ఆసిఫాబాద్ జిల్లా : వరదొస్తే బడి బందే .. వాగులు దాటలేక.. స్కూళ్లకు వెళ్లని టీచర్లు

ఆసిఫాబాద్ జిల్లా : వరదొస్తే బడి బందే .. వాగులు దాటలేక.. స్కూళ్లకు వెళ్లని టీచర్లు
  • ముందుకు సాగని  విద్యార్థుల చదువులు
  • హై లెవల్ వంతెనలు లేక తీవ్ర ఇబ్బందులు 
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థులకు వానాకాలం కష్టాలు తీరడంలేదు. భారీ వానలు పడ్డప్పుడు వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తుంటే దాటలేక టీచర్లు వెనుదిరిగి వెళ్తుంటారు.బడిగంట మోగుతుందనే ఆశతో ఎదురుచూసే విద్యార్థులకు నిరుత్సాహంతో ఎదురవుతుంది. జిల్లాల్లో చాలా మండలాల్లో అవాంతరాల నడుమ స్కూల్ విద్యార్థులు చదువులు కొనసాగించే పరిస్థితి నెలకొంది. కొన్ని సమయాల్లో ప్రాణాలను పణంగా పెట్టి టీచర్లు వాగులు దాటి ఎంతో కష్టంమీద స్కూళ్లకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. 

ఇలానే.. 2013లో తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్ వాగు వరదలో కొట్టుకుపోయిన టీచర్ జ్ఞానేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాల్లో వాగులు దాటి టీచర్లు వెళ్లలేకపోతుండగా స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు చేసేదేం లేక ఇంటిబాట పడుతుంటారు. వాగులు దాటే పరిస్థితులు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతారు. 

స్థానిక మండల హెడ్ క్వార్టర్ లో టీచర్లు నివాసం ఉండాలనే నిబంధనలున్నా, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉండడంలేదు. మరోవైపు ప్రజలు కూడా తమ అవసరాలు తీర్చుకునేందుకు ప్రమాదకర పరిస్థితుల్లో వాగులు దాటుతుంటారు. విద్యార్థులు, గ్రామస్తులు అవసరాలు, ఇబ్బందులు దృష్ట్యా వాగులపై బ్రిడ్జిలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హై లెవెల్ వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు దశాబ్దాలుగా కోరుతున్నా పట్టించుకునేవారు లేరు.  వాగులపై లో లెవెల్ వంతెనలున్నా ఎలాంటి ఉపయోగం లేదు. వాగుల మీద కొత్తగా బ్రిడ్జిలు నిర్మిస్తేనే సమస్యలకు శాశ్వతంగా లభిస్తుంది.  

జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇలా.. 

జైనూర్‌‌‌‌‌‌‌‌ : మండలంలోని గౌరి పంచాయతీ లెండిగూడ వాగు కారణంగా స్కూళ్లు బంద్ అవుతాయి. 
సిర్పూర్ యు : మండలంలోని శెట్టిహడపునూర్ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. .

లింగాపూర్ : మండలంలోని వంకమది వాగు కారణంగా14 గ్రామాలోని వాగులపై వంతెనలు లో లెవల్ బ్రిడ్జి ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. 

పెంచికల్ పేట :  మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని మేరుగూడకు సరైన రోడ్డు లేదు. ఆ ఊరికి వెళ్లాలంటే బొక్కి వాగు ప్రాజెక్ట్ మత్తడి దాటాలి. భారీ వానలు పడ్డప్పుడు ప్రాజెక్ట్ మత్తడి మీద నుంచి వరద పారుతుంది. దీంతో మత్తడి దాటి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఆ గ్రామానికి స్కూల్ కి టీచర్లు కూడా వెళ్లలేకపోతుంటారు. 

తిర్యాణి : మండలంలోని మాణిక్యపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తే మంగి, అస్నూర్, భీంపూర్, కుంటగూడ, అలీగూడ, ముల్కల మంద, స్కూల్ గూడ మంగి, పాతగూడ, తోయరిట్, గుట్ట గూడ గ్రామాల్లోని స్కూళ్లకు టీచర్లు చేరుకోవడం కష్టమవుతుంది. దీంతో స్కూల్స్ బంద్ అవుతాయి. వాగులో నీరు పెరిగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. తద్వారా కొద్దిరోజుల పాటు విద్యార్థుల చదువులు ఆగిపోతాయి.  

వాంకిడి : మండలంలోని పిప్పర్ గొంది వాగులు ఉప్పొంగితే ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతాయి. ప్రతి ఏటా వానాకాలంలో ఇవే కష్టాలు ఉంటాయి. విద్యార్థులు చదువులు నష్టపోతున్నా సంబంధిత అధికారులు  పట్టించుకోవడం లేదు. వంతెన నిర్మించాలని మండల ప్రజలు కోరినా నిర్లక్ష్యంగానే ఉంటారు.  

దహేగాం : మండలంలోని డోలుమర్రి వాగు పొంగితే మొర్రిగూడ, దుబ్బగూడ, జెండగూడ గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి. టీచర్లకు స్కూల్ కు పోలేరు. పెసరిగుంట గ్రామానికి వెళ్లే దారిలో లో లెవల్ బ్రిడ్జి  పొంగుతుంది. దాటే పరిస్థితి ఉండదు. దీంతో టీచర్లు స్కూళ్లకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. 

అత్యవసరమైతే ఎటెల్లాలో తెలియదు 

మాణిక్యపూర్ వాగుకు వరద వస్తే దాటేందుకు వీలుండదు. ఊళ్లోకి రాలేరు. బయట పోలేరు. టీచర్లు కూడా రాకపోతే స్కూల్ బంద్ అవుతుంది. ఇలా.. ఏటా వానాకాలమొస్తే పిల్లలకు చదువులకు ఇబ్బందులు తలెత్తుతా యి. ఎవరైనా అనారోగ్యం పాలైతే దవాఖానకు పోవాలన్నా కష్టంగానే ఉంటుంది. అత్యవసరమైతే ఎటెల్లాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి వాగుపై వంతెన కట్టాలి.  
- మడావి సోనేరావు, భీంపూర్, తిర్యాణి మండలం–