V6 News

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ప్రచారం బంద్

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ప్రచారం బంద్
  • పోలింగ్​ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
  • నిజామాబాద్​ డివిజన్​లోని 8 మండలాలు, 
  • కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో 14న పోలింగ్ 
  • ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థుల యత్నాలు 

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు :  రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు లేకపోవడంతో పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. నిజామాబాద్ డివిజన్​లోని 8 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో ఈ నెల 14న పోలింగ్​ జరగనుంది. నిజామాబాద్​జిల్లాలోని ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మాక్లూర్​, మొపాల్​, నిజామాబాద్​ రూరల్​, సిరికొండ, జక్రాన్​పల్లి మండలాల్లో 196 జీపీలు ఉండగా 38 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 1,760 వార్డుల్లో ఐదు వార్డులకు అసలు నామినేషన్​లు వేయలేదు. 674 వార్డులు ఏకగ్రీవం​ కాగా, మిగతా 1,081 వార్డుల నుంచి 2,634 మంది పోటీ చేస్తున్నారు. గురువారం ఎంపీడీవో ఆఫీసుల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ నుంచి పోలింగ్ మెటీరియల్​ తీసుకొని ఎన్నికల నిర్వహణకు సిబ్బంది 1,476 పోలింగ్ సెంటర్స్​ చేరుకోనున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి,  నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి , పిట్లం, నిజాంసాగర్​, మహమ్మద్​నగర్​ మండలాల్లోని  197 పంచాయతీలకు గాను 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.  వార్డు మెంబర్లు మొత్తం  1,654లో  776 ఏకగ్రీవమయ్యాయి. 153లో సర్పంచ్ అభ్యర్థులు 506 మంది పోటీలో ఉన్నారు.  873 వార్డు మెంబర్​ స్థానాలకుగాను 2,655 మంది బరిలో ఉన్నారు. 1655 పోలింగ్​ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

నేడు తరలనున్న ఎన్నికల సిబ్బంది 

ఎన్నికల నిర్వహణ సిబ్బంది శనివారం సాయంత్రం వరకు గ్రామాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే ఆర్వోలు, పోలింగ్​ నిర్వహణ అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్​ ఇచ్చారు. ర్యాండమైజేషన్​ ప్రక్రియ కంప్లీట్ అయ్యింది.  మండల కేంద్రాల్లో పోలింగ్ అధికారులు, సిబ్బందికి మెటిరియల్​ పంపీణీ చేస్తారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

వారం రోజులు హోరెత్తిన ప్రచారం.. 

పల్లెల్లో వారం రోజులు రెండో విడత  ప్రచారం హోరెత్తింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేశారు. మద్దతుదారులకు టిఫిన్స్​​తో పాటు మధ్యాహ్నం లంచ్ అరెంజ్ చేశారు.  అన్ని పల్లెల్లో చికెన్​, మటన్​ భోజనాలు పెట్టించారు. అభ్యర్థుల ఇండ్ల ముందు టెంట్లు వేసి ఫంక్షన్ తరహాలో వడ్డన చేశారు.  సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. ప్రతి ఇంటికీ క్వార్టర్ బాటిల్​ పంపారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల చొప్పున నగదు పంపిణీ షురూ చేశారు.

గెలుపు కోసం ఓట్లు లెక్కలేసుకుని అవసరమైన ఓట్లు ఆ మేరకు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు.  రెండు రోజులకు అవసరమైన లిక్కర్​ బాటిల్స్​ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. కులసంఘాలకు ఫుల్​ బాటిల్స్ పంపుతూ ఓటర్లకు క్వాటర్​ సీసాలు సప్లయ్​ చేస్తున్నారు.

 కామారెడ్డి జిల్లా లింగంపేట  మండలంలోని పలు గ్రామాల్లో 2 రోజులు ఫుల్​గా దావత్​లు అయ్యాయి. ఇప్పటికే కుల సంఘాలకు నజరానాలు ఇచ్చిన అభ్యర్థులు పలు చోట్ల ఓటర్లకు నేరుగా పైసలు ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు. గాంధారి మండలంలో  ముఖ్యమైన గ్రామాల్లో  పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు.  ఎల్లారెడ్డి, పిట్లం, నిజాంసాగర్​, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు చోట్ల మద్యం ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.    ఓటుకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది.