ఓరుగల్లు జడ్పీ పీఠాలపై.. పెద్దోళ్ల చూపు ఫ్యామిలీ, అనుచరుల కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అడుగులు

ఓరుగల్లు జడ్పీ పీఠాలపై.. పెద్దోళ్ల చూపు  ఫ్యామిలీ, అనుచరుల కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అడుగులు
  • ములుగు జిల్లాలో కోడళ్ల కోసం నేతల తాపత్రాయం
  • మహబూబాబాద్‍లో కుమారుడి కోసం ప్రభుత్వ పెద్దతోపాటు ఓసీ నేతల ఆరాటం 
  • భూపాలపల్లిలో ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల మధ్య పోటీ
  • జనరల్‍, బీసీ, ఎస్టీ కోటా స్థానాలపై బడా లీడర్ల కన్ను
  • ఎస్సీ రిజర్వేషన్​ స్థానాల్లో ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం ఆరాటం

వరంగల్‍, వెలుగు: జడ్పీ చైర్‍పర్సన్‍ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పెద్ద లీడర్లు అడగులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులు లేదంటే ప్రధాన అనుచరుల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్‍ రెండు టర్ముల్లో తన హవా కొనసాగించగా, ఈసారి బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్​ నేతలు విజయంపై ధీమాతో ఉన్నారు. రిజర్వేషన్‍ కలిసొచ్చినచోట తమవాళ్లను బరిలో ఉంచేలా ఎవరికివారుగా హైకమాండ్‍ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 6 జడ్పీ  స్థానాలు ఉండగా, ప్రధానంగా జనరల్‍, బీసీ జనరల్‍, ఎస్టీ మహిళా రిజర్వేషన్ల చైర్‍పర్సన్ల స్థానాల్లో బడాలీడర్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది.

ఎస్టీ మహిళా కోటాలో కోడళ్లు, బిడ్డల కోసం 

ములుగు జిల్లా జడ్పీ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వేషన్‍ కావడంతో ఓ మహిళా మంత్రి తన కుమారుడి భార్య లేదంటే మేనకోడలిని బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేకపోతే మేడారం జాతర ప్రధాన పూజరుల కుటుంబానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ సైతం తన కోడలిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హస్తం పార్టీ నుంచి గతంలో ములుగు కేంద్రంగా వెలుగు వెలిగి ఆపై పక్క జిల్లాలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత సైతం కుటుంబ సభ్యుల రూపంలో తిరిగి ములుగులో అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ములుగు ఎస్టీ జనరల్‍, ఏటూరునాగారం ఎస్టీ జనరల్‍, కన్నాయిగూడెం ఎస్టీ మహిళ స్థానాలు డైరెక్టుగా, మంగపేట జనరల్‍ మహిళ కోటాలో అందుబాటులో ఉన్నాయి. 

జనరల్‍ స్థానంలో కొడుకుల కోసం..

మహబూబాబాద్‍ జడ్పీ జనరల్‍  కావడం రెడ్డి, వెలమ వంటి సామాజికవర్గాల నేతల మధ్య తీవ్రపోటీ నెలకొంది. జడ్పీ పీఠాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా కైవసం చేసుకునే అవకాశమున్నా, మిగతా ఐదుచోట్ల ఆయా వర్గాలకు రిజర్వేషన్‍ కలిసిరావడంతో ఈ జిల్లాలో పార్టీలు ఓసీలకే పీఠం అందిస్తారనే ఆశతో లీడర్లున్నారు. ఈ క్రమంలో గతంలో ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద పోస్టులో ఉన్న నేత తన కుమారుడిని మొదట గంగారం మండల జడ్పీటీసీగా నిలపాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఇదే సామాజికవర్గం నుంచి మరో ఇద్దరు నేతలు సైతం తమ కుటుంబ సభ్యుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లానుంచి ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్టీ సామాజికవర్గం నుంచి ఉండటం, జిల్లాలోని 18 జడ్పీ స్థానాల్లో 7 ఎస్టీలకే రిజర్వేషన్‍ కావడంతో వారు సైతం తమవారికి పీఠం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు ప్రచారముంది. 

బీసీ కోసం ఓసీ నేతల మధ్య పోటీ

జయశంకర్‍ భూపాలపల్లి జడ్పీ పీఠం బీసీ జనరల్‍ రిజర్వు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా హెడ్‍ క్వార్టర్‍ నుంచి ఎమ్మెల్యే తన అనుచరుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పక్కజిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జిల్లా పరిధిలో ఉండే మంథని నియోజకవర్గంలోని తన మండలాల అనుచరులకు అవకాశం ఇప్పించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. గతంలో పరకాల అసెంబ్లీ స్థానం ఆశించిన మాజీ మావోయిస్టు నేత సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. భూపాలపల్లి, చిట్యాల, మహాదేవపూర్‍ (బీసీ జనరల్‍), రేగొండ, కాటారం (జనరల్‍) స్థానాలు పోటీదారులకు అందుబాటులో ఉన్నాయి. 

ఎమ్మెల్యేల చేతిలో 3 స్థానాలు..

వరంగల్‍ జిల్లా ఎస్టీ జనరల్‍, హనుమకొండ, జనగామ జిల్లా పరిషత్​ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. వరంగల్‍ జిల్లాలో పీఠం దక్కించుకోడానికి ఖానాపూర్‍ (ఎస్టీ జనరల్‍) నర్సంపేట (ఎస్టీ మహిళ)తో పాటు దుగ్గొండి (జనరల్‍), చెన్నారావుపేట (జనరల్‍ మహిళ) స్థానాలు సైతం అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇదే జిల్లాలోని ఓ మండలం నుంచి జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన గిరిజన నేత ఖానాపూర్‍ నుంచి బరిలో నిలుస్తాడనే ప్రచారం ఉంది. 

హనుమకొండ జిల్లాలో హసన్‍పర్తి (ఎస్సీ మహిళ), ఐనవోలు (ఎస్సీ జనరల్‍), ఎల్కతుర్తి (ఎస్సీ జనరల్‍), ధర్మసాగర్‍, వేలేరు (జనరల్‍ మహిళ)తో పాటు పరకాల, నడికుడ రూపంలో (జనరల్‍) స్థానాలు అవకాశంగా ఉన్నాయి. జనగామ జిల్లాలో జనగామ, చిల్పూర్‍ (ఎస్సీ జనరల్‍), లింగాల ఘనపూర్‍ (ఎస్సీ మహిళ), బచ్చన్నపేట రూపంలో (జనరల్‍) స్థానం అవకాశం ఉంది. కాగా, రెండు జిల్లాల్లో జడ్పీ పీఠం కోసం ప్రయత్నం చేస్తున్న ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనుల్లో ఉన్నారు.