
- ఉమ్మడి జిల్లాలో రోజుకు 1000 ఫీవర్ కేసులు
- యాదాద్రిలోనే రోజుకు 250 కేసులు
- ఫీవర్ సర్వే షురూ
యాదాద్రి, వెలుగు : ప్రజలను సీజనల్వ్యాధులు వణికిస్తుండడంతో మంచాన పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వానలకు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం కొరవడింది. రోడ్ల పక్కన చెత్తాచెదారం నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు జనాలు క్యూకడుతున్నారు. ప్రజల అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్హాస్పిటల్స్మరింత దోపిడీకి తెరలేపాయి. అనవసరమైన టెస్ట్‌లు చేయిస్తూ జేబులు నింపుకుంటున్నాయి.
కిక్కిరిసిపోతున్న ఓపీ..
నెల రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరచూ వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లోని ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది. యాదాద్రి జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రి కలిపి ప్రతిరోజు దాదాపు 6 వేల మందికి పైగా ఓపీ నమోదు అవుతోంది. నల్గొండ జిల్లా ఆస్పత్రిలోనే రోజుకు దాదాపు 1000 ఓపీ నమోదు అవుతోంది. సూర్యాపేట జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది.
మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో ప్రతిరోజు దాదాపు 15 వేల మందికి పైగా ఓపీ నమోదు అవుతోంది. యాదాద్రి జిల్లాలో ప్రతిరోజు 250కి పైగా ఫీవర్ కేసులు నమోదు అవుతుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి లక్షణాలతో వచ్చిన వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని టెస్ట్‌ల కోసం వెయిట్చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో డాక్టర్లు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు.
పారిశుధ్యం అస్తవ్యస్తం..
తరచూ కురుస్తున్న వానలతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం అస్తవస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. డ్రెయినేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమల బెదడ పెరిగింది. అనారోగ్యంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నా అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ఇండ్ల మధ్యనే మురుగు నీరు ప్రవహిస్తోంది.
యాదాద్రిలో ఫీవర్ సర్వే ప్రారంభం..
సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని హెల్త్డిపార్ట్మెంట్ యాదాద్రి జిల్లాలో ఫీవర్ సర్వే ప్రారంభించింది. పీహెచ్ సీ, పల్లె దవాఖానల పరిధిలోని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి జ్వరాలపై ఆరా తీస్తున్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ క్యాంపునకు తీసుకెళ్లి ట్రీట్మెంట్అందిస్తున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్‌కే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్‌ల కోసం వెయిట్చేయాల్సి రావడంతోపాటు రిపోర్ట్రావడానికి కనీసం రెండు రోజుల టైమ్ పడుతోంది. తప్పని పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. జనం ఆందోళనను ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్నిర్వాహకులు రకరకాల టెస్ట్‌లు చేయిస్తూ జేబులు ఖాళీ చేయిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పేరుతో జనాలను భయపెడుతున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెంగ్యూ ట్రీట్మెంట్ పొందుతున్న వారి వివరాలు హెల్త్ డిపార్ట్మెంట్కు చేరడం లేదు. ఆర్థికంగా ఉన్న వారు ట్రీట్మెంట్కోసం హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు వెళ్తున్నారు.