
- బడిబాట పట్టనున్న 60 లక్షల మంది స్టూడెంట్లు
- కొత్త సర్కారులో మొదటి విద్యా సంవత్సరం..
- తొలిరోజే పుస్తకాలు, యూనిఫాంలు
- ఈ ఏడాది 203 ఊర్లలో కొత్తగా స్కూళ్లు ప్రారంభం
- ఉన్న బడులు మూతపడకుండా అడ్మిషన్లపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. 49 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లలో బడిగంట మోగనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి విద్యా సంవత్సరం. బడులు రీఓపెన్ అవుతున్న రోజే స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది.
దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా స్కూళ్లుండగా వాటిలో 60 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. గత 2023–24 విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగియగా, జూన్11 వరకూ సమ్మర్ హాలీడేస్ ఇచ్చారు. హాలీడేస్ పూర్తికావడంతో బుధవారం నుంచి మళ్లీ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు గురుకులాలూ ఓపెన్ కానున్నాయి.
అయితే, సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్సుతో పాటు యూనిఫామ్స్ అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలకు అవి చేరుకున్నాయి. పుస్తకాలు, నోట్ బుక్స్మండల పాయింట్ల నుంచి హెడ్మాస్టర్లు, టీచర్లు స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లారు. సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్ల కోసం1.49 కోట్ల పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు.
ఈసారి పుస్తకాల్లోని పేపర్ మందం తగ్గించడంతో పుస్తకాల బరువుతో పాటు ధర కూడా తగ్గింది. దీంతో పేరెంట్స్ కు, స్టూడెంట్లకు కాస్త ఊరట లభించనుంది. మరోపక్క15 లక్షల మందికి యూనిఫామ్ కుట్టించే ప్రక్రియ పూర్తయింది. కుట్టు పూర్తయిన యూనిఫామ్స్ బడుల్లోకి చేరాయి.
203 ఊర్లలో కొత్త స్కూళ్లు
ప్రతి గ్రామపంచాయతీలోనూ సర్కారు బడి ఉండేలా చర్యలు తీసుకోవాలని రివ్యూ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. దీంతో స్టేట్ వైడ్గా 265 గ్రామ పంచాయతీల్లో స్కూళ్లు లేవని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించారు. వీటిలో 203 గ్రామాల్లో స్కూళ్లు అవసరమని నివేదిక ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం ఈ 203 బడుల్లో కొత్తగా ప్రైమరీ స్కూళ్లను ప్రారంభిస్తున్నారు.
మరోపక్క సింగిల్ టీచర్ ఉన్న బడుల బలోపేతంపైనా విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం తక్కువ మందితో నడుస్తున్న బడుల్లో ఎన్ రోల్ మెంట్ పెంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా మరో రెండుమూడు వారాలు కొనసాగనున్నది.
బడుల్లో స్కావెంజర్ల సమస్య
ప్రస్తుతం బడులు క్లీన్ చేసేందుకు ఎవ్వరూ లేకపోవడంతో టీచర్లు, హెడ్మాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కరోనాకు ముందు బడుల్లో 28 వేల మంది పారిశుధ్య కార్మికులు ఉండేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా తర్వాత బడులు తెరిచినా.. పారిశుధ్య కార్మికులను తీసుకోలేదు. జీపీలు, మున్సిపాలిటీలకు ఆ బాధ్యతలు అప్పగించినా, వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గతేడాది స్కూళ్లలో ఈ సమస్య తీవ్రమైంది. అయితే, ఈ విద్యా సంవత్సరం మాత్రం స్కావెంజర్లను నియమించాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
వచ్చే ఏడాది నుంచే ఫీజుల కట్టడి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలనే ఆలోచనలో ఉండగానే.. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడు కోడ్ పూర్తికాగానే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. దీంతో ఫీజుల నియంత్రణ సమస్య పెండింగ్లో పడింది. వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం తప్పనిసరిగా ఫీజులను నియంత్రిస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుగుణంగా డిసెంబర్ లోపే చట్టం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఐదుగురితో కమిటీని కూడా సర్కారు వేయనున్నది.