భారత్​కు ఎస్​సీవో సారథ్యం

భారత్​కు ఎస్​సీవో సారథ్యం

టీఎస్​పీఎస్సీ నిర్వహించే అన్ని గ్రూప్స్​ ఎగ్జామ్స్​లో జనరల్​ స్టడీస్​ పేపర్​ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులోని 11 అంశాల్లో అంతర్జాతీయ వ్యవహారాలు కీలకమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటైన కూటముల్లో భారత్​ భాగస్వామ్యంపై ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో 2022లో జరిగిన కూటముల సమావేశాలు, భారత్​ భాగస్వామ్యం, థీమ్​, డిక్లరేషన్లను తెలుసుకుందాం.  

షాంఘై కో–ఆపరేషన్​ ఆర్గనైజేషన్ సభ్యదేశాల అగ్రనేతల 22వ శిఖరాగ్ర సదస్సు 2022 సెప్టెంబర్​ 15–16వ తేదీల్లో  ఉజ్బెకిస్తాన్​లోని సమర్​ఖండ్​ నగరంలో జరిగింది. కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఎస్​సీవోలోని సభ్య దేశాల నేతలందరూ ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఎస్​సీఓలో ప్రస్తుతం భారత్​, చైనా, పాకిస్తాన్​, రష్యా, కజకిస్తాన్​, తజకిస్తాన్​, ఉజ్బెకిస్తాన్​ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​, పాకిస్తాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​, చైనా అధినేత జిన్​పింగ్​ తదితర నేతలు హాజరయ్యారు. బెలారస్​, ఇరాన్​లకు ఎస్​సీవో శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని ఎస్​సీఓ 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించారు. 2001లో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థలో ప్రస్తుతం చైనా, భారత్​, కజకిస్తాన్​, కర్గిజిస్తాన్​, రష్యా, పాకిస్తాన్​, తజకిస్తాన్​, ఉజ్బెకిస్తాన్​ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఎస్​సీవో అధ్యక్షత బాధ్యతలను రొటేషన్​ పద్ధతిలో భారత్​కు ఉజ్బెకిస్తాన్ అప్పగించింది. 2023లో ఎస్​సీవో 23వ శిఖరాగ్ర సదస్సుకు భారత్​ అతిథ్యమివ్వనుంది.

14వ బ్రిక్స్​ సదస్సు

బ్రిక్స్​(బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాల 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2022 జూన్​ 23, 24వ తేదీల్లో వర్చువల్​ విధానంలో జరిగింది. ఫాస్టర్​ హైవ్​ క్వాలిటీ బ్రిక్స్​ పార్ట్​నర్​షిప్​, యూషర్​ ఇన్​ ఈ న్యూ ఎరా ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్​ అనే థీమ్​తో బ్రిక్స్​ సదస్సును నిర్వహించారు. చైనా అధ్యక్షతన జరిగిన ఈ ఐదు దేశాల వర్చువల్​ సమావేశంలో ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​, భారత్​ ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​, బ్రెజిల్​ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రమఫోసా పాల్గొన్నారు. బ్రిక్స్​ చైర్మన్​గా ప్రస్తుతం చైనా వ్యవహరిస్తోంది. బ్రిక్స్​ 14వ శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆ కూటమి దేశాధినేతలు బీజింగ్​ డిక్లరేషన్​ విడుదల చేశారు. 

శ్రీలంక అధ్యక్షతన బిమ్​స్టెక్​

బిమ్​స్టెక్​ (బే ఆఫ్​ బెంగాల్​ ఇనిషియేటివ్​ ఫర్​ మల్టీ సెక్టోరల్​ టెక్నికల్​, ఎకనామిక్​ కో–ఆపరేషన్​) దేశాధినేతల ఐదో శిఖరాగ్ర సదస్సు 2022 మార్చి 30న జరిగింది. శ్రీలంక అధ్యక్షతన వర్చువల్​ విధానంలో నిర్వహించిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా ప్రసంగించారు. ఈ సందర్భంగా కూటమి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. బంగాళాఖాతం ప్రాంతం అనుసంధానిత, భద్రతకు వారధిగా మారాలని పిలుపునిచ్చారు. బిమ్​స్టెక్​ కూటమి సచివాలయ ఖర్చుల కోసం మిలియన్ డాలర్లు అందజేస్తామని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సదస్సులో బిమ్​స్టెక్​ చార్టర్​ను తీసుకురావడం కీలకమైన ముందడుగు అని మోడీ అభివర్ణించారు.

యూఎన్​ఓ 77వ సదస్సు

ఐక్యరాజ్య సమితి 77వ వార్షిక సర్వసభ్య సమావేశాలు 2022 సెప్టెంబర్ 13 నుంచి 27 వరకు అమెరికాలోని న్యూయార్క్​లో ఉన్న యూఎన్​ఓ ప్రధాన కార్యాలయంలో జరిగాయి. 77వ సెషన్​ ఐరాస సర్వసభ్య సమావేశాల థీమ్​ ఏ వాటర్​ షెడ్​ మూవ్​మెంట్​: ట్రాన్స్​ఫార్మెటివ్​ సొల్యూషన్స్​ టు ఇంటర్​లాకింగ్​ చాలెంజెస్​. రెండేళ్ల తర్వాత సభ్యదేశాల ప్రతినిధులంతా న్యూయార్క్​లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాలకు నేరుగా హాజరుకావడం గమనార్హం. 193 దేశాలు ప్రాతినిధ్యం ఉన్న ఈ సమావేశాల్లో ఈసారి 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​–2022 ఉద్యమంపై ఏర్పాటు చేసిన సభలో యునిసెఫ్​ గుడ్​విల్​ అంబాసిడర్​గా ఉన్న బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా ప్రారంభ ఉపన్యాసం చేశారు. 

భారత్​, ఇజ్రాయెల్​, అమెరికా, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సదస్సు 2022 జులై 14న వర్చువల్​గా జరిగింది. ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్​, ఇజ్రాయెల్​ ప్రధాని యూయిర్​ లాపిడ్​, యూఏఈ పాలకుడు షేక్​ మహ్మద్ బిన్​ జాయెద్​ అల్​ సహ్యాన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. అగ్రికల్చర్​ ఇన్నోవేషన్​ మిషన్​ ఫర్​ క్లైమేట్​ ఇనీషియేటివ్​పై ఆసక్తి చూపిన భారత్​ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్​ స్వాగతించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో గుజరాత్​లో హైబ్రిడ్​ రెన్యూవబుల్​ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. గుజరాత్​లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్​ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు. 

భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి(క్వాడ్రిలేటరల్​ సెక్యూరిటీ డైలాగ్​) దేశాల నాలుగో శిఖరాగ్ర సదస్సు 2022 మే 24న జపాన్​ రాజధాని టోక్యోలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్​ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉక్రెయిన్​, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్​ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. క్వాడ్​ నేతల తదుపరి ముఖాముఖి సదస్సు ఆస్ట్రేలియాలో 2023లో జరగనుంది. ఇండో– పసిఫిక్​ జలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇండో పసిఫిక్​ నౌకాదళ రంగ అవగాహన కార్యక్రమానికి క్వాడ్​ శ్రీకారం చుట్టింది. ఇండో– పసిఫిక్​ ప్రాంతంలో విపత్తులను కలిసికట్టుగా మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకుగాను మానవతా సహాయం, విపత్తు సహాయం చర్యలపై క్వాడ్​ భాగస్వామ్యం ఏర్పాటును కూడా తాజాగా ప్రకటించారు.