స్మార్ట్‌‌ఫోన్ లో సముద్రపు సమాచారం 

స్మార్ట్‌‌ఫోన్ లో సముద్రపు సమాచారం 

సముద్రపు కెరటాల తాకిడిని కెమెరాల్లో బందిస్తూ, అలల వేగాన్ని శాటిలైట్​తో లెక్కిస్తూ..ఎప్పుడు?.. ఏ బీచ్?..​ ఎలా ఉందో ? చెప్తోంది న్యూరల్​ నెట్​వర్క్​! వైజాగ్​, గోవా బీచ్​లు ఇప్పుడు ఎట్లున్నయో ప్రతిక్షణం అప్​డేట్​ చేస్తుంది ఈ నెట్​వర్క్​.

సముద్రానికి వెళ్లి ఎంజాయ్‌‌ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి పూర్తి సమాచారం ముందే తెలుసుకోవాలి. లేదంటే అనుకోకుండా ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. అయితే, సముద్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందుకే రియల్‌‌టైమ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఉంటే, కరెక్ట్‌‌ డెసిషన్‌‌ తీసుకోవచ్చు. అందుకే త్వరలో బీచ్‌‌, సముద్రానికి సంబంధించిన రియల్‌‌టైమ్‌‌ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ‘ఇండియన్‌‌ నేషనల్‌‌ సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఓషన్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ సర్వీసెస్‌‌ (ఐఎన్‌‌సీఏఐఎ స్‌‌)’ కు చెందిన సైంటిస్ట్‌‌లు కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ‘ఏఐ (ఆర్టిఫీషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌)’ ఉపయోగించి,  ‘ఏఎన్‌‌ఎన్‌‌ (ఆర్టిఫీషియల్‌‌ న్యూరల్‌‌ నెట్‌‌వర్క్‌‌)’ అనే కొత్త వ్యవస్థను ఇంట్రడ్యూస్‌‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇది ఎక్స్‌‌పెరిమెంటల్‌‌ స్టేజ్​లో ఉంది.

ఎలా పని చేస్తుంది?

ఇది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్‌‌‌‌ ఆధారంగా పనిచేసే సిస్టమ్‌‌. ఒక సమాచారాన్ని మన మెదడు ఎలా విశ్లేషిస్తుందో అలాగే పనిచేస్తుంది. అయితే, మెదడుకు సాధ్యంకాని స్థాయిలో ఇది పనిచేస్తుంది. ఏఐను ఉపయోగించి, ఏఎన్‌‌ఎన్‌‌ ద్వారా సమాచారాన్ని అనలైజ్​ చేయడానికి​ సముద్ర తీర ప్రాంతంలో కొన్ని హై రెజల్యూషన్‌‌ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. ఇవి ఎప్పటికప్పుడు సముద్ర తీరం, కెరటాలు వంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌‌ను కలెక్ట్‌‌ చేస్తాయి. అలాగే శాటిలైట్స్‌‌ ద్వారా కూడా సమాచారం అందుతుంది. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతులో, నీటిపై తేలే పరికరాల ద్వారా ప్రత్యేక సెన్సర్స్‌‌ ఏర్పాటు చేస్తారు. ఇవి సముద్రం నీళ్లలోని ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌, ఇతర న్యూట్రియెంట్స్‌‌, ఆల్గే, టెంపరేచర్‌‌‌‌, తరంగాలు వంటి సమాచారాన్ని అందిస్తాయి. ఈ డాటాను అంతా విశ్లేషించి, సరైన సమాచారాన్ని ఏఎన్‌‌ఎన్‌‌ అందిస్తుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీని ఇప్పుడు డెవలప్‌‌ చేస్తున్నారు. స్మార్ట్‌‌ఫోన్‌‌ ద్వారా యూజర్స్‌‌ ఈ ఇన్ఫర్మేషన్‌‌ తెలుసుకోవచ్చు.

ఎక్కడ?

ప్రయోగదశలో ఉన్న ఈ టెక్నాలజీని ప్రస్తుతానికి గోవా, విశాఖపట్నం, ముంబైలలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. దీని ద్వారా టూరిస్ట్‌‌లకు, చేపల వేటకు వెళ్లే వాళ్లకు చాలా హెల్ప్‌‌ అవుతుంది.

ఎంత ఉపయోగం

ఇది రియల్‌‌టైమ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ అందిస్తుంది. కాబట్టి, ఎవరైనా బీచ్‌‌కు వెళ్లాలంటే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఈత కొట్టడానికి అనువైన ప్రదేశం.. సర్ఫింగ్‌‌ చేయొచ్చా.. ఏ బీచ్‌‌ క్లీన్‌‌గా ఉంది? కెరటాలు ఎలా ఉన్నాయి? వంటి వాటితోపాటు షార్క్‌‌ చేపలు, ప్రమాదకర జెల్లీఫిష్‌‌లు వంటివి ఉన్నాయో
లేదో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఇంత పూర్తిస్థాయి సమాచారం అందించలేదు. ఇది కచ్చితంగా టూరిస్ట్‌‌లకు హెల్ప్‌‌ చేస్తుందని బాలకృష్ణన్‌‌ నాయర్‌‌‌‌ అనే సైంటిస్ట్‌‌ అంటున్నారు.