మహాలక్ష్మి స్కీమ్​పై శాస్త్రీయ, సామాజిక ప్రభావాలు

మహాలక్ష్మి స్కీమ్​పై శాస్త్రీయ, సామాజిక ప్రభావాలు

తెలంగాణ కొత్త ప్రభుత్వం మహిళా సంక్షేమ చర్యల్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్​ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే ఈ స్కీమ్​ను 9 డిసెంబర్ 2023న ప్రారంభించింది. ఈ పథకం లక్షలాది గృహాల బడ్జెట్‌‌‌‌కు ఆర్థికంగా చేయూతగా ఉండటమే కాకుండా మహిళా చైతన్యానికి బూస్ట్‌‌‌‌గా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్​ఆర్​టీసీ) ఛార్జీలను అనేకసార్లు పెంచిన నేపథ్యంలో ఈ పథకం అమలులోకి వచ్చింది. గత ప్రభుత్వం వాస్తవానికి ప్రజారవాణాపై కఠినంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి టీఎస్​ఆర్​టీసీ ఉచిత ప్రయాణ పథకాన్నిప్రారంభించిన పక్షం రోజుల నుంచి మేము ఈ పాకెట్-ఫ్రెండ్లీ స్కీమ్​ను శాస్త్రీయ, పర్యావరణ, ఆరోగ్య దృక్పథాల పరంగా పరిశీలించాం. మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం సంక్షేమ చర్యగా ప్రారంభించినప్పటికీ,  ఈ పథకంపై రాజకీయ, సామాజిక, వాతావరణ ప్రభావం పడింది. రోడ్ల రద్దీ తగ్గడం, వాహనాల నుంచి వెలువడే తక్కువ ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం తగ్గడం,  ఆరోగ్యం మెరుగుపడడం, ఉత్పాదకత మెరుగుపడడం, ఆస్తమా వంటి వ్యాధుల తీవ్రత తగ్గడం జరిగింది. సమాజ శ్రేయస్సుపై ఈ స్కీమ్​ ప్రభావం అపారంగా ఉంది. 

టీఎస్​ఆర్​టీసీకి మళ్లీ గౌరవం

గత ప్రభుత్వ పాలనలో భారంగా ఉన్న పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్‌‌‌‌ టీఎస్​ఆర్​టీసీ నేడు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్​ఈపీ) ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారింది. మహిళలకు, పర్యావరణానికి అపారమైన మద్దతునిచ్చే పబ్లిక్ క్యారియర్‌‌‌‌గా ఉన్నతి పొందింది. కొత్త ప్రభుత్వ పాలన టీఎస్​ఆర్​టీసీకి ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. టీఎస్​ఆర్​టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆదాయ లక్ష్యం, లక్ష్యాలను చేరుకోలేనివారికి జరిమానా విధించడం వంటివి ఇప్పుడు లేవు. టీఎస్​ఆర్​టీసీ డ్రైవర్లు ఇప్పుడు రిలాక్స్‌‌‌‌గా, గౌరవప్రదంగా డ్రైవింగ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం టీఎస్​ఆర్​టీసీని ఒక ప్రైవేట్ కంపెనీగా పరిగణించింది. సంస్థ ఆదాయం, కార్పొరేషన్ లాభాలపైనే దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో టీఎస్​ఆర్​టీసీ ఉద్యోగులు 51 రోజులపాటు సమ్మె చేశారు. ఒకవైపు ప్రజల బాధలు, మరోవైపు టీఎస్​ఆర్​టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలు, యూనియన్ల అణచివేత,  సమ్మెకాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదవశాత్తు మరణాలు సంభవించడం, బస్, బస్ పాస్ ఛార్జీలు భారీగా పెరగడం లాంటివి మరచిపోలేనివి, క్షమించరానివి. జనాభాలో 50శాతం ఉన్న మహిళలు మహాలక్ష్మి పథకాన్నిఎందుకు స్నేహపూర్వకంగా భావిస్తున్నారో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

సామాజిక ప్రభావం

గత 9, 10 ఏండ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించని మహిళలు కూడా.. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి మౌలాలికి పూల కొనుగోళ్లను తీసుకువెళ్లే రోడ్డు పక్కన పూల వ్యాపారులు, తార్నాక నుంచి సైఫాబాద్ వరకు కార్యాలయాలకి వెళ్లేవారు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. సామాజిక సమానత్వం స్పష్టంగా కనిపిస్తోంది. తల్లిదండ్రులతో పాటు విద్యార్థిలోకం కూడా సంతోషంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, నెలవారీ సాధారణ బస్ పాస్ అత్యధికంగా నెలకు రూ.1330గా ఉంది. 

