తెలంగాణలో ప్రతి పది మందిలో .. ఇద్దరికి దగ్గు, సర్దీ

 తెలంగాణలో ప్రతి పది మందిలో .. ఇద్దరికి దగ్గు, సర్దీ
  • నెల రోజుల్లో 2.16 లక్షల ఫీవర్ కేసులు
  • 4 వేలు దాటిన డెంగీ బాధితుల సంఖ్య
  • చాలా మందిలో కరోనా, స్వైన్‌ఫ్లూ తరహా లక్షణాలు
  • సాధారణ ట్రీట్‌మెంట్‌ సరిపోతుందంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీజనల్ రోగాలు వణికిస్తున్నాయి. ప్రతి పది మందిలో ఇద్దరు సర్దీ, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. వీటి బారిన పడిన వాళ్లు వారం నుంచి పది రోజుల దాకా కోలుకోవడం లేదు. నాలుగైదు రోజుల్లో జ్వరం తగ్గుతున్నా.. ఒళ్లు నొప్పులు వారం వరకు తగ్గడం లేదు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో దవాఖాన్లలో అడ్మిట్‌ అవుతున్నారు. అలా చేరుతున్న వారిలో కరోనా, స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలు ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

టెస్టులు చేస్తే మాత్రం కరోనా, స్వైన్‌ ఫ్లూ నెగెటివ్ వస్తోందని అంటున్నారు. దగ్గు, జలుబుకు కారణమయ్యే ఇన్‌‌ఫ్లూయంజా వైరస్‌‌లు వందల రకాలు ఉంటాయని, ఇవే మ్యుటేట్ అయ్యి లక్షణాలను మార్చుకోవడం సహజమని చెబుతున్నారు. ఈ సీజన్‌‌లో దగ్గు, సర్దీ సహజమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ డాక్టర్ రాజారావు అన్నారు.

అవగాహన కల్పిస్తలే

రోగాలపై అవగాహన కల్పించి, వాటి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్య వ్యవస్థ రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు. హెల్త్ ఎడ్యుకేటర్స్ ఉన్నప్పటికీ.. జనాలకు వ్యాధులకు అవగాహన కల్పించడానికి బదులు, దవాఖాన్లలో ఇతర పనుల కోసం వారిని ఉపయోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్‌‌ఎంలు 15 రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నారు. ఊరూరికీ తిరిగి జనాలకు టెస్టులు చేసి, ఎక్కడికి అక్కడే మందులు అందించే సంచార వైద్య సేవల వ్యవస్థను (104) పూర్తిగా బంద్ చేశారు. 

104 సర్వీసులు ఉన్నప్పుడు, ఊళ్లలోకి వెళ్లి టెస్టులు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు వచ్చిన వాళ్లకు మాత్రమే టెస్టులు చేసేందుకు అవకాశం ఉంది. పీహెచ్‌‌సీలలో శాంపిల్స్ తీసుకుని, వాటిని జిల్లా కేంద్రాల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఈ రిపోర్టులు రావడానికి 2, 3 రోజులు పడుతుండడంతో వ్యాధి మరింత ముదురుతోంది. దీంతో జనాలు ఆర్‌‌‌‌ఎంపీలను, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఇన్​ పేషెంట్లు తక్కువే

సీజనల్ రోగాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ దవాఖాన్లలో ఇన్‌పేషెంట్ల సంఖ్య గతేడాది కంటే తక్కువగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సర్దీ, జ్వరాలు ఉన్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగా ఉండడం వల్లే హాస్పిటల్ అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటున్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల రోజుల్లో 2,16,688 మంది సీజనల్ ఫీవర్ల బారిన పడ్డారు. ఇందులో 1,879 మందికి టైఫాయిడ్, 1,674 మందికి డెంగీ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. వీటితో కలిపి ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య 4,365కు చేరింది. 277 మందికి మలేరియా సోకింది. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య వెయ్యికిపైనే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

యాంటిబయాటిక్స్ అక్కర్లేదు

సాధారణంగా ఇప్పుడు వచ్చే జలుబుకు రైనోవైరస్ కారణమై ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ వ్యక్తుల వల్ల, వైరస్ అంటుకున్న వస్తువుల నుంచి వైరస్ మనకు సోకుతుంది. రైనోవైరస్ ఇన్ఫెక్షన్ చాలా వరకు ముక్కు, గొంతు, తల భాగాలకు పరిమితమవుతుంది. సాధారణ జలుబు, దగ్గు, తలనొప్పి, కాస్త ఒళ్లు నొప్పులకు పరిమితం అవుతుంది. ఇది సాధారణ జలుబు కాబట్టి యాంటిబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా మంది డాక్టర్లను సంప్రదించకుండానే రకరకాల మెడిసిన్, యాంటిబయాటిక్స్ వేసుకుంటున్నారు. దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఒళ్లు నొప్పులు, జ్వరం, తలనొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్‌‌‌‌ను సంప్రదించడం మంచిది.

డాక్టర్ విలియమ్స్‌‌, ఆత్మకూర్ పీహెచ్‌‌సీ, యాదాద్రి

తప్పుడు ప్రచారం

రాష్ట్రంలో కొత్త వైరస్‌‌ అని, మిస్టీరియస్ వైరస్ అని జరుగుతున్న ప్రచారమంతా తప్పు. అలాంటిదేమీ మేము సస్పెక్ట్‌‌ చేయడం లేదు. కరోనా, స్వైన్‌‌ఫ్లూ, సాధారణ ఫ్లూ అన్నీ ఒకే తరహా సింప్టమ్స్ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం కామన్‌‌. ఇప్పుడు వస్తున్న వారిలోనూ ఇవే లక్షణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కొంత మందిలో న్యుమోనియా ఎటాక్ అవుతోంది. వారం రోజుల రెగ్యులర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌తోనే కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. 

డాక్టర్ శంకర్‌‌‌‌, సూపరింటెండెంట్‌‌,    ఫీవర్ హాస్పిటల్‌‌

ఐఎల్‌‌ఐ కేసులు  ఎక్కువగా ఉన్నయ్

మహారాష్ట్ర, కర్నాటకలో కొత్త వైరస్ వస్తోందని, ఇక్కడకు స్ప్రెడ్ అవుతున్నదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదు. కానీ ఐఎల్‌‌ఐ(ఇన్‌‌ఫ్లుయంజా లైక్ ఇల్‌‌నెస్‌‌) కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్‌‌లో వచ్చే ఫ్లూ వైరస్‌‌లో, ఈ తరహా సింప్టమ్స్‌‌ సహజంగా కనిపిస్తాయి. స్వైన్‌‌ ఫ్లూ, కొవిడ్ టెస్టులు రొటీన్‌‌గా ఫ్లూ పేషెంట్లకు చేయిస్తున్నాం. ఒకవేళ పాజిటివ్ వస్తే ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నాం. కొవిడ్, స్వైన్‌‌ఫ్లూ నెగటివ్ వచ్చినంత మాత్రాన కొత్త వైరస్ వచ్చినట్టు కాదు. జనాలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది . ఇంట్లో ఒకరికి సోకినప్పుడు ఇంకొకరికి అంటించ కుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్,  గాంధీ హాస్పిటల్