రెండో రోజు రూ.కోటి నగదు పట్టివేత.. ఆధారాలు చూపించి తీసుకువెళ్లాలన్న పోలీసులు

రెండో రోజు రూ.కోటి నగదు పట్టివేత.. ఆధారాలు చూపించి తీసుకువెళ్లాలన్న పోలీసులు
  • హాలియాలో ఆర్టీసీ బస్సులో రూ.30 లక్షలు..  
  • మేళ్లచెరువు, కోదాడ రూట్​లో రూ.15 లక్షలు.. 
  • జడ్చర్ల క్రాస్​ రోడ్​ వద్ద కారులో రూ.10 లక్షలు.. 

వెలుగు, నెట్​వర్క్​: ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ చేసిన రెండో రోజే రాష్ట్రంలో వివిధ చోట్ల పోలీసులు సుమారు రూ. కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరానికి చెందిన సత్యనారాయణ మిర్యాలగూడ నుంచి మల్లేపల్లికి దేవరకొండ ఆర్టీసీ బస్సులో రూ. 30 లక్షలు తీసుకొని మల్లేపల్లికి వెళ్తుండగా పట్టుకున్నారు. మల్లేపల్లి సమీపంలోని ఓ కాటన్​మిల్లుకు సంబంధించిన డబ్బుగా గుర్తించారు.నాగార్జునసాగర్– హైదరాబాద్ మెయిన్​రోడ్డుపై వెంకయ్య అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి హాలియాకు రూ. లక్ష తీసుకొని వెళ్తుండగా పట్టుకున్నారు. 

జయంత్ అనే వ్యక్తి దేవరకొండ నుంచి హైదరాబాద్ కు రూ. 50 వేలతో వెళ్తుండగా  స్వాధీనం చేసుకున్నారు. చివ్వెంల మండలం హైదరాబాద్ –విజయవాడ నేషనల్​హైవే 65 పై దురాజ్ పల్లి జంక్షన్ వద్ద ఎస్పీ రాజేంద్రప్రసాద్ వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న ఓ వెహికల్​ను తనిఖీ చేయగా రూ. 2.50లక్షలు దొరికింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, కోదాడ మార్గంలో చెక్​ చేస్తుండగా మేళ్లచెరువులోని పద్మశాలీ కాలనీకి చెందిన మువ్వ ఠాగూర్ బైక్ లో రూ.15 లక్షల 50 వేలు దొరికాయి. ఈ డబ్బు హుజూర్​నగర్​కోర్టులో కట్టాల్సి ఉందని, కేసు వాయిదా పడటంతో ఇంటికి తీసుకువస్తున్నట్టు బాధితుడు చెప్పాడు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల క్రాస్​ రోడ్​వద్ద శంషాబాద్​కు చెందిన నల్లోల యాదయ్య కారులో దేవరకద్రకు రూ.10 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఓ కారులో రూ 2.35 లక్షలు దొరికాయి. మదనాపురం మండలం గోవిందహళ్లికి చెందిన చంద్రశేఖర్.. కొత్తకోటలోని వీవర్స్​ కాలనీలో ప్లాటు అమ్మగా వచ్చిన డబ్బులను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.

 మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట చెక్ పోస్ట్​వద్ద రూ.4.5 లక్షలు పట్టుకున్నారు. ఇదే జిల్లా మరిపెడలోని చెక్ పోస్టు వద్ద ఖమ్మం నుంచి హన్మకొండ వెళ్తున్న కారులో రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు.  వరంగల్ నుంచి గూడూరుకు వస్తున్న పత్తి వ్యాపారి డీసీఎం వ్యానులో ఈ డబ్బు దొరికింది. వరంగల్​ పోచమ్మ మైదాన్​ జంక్షన్ వద్ద మర్రి వెంకటయ్య కాలనీకి చెందిన ముగల వేణు దగ్గర రూ.3 లక్షలు, బాబ్బుల సుదర్శన్ నుంచి రూ.4.5 లక్షలు పట్టుకున్నారు. 

సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్​ వద్ద షేక్​రషీద్​కారులో 2.40 లక్షలు, మహ్మద్​ ఇలియాజ్​ కారులో రూ.2 లక్షలు దొరికాయి.  మంచిర్యాల జిల్లా నస్పూర్ లో మునగంట కార్తీక్ బైక్​లో రూ.5లక్షల 50వేలు, నిజామాబాద్ ​జిల్లా ఆర్మూర్ లోని కారులో రూ.లక్షా ఇరవై వేలు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో రూ.2.48 లక్షలు, భద్రాచలంలో రూ.2.74 లక్షలు, మణుగూరులో రూ.2.70 లక్షలు, అశ్వారావుపేటలో రూ.6.05 లక్షలు, కొత్తగూడెంలో రూ.1.20  లక్షలు పట్టుకున్నారు.