టీఆర్ఎస్​ లీడర్​ వెంచర్​ కోసం ఊరికి దూరంగా సైన్స్​పార్క్

టీఆర్ఎస్​ లీడర్​ వెంచర్​ కోసం ఊరికి దూరంగా సైన్స్​పార్క్
  • నారాయణపేట మున్సిపల్​ ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు
  • చక్రం తిప్పిన లోకల్​ ఎమ్మెల్యే
  • జనానికి అందుబాటులో ఉండేలా కట్టే చాన్స్​ ఉన్నా పట్టించుకోలే
  • ఇటీవల కేటీఆర్ ​చేతుల మీదుగా ప్రారంభం

మహబూబ్ నగర్, వెలుగు: ఊరికి దూరంగా ఓ టీఆర్ఎస్​ లీడర్​ వెంచర్ చేసిండు.. మున్సిపల్​ ఎన్నికల ముందు కారెక్కిన ఆయన ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు.. ఇంకేం లీడర్లు, ఆఫీసర్లు కలిసి చక్రం తిప్పిన్రు.. రూల్స్​ ప్రకారం సదరు నేత వెంచర్ లో10 శాతం ల్యాండ్​ ను మున్సిపాలిటీకి గిఫ్ట్​డీడ్​కింద ఇవ్వగానే ఆఫీసర్లు ఆ భూమిలో రూ. 1.45 కోట్లతో ఆధునిక హంగులతో సైన్స్​పార్కు కట్టి  రిటర్న్​ గిఫ్ట్​ ఇచ్చిన్రు.  ఈ వింత నారాయణపేట టౌన్​లో జరిగింది.

రుణం తీర్చుకున్న ఎమ్మెల్యే.. 
నారాయణపేటకు చెందిన ఓ​ లీడర్​, గత మున్సిపల్​ఎన్నికలకు ముందు టీఆర్​ఎస్​లో చేరారు. ఇందుకు కృతజ్ఞతగా స్థానిక ఎమ్మెల్యే ఆయన ‘రుణం’ తీర్చుకోవాలనుకున్నారు. టైం కోసం వేచి చూశారు. ఈలోగా సదరు టీఆర్ఎస్​లీడర్  నారాయణపేట టౌన్​శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయభూమిలో 12 ఎకరాలను వెంచర్​గా మార్చారు. రూల్స్​ ప్రకారం 10 శాతం ల్యాండ్​ ను మున్సిపాలిటీకి గిఫ్ట్​డీడ్​ చేశారు. ఈ క్రమంలో ఆ లీడర్​ వెంచర్​కు,  భూములకు డిమాండ్​ వచ్చేలా ఆఫీసర్లతో కలిసి ఎమ్మెల్యే చక్రం తిప్పారు. వెంచర్​లోని మున్సిపల్​ ల్యాండ్​లో పార్కు కట్టేందుకు  ఎమ్మెల్యే సిఫార్సు చేయడం, ఓ ఉన్నతాధికారి ఆగమేఘాల మీద ఆర్డర్స్​ ఇవ్వడం, ఆ అధికారికే చెందిన బినామీ కాంట్రాక్టర్​ రంగంలో దిగి, సైన్స్​పార్క్​ పూర్తిచేయడం చకచకా జరిగిపోయాయి. తొలుత రూ.1.2 కోట్లు అవుతుందని అంచనా వేయగా,  చివరకు రూ. 1.45 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేశారు.  ఇటీవల మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులను తీసుకొచ్చి మరీ సైన్స్​పార్కుకు ఓపెనింగ్​చేయించారు. 

జిల్లా కేంద్రంలో ఉన్న  జాగాలు వదిలి..
నారాయణపేట జిల్లా కేంద్రం కాకముందే పట్టణంతోపాటు శివార్లలో పెద్దసంఖ్యలో వెంచర్లు వెలిశాయి. కొందరు పక్కాగా డీటీసీపీ లేఅవుట్​లతో పాటు మున్సిపల్​ అధికారుల అనుమతి తీసుకుని రూల్స్​కు లోబడి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. కొన్ని వెంచర్లలో  ఇండ్లు కూడా నిర్మించారు. టౌన్​నడుమ, టౌన్​ను ఆనుకొని ఉన్న వెంచర్లలోనూ మున్సిపాలిటీకి 10శాతం గిఫ్ట్​ చేసిన ఖాళీ జాగలున్నాయి. ద్వారక హిల్స్​వెంచర్​గా మార్చి మున్సిపాలిటీకి అరెకరం ఇచ్చారు. ఆర్టీసీ కాలనీ, బీసీ కాలనీ మధ్యలో రెడ్​హిల్స్​కాలనీలో ఎకరా వరకు మున్సిపాలిటీకి కేటాయించారు.   ఆర్టీసీ బస్టాండ్​ముందు ఆశోక్​నగర్​కాలనీ వెనుక చేసిన ఓ వెంచర్​లో ఎకరాకు పైగా స్థలం మున్సిపాలిటీదే. ఇటు బస్టాండ్, అటు కొత్తగంజ్​కు సమీపంలో ఉంటుంది. యాద్గిర్ రోడ్​కు సమీపంలో హరిజన వాడ పక్కన అర ఎకరాఉంది. ఇవన్నీ విలువైన స్థలాలే. ఇటు ప్రజలకు, అటు చిన్న పిల్లలకు వాకబుల్​డిస్టెన్స్​లో ఉంటాయి. ఈ స్థలాల్లో ఎక్కడా సైన్స్​పార్క్​ కట్టాలనే ఆలోచన మున్సిపల్​ఆఫీసర్లకు రాలేదు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్​లీడర్​వెంచర్​లో మాత్రం పార్కును కట్టి, తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

అవసరం లేని చోట కట్టిన్రు
పట్టణంలో జనాలకు దగ్గరగా పాత వెంచర్లు చాలా ఉన్నాయి. వాటిని కాదని ఊరిబయట కొత్త వెంచర్​లో అంత కాస్ట్​పెట్టి పార్క్​ ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదు. మూడుసార్లు అంచనా విలువ పెంచారు. అలాగే వెంచర్​లేఅవుట్​లో ఉన్న స్థలంలో పార్క్​ నిర్మించకుండా కొంచెం పక్కకు జరిపారు. ఇతర వెంచర్​లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
- సత్యరఘుపాల్​రెడ్డి, బీజేపీ మున్సిపల్ ​ఫ్లోర్​ లీడర్, నారాయణపేట