరోజుల్లోనే  సూళ్లను మూసేసింది. ఈ నెల రోజుల్లో పిల్లలకు కనీసం హిందీ ఓనమాలు కూడా రాలేదని ఎడ్యుకేషన్​ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు అంటున్నారు. అంతకు ముందు ఆన్​లైన్​ క్లాస్​లు నిర్వహించినా  రూరల్ స్టూడెంట్లలో  90 శాతం మంది వినలేదని  ఆఫీసర్ల అంచనా

నష్టపోతున్న రూరల్ స్టూడెంట్స్ 
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది టెన్త్ పరీక్షలకు,10.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు  ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇందులో 60 శాతం స్డూడెంట్లు  పల్లెల నుంచే ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవని విద్యాశాఖ అంచనా వేసింది. స్కూళ్లలో క్లాసులు క్లోజ్ చేసి, మళ్లీ ఆన్ లైన్ క్లాస్​ల కు అవకాశం కల్పించడంతో రూరల్​ ఏరియాల్లోని  ఇలాంటి స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యాశాఖ వర్గాలు  చెప్తున్నాయి. 

ఆన్​లైన్​ క్లాస్​లు అర్థమైతలేవ్​
సిలబస్ 50 శాతం మాత్రమే కంప్లీట్  అయింది. కరోనా కారణంగా ఆన్​లైన్​ క్లాసులు జరుగుతున్నా ఏమీ అర్థం కావడం లేదు. త్వరలో జరిగే ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలియట్లేదు. అంతా టెన్షన్ టెన్షన్ గా ఉంది.
‑ లాకావత్ పున్నం చందర్, ఎడ్లపల్లి మోడల్ స్కూల్  టెన్త్​ స్టూడెంట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ఎగ్జామ్స్ వరకు స్కూల్స్ ఓపెన్ చేయాలి
అసలే క్లాసెస్  లేటుగా మొదలయ్యాయి. సిలబస్ పూర్తి కాలేదు. ప్రస్తుతం మళ్లీ కరోనా సెలవులు ఇచ్చారు. చదువుకు ఆటంకం కలుగుతోంది.  టెన్త్​ ఎగ్జామ్స్ వరకు స్కూళ్లు ఓపెన్​ చేయాలి. 
‑ ఎం.శ్రీజ, టెన్త్​ స్టూడెంట్​, తార్నాక, హైదరాబాద్

పిల్లలు, మేమూ టెన్షన్​ పడ్తున్నం
రివిజన్ జరగాల్సిన టైమ్ లో బడులు బంద్ చేసి పిల్లలను ఇంటికి పంపించడంతో వాళ్లు టెన్షన్ పడుతున్నరు. ఎగ్జామ్ ఎట్లా రాస్తారో అని మాకూ టెన్షన్ పట్టుకుంది. టెన్త్ స్టూడెంట్స్ కు స్కూల్ నడిపియ్యాలి.  
- బోల భిక్షపతి, పేరెంట్, చెన్నాపూర్ , మెదక్ జిల్లా

ఆందోళనకు గురికావొద్దు
ఆన్​లైన్​లో పాఠాలు విన్నారు కాబట్టి ఇప్పటి టెన్త్​ స్టూడెంట్లలో ఆందోళన  ఎక్కువే ఉంటుంది. అందుకే వాళ్లు ఇబ్బంది పడకుండా సిలబస్ తగ్గించారు. ప్రశ్నలనూ ఈజీ చేశారు. ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి. 
‌‌– నంది శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీంనగర్

పోటీ పరీక్షలు రాసెటోళ్లకూ తక్లీఫ్​
రాష్ట్రం నుంచి ఏటా జేఈఈ, నీట్ పరీక్షలకు సుమారు లక్ష మంది స్టూడెంట్స్ అటెండ్​ అవుతుంటారు. ఫిజికల్ క్లాసెస్ ఉంటే స్టూడెంట్స్ తమకు వచ్చిన డౌట్స్ ను వెంటనే లెక్చరర్లను అడిగి క్లారిఫై అవకాశం ఉండేది. అలాగే ఫిజికల్ క్లాసెస్  ఉంటే పిల్లల ఆసక్తి,  ఫ్యాకల్టీ అటెన్షన్ ఎక్కువగా ఉండేది. ఈసారి ఎక్కువగా ఆన్ లైన్​లోనే పాఠాలు వినాల్సి వస్తుండటంతో మంచి ర్యాంకులు రావడం కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్​లో ఉంటూ యూపీపీఎస్సీ, పోలీసు, ఇతర ఉద్యోగాల కోసం వేలాది మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. యూనివర్సిటీలను, హాస్టళ్లను బంద్​ చేయడంతో ఇలాంటి స్టూడెంట్స్​ కూడా ఇబ్బందులు పడ్తున్నారు.