మోర్బి ఘటనలో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

మోర్బి ఘటనలో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

గుజరాత్‌‌లోని మోర్బిలో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మచ్చు నదిలో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్​ ఆపేసిన సిబ్బంది.. మంగళవారం ఉదయం మళ్లీ రెస్క్యూ పనులు చేపట్టారు. 

రెస్క్యూ ఆపరేషన్...
మచ్చు నదిలోని బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్తో పాటు..స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.  గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. మోర్బీ ఘటనా స్థలంలో మృతదేహాల కోసం శోధిస్తున్నారు. స్టీమర్లతో గాలిస్తున్నారు. 

141 చేరిన మృతుల సంఖ్య
గుజరాత్‌‌లోని మోర్బిలో జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 141కి చేరింది.  ఆదివారం సాయంత్రం పరిమితికి మించి భారీగా జనం వెళ్లడంతో మచ్చు నదిపై కట్టిన తీగల వంతెన కుప్పకూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న వందలాది మంది సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. వారిలో కొంతమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరో వందమంది ఆచూకీ తెలియట్లేదని అధికారులు చెప్పారు. 

9 మంది అరెస్టు!
తీగల వంతెన నిర్వహణ చూస్తున్న ఏజెన్సీపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘సిటీకి చెందిన ఒరెవా గ్రూప్‌‌నకు.. బ్రిడ్జి రినొవేషన్, నిర్వహణ బాధ్యతలను అప్పగించాం. ఈ కంపెనీ గడియారాలు, ఈ బైక్‌‌లు తయారు చేస్తుంది” అని మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలా చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పలువురిని ప్రశ్నించేందుకు పిలిపించినట్లు ఎస్పీ రాహుల్ త్రిపాఠి చెప్పారు. ఒరెవా గ్రూపునకు చెందిన నలుగురు ఉద్యోగులు సహా 9 మందిని అరెస్టు చేశారు. వారిపై 304, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.