
- గ్రేటర్‌లోని చాలా సెగ్మెంట్లలో ఇదే తీరు
- ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిన బీజేపీ
- గెలుపులోనూ వెనకబడిన కమలం పార్టీ
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ సిటీలోని చాలా సెగ్మెంట్లలో ముక్కోణపు పోటీ కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించింది. బీజేపీ సైతం ఓట్లను చీల్చగా.. మిగతా ఓట్లు బీఆర్ఎస్కు పడడంతో గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ముక్కోణపు పోటీ జరిగిన ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ లాభపడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు పడి ఉంటే ఆయా చోట్ల గెలుపొందేది. ఎన్నికల ప్రచార సమయంలో గ్రేటర్‌లోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు అనుకూల గాలులు వీచాయి. బీజేపీ సైతం భారీగా ప్రచారం చేయడం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌లో ప్రచారం చేయడంతో కమలం పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఊహించని రీతిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించింది. దీంతో బీఆర్ఎస్ఎక్కువ లాభపడింది. అయితే, బీజేపీ పెద్దగా సీట్లను సాధించలేకపోయింది. కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చీలిన ఓట్లతోనే నష్టం..
గ్రేటర్ కోర్ సిటీలోని ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శివారులోని ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల వంటి స్థానాల్లో ముక్కోణపు పోటీ కొనసాగింది. ముషీరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిన ఓట్లతో బీఆర్ఎస్కు కలిసొచ్చింది. ఇక్కడ మొత్తం లక్షా 52 వేల 551 ఓట్లు పోలైతే.. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్‌కు 75 వేల 207 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్‌యాదవ్‌కు 37 వేల 410 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. అలాగే మేడ్చల్‌లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ జరిగింది. మొత్తం 3 లక్షల 96 వేల 988 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి లక్షా 86 వేల 017 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి లక్షా 52 వేల 598 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ కొనసాగింది. ఇక్కడ 2 లక్షల 64 వేల 25 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి లక్షా 24 వేల 683 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు 74 వేల 872 ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్‌లో మొత్తం 3 లక్షల 99 వేల 852 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందకు లక్షా 87 వేల 999 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్అభ్యర్థి కొలన్హన్మంతరెడ్డికి లక్షా 02 వేల 423 ఓట్లు రావడం గమనార్హం. కూకట్‌పల్లిలోనూ ముక్కోణపు పోటీ కారణంగా కాంగ్రెస్నష్టపోయింది. ఇక్కడ మొత్తం 2,50,864 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు 1,35,635 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్‌కు 60,248 ఓట్లు వచ్చాయి.
శివారులో ఇలా..
ఉప్పల్ లో మొత్తం 2,72,870 ఓట్లు పోలైతే, బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి 1,32,927 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డికి 83,897 ఓట్లుపడ్డాయి. శేరిలింగంపల్లిలో మొత్తం 3,55,692 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి 1,56,577 ఓట్లు పోల్ అవగా.. కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌కు 1,09,930 ఓట్లు వచ్చాయి. చేవెళ్లలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. ఇక్కడ మొత్తం 1,94,834 ఓట్లు పోలయ్యాయి. కాగా బీఆర్ఎస్అభ్యర్థి కాలె యాదయ్యకు 75,843 ఓట్లురాగా, కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్‌కు 74,981 ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరిగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 67,165 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి
విజయారెడ్డికి 45,061 ఓట్లు పడ్డాయి. సికింద్రాబాద్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావుకు 70,254 ఓట్లు రాగా, రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్‌కు 27,810 ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్‌లో 1,77,551ఓట్లు పోల్‌కాగా, బీఆర్ఎస్అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,328 ఓట్లు పడ్డాయి. అలాగే కాంగ్రెస్అభ్యర్థి అజారుద్దీన్‌కు 63,838 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో మొత్తం 1,51,815 ఓట్లు పోల్ కాగా, ఎంఐఎం అభ్యర్థి మాజిద్హుస్సేన్కు 62,195 ఓట్ల పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్కు 60,148 ఓట్లు వచ్చాయి. పటాన్చెరులో మొత్తం 2,76,510 ఓట్లు పోలైతే బీఆర్ఎస్అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డికి 1,05,166 ఓట్లువస్తే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 97,739 ఓట్లు పడ్డాయి. ఇలా చాలా సెగ్మెంట్లలో ముక్కోణపు పోటీ కారణంగా కాంగ్రెస్‌కు ఎక్కువ నష్టం జరిగింది.
ఓల్డ్ సిటీలో మినహా..
గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ ఉంది. దీంతోనే ఓల్డ్ సిటీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల త్రిముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చాలామంది తమ ఓట్ల రూపంలో నిరూపించారు. వాటిలో కొన్ని బీజేపీ ఖాతాలో పడడం కాంగ్రెస్‌కు నష్టం కలిగింది. ఎవరికి వారు గెలుపు మాదే అనే రీతిలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకించి శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో సెటిలర్లు సైతం పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.