శాండ్ విచ్ బ్యాటరీ.. వెహికల్ లైఫ్ పెంచుతది

శాండ్ విచ్ బ్యాటరీ.. వెహికల్ లైఫ్ పెంచుతది

ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ మొదలు ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌‌లోనూ లిథియం అయాన్ బ్యాటరీలు ఉండడం చాలా కామన్. ఎలక్ట్రిక్ చార్జ్ స్టోర్ చేసుకుని తర్వాత వాడుకునే వీలున్న ప్రతి వస్తువులోనూ వాడేది దీనినే. అయితే దీని కంటే మరింత సమర్థవంతంగా పని చేసే బ్యాటరీని సరికొత్త టెక్నిక్‌‌తో హార్వర్డ్ సైంటిస్టులు డెవలప్ చేశారు. లిథియం అయాన్ స్థానంలో లిథియం మెటల్ బ్యాటరీని రూపొందించారు. బ్రెడ్ శాండ్‌‌విచ్ స్టైల్‌‌లో దీనిని తయారు చేశారు. ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌లో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే ఈ కొత్త బ్యాటరీ ఎనర్జీ ఎఫీషియన్సీ చాలా ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. దీనిని వాడితే ఆ వాహనం లైఫ్ కూడా పెరుగుతుందంటున్నారు.

ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ బ్యాటరీ ఫెయిల్యూర్స్‌‌కి చెక్

ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ ఎఫీషియన్సీ మరింత పెంచడం కోసమే శాండ్‌‌విచ్ స్టైల్ లిథియం మెటల్ బ్యాటరీని తయారు చేసినట్లు హార్వర్డ్ సైంటిస్టులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌‌లోకి వస్తున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీలే వాడుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ లోపలి భాగంలో చీలికల్లా ఏర్పడి మొత్తానికే బ్యాటరీ ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఎక్కువ ఎనర్జీని క్యారీ చేయడం, డిశ్చార్జ్ చేయాల్సి రావడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ ఎఫీషియన్సీ, లైఫ్ కూడా కొన్నేండ్లకే తగ్గిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకు లిథియం మెటల్ బ్యాటరీ సాయంతో చెక్ పెట్టొచ్చని తెలిపారు. ఈ బ్యాటరీలకు ఎలక్ట్రిక్ ఎనర్జీని క్యారీ చేసే ఎఫీషియన్సీ చాలా ఎక్కువని పేర్కొన్నారు.

ఇన్నేండ్లుగా వాడకపోవడానికి కారణం

లిథియం మెటల్ బ్యాటరీల ఎఫీషియన్సీ ఎక్కువని తెలిసినా ఇన్నేండ్లుగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌లో వీటిని వాడకపోవడానికి అసలు కారణం.. ఇవి మళ్లీ మళ్లీ రీచార్జ్ చేసుకోవడానికి పనికిరాకపోవడమే. అయితే ఈ సమస్యను అధిగమించేందుకే శాండ్‌‌విచ్ టెక్నిక్ వాడామని హార్వర్డ్ సైంటిస్టులు తెలిపారు. రెండు బ్రెడ్‌‌ల మధ్యలో టమాటో, ఇతర పదార్థాలను పెట్టినట్టుగా అడుగున లిథియం యానోడ్, టాప్‌‌లో క్యాథోడ్ ఉంచి వాటి మధ్యలో గ్రాఫైట్, మల్టీ లేయర్ ఎలక్ట్రోలైట్లను ఉంచి ఈ కొత్త బ్యాటరీని తయారు చేశామన్నారు. దీని ద్వారా పది వేల సార్లు  చార్జ్, డిశ్చార్జ్ కెపాసిటీ వచ్చినట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు. 

పదిహేనేండ్లు మార్చాల్సిన అవసరం లేదు

ఈ శాండ్‌‌వించ్ లిథియం మెటల్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌ లైఫ్ టైమ్ పదేండ్ల నుంచి పదిహేనేండ్లకు పెరుగుతుందని సైంటిస్టులు తెలిపారు. ఇందుకోసం మధ్యలో ఎప్పుడూ బ్యాటరీ మార్చాల్సిన అవసరం రాదని వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌‌లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల సామర్థ్యం.. ఆ బండి వాడకం ఆధారంగా ఏడెనిమిదేండ్లలో తగ్గిపోతుందని, దీంతో బ్యాటరీ కొత్తది వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇందుకోసం దాదాపు లక్ష రూపాయలు పైగా ఖర్చవుతుంది. 

తక్కువ టైమ్‌‌లో ఫుల్ చార్జింగ్

లిథియం అయాన్ బ్యాటరీ ఫుల్ రీచార్జ్ చేయడానికి కనీసం గంట పైగా సమయం పడుతుందని, అదే ఈ కొత్త లిథియం మెటల్ బ్యాటరీ అయితే కేవలం 10 నుంచి 20 నిమిషాల లోపే ఫుల్ చార్జ్ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ చేయడం స్టార్ట్ చేస్తే కస్టమర్లకు ఖర్చు తగ్గడంతో పాటు చార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ బ్యాటరీలోని లిథియం స్టెబులిటీ లేని అయాన్ల రూపంలో కాకుండా ప్యూర్ మెటల్ ఫామ్‌‌లో చార్జ్ అవుతుందని, అలాగే ఎలక్ట్రోలైట్ జెల్ బదులు వేర్వేరు లేయర్ల సాలిడ్ మెటీరియల్ ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల ఎఫీషియన్సీ, లైఫ్ పెరుగుతుందని తెలిపారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీలు డ్యామేజ్ అయ్యే చాన్స్ తక్కువని, ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరగవని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీని డెవలప్ చేసిన హార్వర్డ్ జాన్ ఎ.పాల్‌‌సన్ స్కూల్ ఆఫ్​ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ సైంటిస్టులు దీనికి సంబంధించిన వివరాలను ది నేచర్ సైన్స్ జర్నల్‌‌లో పబ్లిష్ చేశారు. ఈ బ్యాటరీలు కమర్షియల్ వినియోగంలోకి రావడానికి కొంత సమయం పడుతుందని అందులో పేర్కొన్నారు.