సెకండ్ ఫేజ్ టీకాలు : ఇంటి వద్దే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

సెకండ్ ఫేజ్ టీకాలు : ఇంటి వద్దే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

ఎల్లుండి నుంచి సెకండ్ ఫేజ్ టీకాలు షురూ
రిజిస్ట్రేషన్ కోసం ఇంటికే రానున్న హెల్త్ వర్కర్లు
కొవిన్ పోర్టల్‌, యాప్, ఆరోగ్యసేతులో పేర్లు నమోదు
ప్రైవేట్​ ఆస్పత్రుల్లో వ్యాక్సికేషన్​కు టీకా ధరతో పాటు రూ. 100 సర్వీస్​ చార్జ్​ ఎక్స్​ట్రా

హైదరాబాద్‌‌, వెలుగుదేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్ శుక్రవారం ప్రకటించింది. మార్చి ఫస్ట్ నుంచి కొవిన్ పోర్టల్‌‌, యాప్ లో లేదా ఆరోగ్య సేతు యాప్‌‌లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌‌ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్ల వివరాలు, వ్యాక్సినేషన్‌‌ తేదీలు, టైమ్ స్లాట్ల వంటివన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. తమకు నచ్చిన సెంటర్‌‌‌‌లో, వీలైన రోజు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రేపటి స్లాట్స్‌‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. అంటే, కనీసం ఒక రోజు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌‌లైన్‌‌లో చేసుకోలేనివాళ్లు డైరెక్ట్‌‌గా సెంటర్‌‌‌‌కే వెళ్లి తమ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సెంటర్‌‌‌‌లో కొన్ని స్లాట్లను ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం, మరికొన్ని స్లాట్లను ఆన్‌‌సైట్‌‌ రిజిస్ట్రేషన్ కోసం కేటాయించనున్నారు.

అలాగే అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు తమ పరిధిలో ఉన్న ఎలిజిబుల్ వ్యక్తుల వద్దకు వచ్చి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి, ఇంటి దగ్గరే రిజిస్ర్టేషన్ కూడా చేస్తారు. వాళ్లు సూచించిన రోజు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

సెకండ్‌ డోసు ఇట్లా..

ఫస్ట్ డోసు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే టైంలోనే, సెకండ్ డోసు కోసం కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఫస్ట్ డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు వరకూ ఎప్పుడైనా సెకండ్ డోసు కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా 29వ రోజు సేమ్ సెంటర్‌‌లో స్లాట్‌ బుక్ అవుతుంది. సెకండ్ డోసు కోసం స్లాట్ బుక్ చేసుకున్న రోజు పోలేకపోతే, మరో రోజు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇందుకోసం అక్కడే స్పాట్‌ రిజిస్ర్టేషన్ చేసి వ్యాక్సిన్ ఇస్తారు. సెకండ్ డోసు కోసం బుక్ చేసుకున్న స్లాట్‌ను మాత్రం క్యాన్సిల్ లేదా ఎడిట్ చేసుకునే చాన్స్ ఉండదు.

రోజూ లక్ష మందికి టీకా

రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వృద్దులు, దీర్ఘకాలిక పేషెంట్లకు వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్ట్‌మెంట్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,046 ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేయనున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో 150 సెంటర్లలో వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వనున్నారు. అన్నింటిలో కలిపి రోజూ 1.2 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయొచ్చని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఆదివారం, బుధవారం తప్ప మిగిలిన ఐదు రోజులు టీకాలు వేయనున్నారు. ఈ లెక్కన ఒక్క నెలలో 20 నుంచి 24 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తామని, ఈ మేరకు సరిపోయేటన్ని డోసులను పంపాలని కోరారు. సెకండ్ ఫేజ్ లో 60 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. వీళ్లందరికీ జూన్ నాటికి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. గుర్తింపు కార్డులు, డాక్టర్ సర్టిఫికెట్‌ ఏది చూపించినా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆఫీసర్లు యోచిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం

రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు  తెలిపారు. ఎల్లుండి ఉదయం పదిన్నరకు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తామని, మొత్తం1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్‌కు ప్లాన్ చేశామని చెప్పారు. తొలుత కొన్ని సెంటర్లలో ప్రారంభించి తర్వాత అన్ని సెంటర్లలో స్టార్ట్ చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలకు ఫస్ట్ రోజు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం సూచించిన కేటగిరీలో ఉండి, ఇంట్రస్ట్ ఉన్నవాళ్లెవరైనా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చని అన్నారు.

ప్రైవేట్ లో సర్వీస్ చార్జ్ రూ.100

ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ లు పూర్తి ఉచితంగా వేస్తారు. ప్రైవేట్ సెంటర్లలో అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేసినందుకు ఒక్కో వ్యక్తి నుంచి సర్వీస్ చార్జ్​ పేరిట రూ.100 తీసుకోవచ్చు. వ్యాక్సిన్ ధర ఎంత అనేది ఇంకా ఖరారు చేయలేదు. రూ.100 సర్వీస్‌ చార్జ్​తో కలిపి, వ్యాక్సిన్ ధర రూ.400 కంటే తక్కువగా ఉండొచ్చునని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన దానికంటే, ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినట్టు తేలినా ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు రియాక్షన్స్ వస్తే, వాటికి ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించాల్సిన బాధ్యత కూడా ప్రైవేట్ హాస్పిటళ్లదేనని స్పష్టం చేసింది. ఇందుకోసం సంబంధిత వ్యక్తి నుంచి ఏరూపంలోనూ చార్జీలు వసూలు చేయకూడదు.

59 ఏండ్లు ఉన్నోళ్లూ అర్హులే

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి 59 ఏండ్లు ఉన్నవాళ్లూ అర్హులేనని శుక్రవారం కేంద్రం ప్రకటించింది. జనవరి1, 2022 నాటికి 60 ఏండ్లు నిండే వాళ్లంతా వ్యాక్సిన్‌ కోసం రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చంది. 45 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్న దీర్ఘకాలిక పేషెంట్లు కూడా వ్యాక్సిన్​కు అర్హులే. ఈ కేటగిరీ వాళ్లు తమ ఐడీ కార్డుతో పాటు, తమకు ఫలానా జబ్బు ఉందని డాక్టర్‌ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. జబ్బు టెస్ట్ రిపోర్ట్‌లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉన్నా సరిపోతుంది. హైపర్‌‌టెన్షన్‌, డయాబెటిస్‌ నుంచి గుండె జబ్బు వరకూ ఏది ఉన్నా వ్యాక్సిన్ కు అర్హులేనని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.