చైనా యువకుడిలో అల్జీమర్స్ గుర్తించిన సైంటిస్టులు

చైనా యువకుడిలో అల్జీమర్స్ గుర్తించిన సైంటిస్టులు
  • ప్రపంచంలో ఇంత చిన్న ఏజ్ లో అల్జీమర్స్ రావడం ఇదే ఫస్ట్ టైం 
  • కారణాలేంటో తెలియట్లేఅంటున్న ఎక్స్​పర్ట్​లు

షెఫీల్డ్ (యూకే): మెదడు మెమరీ పవర్ ను దెబ్బతీసే అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా వయసు పైబడిన వాళ్లకే వస్తుంటుంది. ముప్పై ఏండ్లలోపు వాళ్లకు ఈ డిసీజ్ రావడం చాలా అరుదు. అయితే, చైనాకు చెందిన ఓ యువకుడికి 19 ఏండ్లకే అల్జీమర్స్ వచ్చిందని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఈ డిసీజ్ రావడం ఇదే ఫస్ట్ టైం అని తెలిపారు. ‘‘స్కూల్ లో చదువుతుండగా 17 ఏండ్లకే అతడికి మెమరీ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. చదువుపై కాన్సెంట్రేట్ చేయడం కష్టమైంది. ఏడాది గడిచేసరికి అతడికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ సమస్య వచ్చింది. దీంతో తిన్నాడా? లేదా? హోం వర్క్ చేశాడా? లేదా? అన్నది కూడా మరిచిపోవడం మొదలైంది.

మెమరీ లాస్ మరింత తీవ్రం కావడంతో చివరకు అతను స్కూల్ మానేశాడు” అని యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. అతనికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ‘ప్రాబబుల్ అల్జీమర్స్’గా కన్ఫమ్ చేశామని చెప్పారు. ‘‘మెమరీకి కీలకం అయిన మెదడులోని హిప్పోక్యాంపస్ భాగం కుచించుకుపోయింది. పేషెంట్ కుటుంబంలో ఎవరికీ అల్జీమర్స్ వచ్చిన హిస్టరీ లేదు. జన్యుపరమైన కారణాలు ఉన్నాయా? అని జీనోమ్ ను కూడా చెక్ చేశాం. కానీ అల్జీమర్స్ కు కారణమైన జన్యువులేవీ లేవు. దీంతో ఇంత చిన్న ఏజ్ లో అతనికి ఈ డిసీజ్ ఎందుకు వచ్చిందన్నది మాత్రం అంతుచిక్కడంలేదు” అని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ కేస్ స్టడీ వివరాలు ఇటీవల ‘అల్జీమర్స్ డిసీజ్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.

2 ప్రొటీన్​లు,3 జన్యువుల వల్లే అల్జీమర్స్ 

సాధారణంగా వయసు పైబడిన వాళ్ల మెదడులో బీటా అమైలాయిడ్, టీఏయూ అనే రెండు రకాల ప్రొటీన్స్ ఏర్పడటం వల్ల అల్జీమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారసత్వంగా వచ్చే అమైలాయిడ్ ప్రీకర్సర్ ప్రొటీన్ (ఏపీపీ), ప్రిసెనిలిన్1 (పీఎస్ఈఎన్1), ప్రిసెనిలిన్2 (పీఎస్ఈఎన్2) అనే జీన్స్ కు, అల్జీమర్స్ కు సంబంధం ఉందని కూడా సైంటిస్టులు గుర్తించారు. అయితే, 30 ఏండ్లలోపు వాళ్లకు ఈ డిసీజ్ రావడం చాలా అరుదు. ఇప్పటివరకు అతి తక్కువగా 21 ఏండ్ల వయసులో ఓ వ్యక్తికి జీన్స్ కారణంగా అల్జీమర్స్ వచ్చినట్లు చెప్తున్నారు.