అదానీ ఆఫ్​షోర్​ డీల్స్​పై సెబీ నజర్​.. వినోద్​ అదానీ విదేశీ కంపెనీలపై ఫోకస్​

అదానీ ఆఫ్​షోర్​ డీల్స్​పై సెబీ నజర్​.. వినోద్​ అదానీ విదేశీ కంపెనీలపై ఫోకస్​

ముంబై: విదేశాలలోని మూడు కంపెనీలతో అదానీ గ్రూప్​ జరిపిన రిలేటెడ్​ పార్టీ ట్రాన్సాక్షన్లలో నిబంధనల అతిక్రమణ జరిగిందా....అనే అంశాన్నీ సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ మూడు ఆఫ్​షోర్​ కంపెనీలతోనూ అదానీ గ్రూప్ ప్రమోటర్​ గౌతమ్​ అదానీ అన్న వినోద్​ అదానీకి లింకులున్నాయనేది సమాచారం. అదానీ గ్రూప్​లోని అన్​లిస్టెడ్​ కంపెనీలలో చాలా వాటితో ఈ ఆఫ్​షోర్​ కంపెనీలు మూడూ గత 13 ఏళ్లలో  ఇన్వెస్ట్​మెంట్​ ట్రాన్సాక్షన్లను సాగించాయి. పై మూడు ఆఫ్​షోర్​ కంపెనీలలో వినోద్​ అదానీ బెనిఫిషియల్​ ఓనర్, డైరెక్టర్​గా ఉన్నారని,  లేదా మరో రకంగా ఆయనకు వాటితో  లింకులున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

దేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం లిస్టెడ్​ కంపెనీల ప్రమోటర్లకు చెందిన గ్రూప్​లు, చుట్టాలు, సబ్సిడరీ కంపెనీలను రిలేటెడ్​ పార్టీలుగా చెబుతారు. ఒకవేళ అదానీ గ్రూప్​ ఈ రిలేటెడ్​ పార్టీ ట్రాన్సాక్షన్లలో నిబంధనలు ఏవైనా అతిక్రమించిందా? అలాగే గ్రూప్​లోని లిస్టెడ్​ కంపెనీలు...సంబంధిత లావాదేవీల డిస్​క్లోజర్​లో సరిగ్గానే వ్యవహరించాయా అనే కోణంలో సెబీ దర్యాప్తు సాగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రిలేటెడ్​ పార్టీ లావాదేవీలకు వాటాదారుల ఆమోదం సైతం లిస్టెడ్​ కంపెనీలు పొందాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం కోసం సెబీకి పంపిన ఈమెయిల్​కు బదులు రాలేదు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలోనూ సెబీ చెయిర్​ పర్సన్​ మాధబి పురి బుచ్​ అదానీ గ్రూప్​ వ్యవహారంపై మాట్లాడటానికి ఇష్టపడని విషయం తెలిసిందే. వినోద్​ అదానీ హోల్డింగ్​ కంపెనీ అదానీ గ్లోబల్​ ఇన్వెస్ట్​మెంట్​కు పంపిన ఈమెయిల్​కు కూడా జవాబు రాలేదు. జనవరి నెలలో హిండెన్​బర్గ్​ రిసెర్చ్​ రిపోర్టు చేసిన  ఆరోపణల తర్వాత తాజాగా ఈ దర్యాప్తు మొదలైంది.