కంటోన్మెంట్ విలీనంతో బల్దియాకు రూ.500 కోట్ల ఆస్తులు

కంటోన్మెంట్ విలీనంతో బల్దియాకు రూ.500 కోట్ల ఆస్తులు

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ఎన్నో ఏండ్ల డిమాండ్ ఎట్టకేలకు ఫలించడంతో విలీనంపై నియమించిన కమిటీ అనేక అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఈ విలీన ప్రక్రియ వల్ల కంటోన్మెంట్ కు సంబంధించిన పలు రకాల స్థిరాస్తులు జీహెచ్ఎంసీకి బదిలీ కానున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తిస్థాయి ఆమోదం వచ్చిన తర్వాత ఆస్తులు జీహెచ్ఎంసీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం విలీన ప్రక్రియలో బోర్డు పరిధిలోని స్థిరాస్తులతో పాటు అప్పులు కూడా రాష్ట్ర మున్సిపాలిటీలకు బదిలీ అవుతాయి. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్థిరాలస్తులను లెక్కించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేసిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు 15 రకాల స్థిరాలస్తులతో కూడిన ఓ జాబితాను రూపొందించి తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాటి విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

బదిలీ అయ్యే స్థిరాస్తులు...

డిఫెన్స్​ మినిస్ట్రీ నిబంధనల ప్రకారం కంటోన్మెంట్​ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమైతే.. ప్రస్తుతం 470 నిర్మాణాలతో కలిసి 15 రకాల ఆస్తులను బదిలీ చేయాలని రిపోర్టు రూపొందించారు. ఇందులో  రూ.8 కోట్ల విలువ చేసే 2,158 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు పరిపాలనా భవనం,  రూ.8 కోట్ల విలువైన 1325 చ.మీ.లో ఉన్న కంటోన్మెంట్​హాస్పిటల్, రూ.5 కోట్ల విలువైన 8 కంటోన్మెంట్ పార్కులు, 917 చ.మీ.లో ఉన్న రూ.2.5 కోట్ల కంటోన్మెంట్ బోర్డు సీఈవో బంగ్లా, మడ్​ఫోర్డ్​లో 2,365 చ.మీ. విస్తీర్ణంలో ఉన్న  రూ.6 కోట్ల విలువైన వర్క్​షాప్​లు ఉన్నాయి. వీటితో పాటు 1200 చ.మీ.లో తిరుమలగిరి, బొల్లారం, తాడ్​బండ్​ ప్రాంతాల్లో ఉన్న 218 నివాస గృహాలు,5900 చ.మీ.లో ఉన్న టీఐటీ బ్లాకులు, 11 పంప్​ హౌజ్​లు, రిజర్వాయర్లు, 6వేల చ.మీ.లో ఉన్న బిల్డప్​ఏరియాలోని 34 కమ్యూనిటీ హాళ్లు, మరో పది ఇతర స్థిరాస్తులతో పాటు, కంటోన్మెంట్ ప్రజలకు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్న ఐదు డిస్పెన్సరీలను కూడా స్థిరాస్తుల్లో షార్ట్-లిస్ట్ చేశారు. కంటోన్మెంట్​ప్రాంతం జీహెచ్​ఎంసీలో విలీనమైతే ఈ ఆస్తులన్నీ  ఉచితంగా బదిలీ చేసేందుకు డిఫెన్స్​మినిస్ట్రీ రంగం సిద్ధం చేసింది. బదిలీ చేసేందుకు సూచించిన  భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్లు ఉంటుందని బోర్డు అధికారులు చెప్తున్నారు. వీటితోపాటు వివిధ రకాల నిర్మాణాల విలువ కూడా రూ. కోట్లలో ఉంటుందని అంటున్నారు.