బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాల్లోనూ.. 2వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాల్లోనూ.. 2వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాల్లోనూ ఐటీశాఖ అధికారుల సోదాలు 2వ రోజు ఇంకా కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ అధికారుల తనిఖీలతో నాగర్ కర్నూలుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మర్రి జనార్ధన్ రెడ్డికి ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఐటీశాఖ సోదాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో కార్యకర్తలతో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. సోదాల తర్వాత ఐటీశాఖ అధికారులే తనకు అవార్డు ఇచ్చి వెళ్తారని కార్యకర్తలతో చెప్పారు. 

ఇటు కొత్తపేటలోని భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలలో భాగంగా ఎమ్మెల్యేల సతీమణులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల లావాదేవీలపైనా ఐటీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఆయన ఇండ్లు, కార్యాలయాల్లోనూ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఫైళ్ల శేఖర్ రెడ్డి విదేశీ వ్యాపార లావాదేవీలపైనా, ఐటీ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా..? అన్న కీలక సమాచారం రాబడుతున్నారు ఐటీశాఖ అధికారులు. 

ఇటు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంటి వద్దకు భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఐటీ రైడ్స్ కు వ్యతిరేకంగా అనుచరులు, కార్యకర్తలు నినాదాలు చేస్తుండడంతో తన ఇంటి నుంచి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి బయటకు వచ్చి.. కార్యకర్తలను వారించారు. ఐటీ అధికారులకు తాను సహకరిస్తున్నానని, ఎవరూ తన ఇంటి వద్ద నినాదాలు చేయవద్దని సూచించారు. ఐటీ అధికారులు తమ పని తాము చేస్తున్నారని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, తన ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని కార్యకర్తలకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే పిలుపుతో నినాదాలు ఆపి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. గురువారం (జూన్ 15వ తేదీ ) రాత్రి వరకు ఐటీశాఖ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.