పర్యావరణ ప్రభావం

ఇంతకుముందు ప్రైవేట్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను అద్దెకు తీసుకున్నవారు, లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే మహిళలు ప్రస్తుతం పబ్లిక్​ ట్రాన్స్​పోర్టును ఎంచుకున్నారు. రోడ్లపై తక్కువ సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తే వాహన ఉద్గారాలు తగ్గి వాయుకాలుష్యం తగ్గుతోంది. శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. గ్లోబల్​ ఎనర్జీ సంబంధిత కార్బన్​ డయాక్సైడ్​లో దాదాపు నాలుగింట ఒక వంతుకు వాహన రవాణా బాధ్యత వహిస్తుందని అంచనా. కార్బన్ డయాక్సైడ్ మన భూగోళ అస్తిత్వ ముప్పునకు దారితీసే ప్రధాన కాలుష్య కారకాల్లో ఒకటిగా పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు నుంచి ఆర్టీసీ బస్సులకు మారడం వలన రోడ్లపై ట్రాఫిక్​ తగ్గుతోంది. ఆటోలు, క్యాబ్‌‌‌‌లు, ప్రైవేట్ వాహనాలు భారీగా రోడ్లపైకి రాకపోవడం ఆటోమేటిక్‌‌‌‌గా రోడ్ల రద్దీని తగ్గిస్తుంది. బస్ రాపిడ్ ట్రాన్సిట్‌‌‌‌, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ప్రజా రవాణా కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలలో ఓ భాగం. డబ్ల్యూహెచ్​ఓ నివేదిక ప్రకారం 'అర్బన్ మొబిలిటీ అనేది సామాజిక అసమానతలతో సహా పట్టణ జీవన నాణ్యత, ఆరోగ్యం, కాలుష్యం ప్రభావాల సవాళ్లలో ఒకటిగా మారింది.

టీఎస్​ఆర్​టీసీని బలోపేతం చేయాలి

డబ్ల్యూహెచ్​ఓ తన నివేదికలో గాలి నాణ్యత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు తీసుకోగల చర్యలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థలు, సైకిల్-ఫ్రెండ్లీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను నిర్మించాలి. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గడం, రద్దీ లేని రోడ్లు, ఆరోగ్యపరంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. రైలు ప్రయాణం వల్ల ఆర్థిక భారం తక్కువ అవడంతోపాటు కాలుష్య రహిత ప్రయాణ రీతుల్లో రైలు ప్రయాణం ఒకటిగా పరిగణించడమైంది. మెరుగైన రవాణా కోసం పౌరుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించాలి. ఎంఎంటీఎస్​ను బలోపేతం చేయడంతోపాటు నాన్​ మోటరైజ్డ్​ సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజలకు ప్రభుత్వం అందించాలి. మహిళలకు ఉచిత ప్రజా రవాణా అందించే ఈ మహాలక్ష్మి పథకం తప్పక కొనసాగాలి. యూరోపియన్​ దేశాల మాదిరిగా దీన్ని క్రమంగా ప్రజలందరికీ విస్తరింపజేయవచ్చు. మన మంత్రులు, అధికారులు పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు ద్వారా ప్రయాణించేలా చేయడం 'సామాజిక, ప్రజా తెలంగాణ'కు నాంది పలికే చర్యల్లో ఒకటిగా పేర్కొనవచ్చు.

ఆరోగ్య సూచీ మెరుగుదల

దశాబ్దాల నాటి పండ్ల మార్కెట్‌‌‌‌లను నగరం నుంచి తరలించి ఆసుపత్రుల నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసింది. అయితే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కాలుష్య కారకాలను తొలగించే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యం తీవ్రమైంది.  హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతుందని హైదరాబాదీలు భయపడటం ప్రారంభించారు. మరోవైపు వాయు కాలుష్యం వల్ల మన ఆరోగ్యానికి జరిగే నష్టానికి సంబంధించిన సాక్ష్యాలు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పర్టిక్యులేట్ మ్యాటర్, ముఖ్యంగా పీఎం 2.5 ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశించగలదు. ఇది హృదయనాళ,  సెరెబ్రోవాస్కులర్ (స్ట్రోక్), శ్వాసకోశ దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఎన్​వో2 శ్వాసకోశ వ్యాధులతో, ముఖ్యంగా ఆస్తమాతో సంబంధం కలిగి ఉంటుంది. 

 

- డాక్టర్ లుబ్నా సర్వత్, ఫౌండర్-డైరెక్టర్, సెంటర్  ఫర్ వెల్‌‌‌‌బీయింగ్ ఎకనామిక్స్,