బుల్లెట్ ప్రూఫ్ విండోస్‌తో సెక్యూరిటీ.. కొత్త భవన నిర్మాణానికి సీఎంఓ చెబుతున్న కారణాలివే

బుల్లెట్ ప్రూఫ్ విండోస్‌తో సెక్యూరిటీ.. కొత్త భవన నిర్మాణానికి సీఎంఓ చెబుతున్న కారణాలివే

హైదరాబాద్ నడిబొడ్డున 'వాస్తుకు అనుగుణంగా' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30న ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ కార్యాలయానికి బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, రాజ భోజనాల గది , గ్లాస్ గోడలతో కూడిన ఎలైట్ స్కై లాంజ్ లాంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇవి నిజాం కాలం నాటి నగరం వైమానిక వీక్షణను అందిస్తాయి.    

ఇండో-సార్సెనిక్ లేదా నియో-మొఘల్ ఆర్కిటెక్చర్ లక్షణాలతో రూపొందించబడిన ఈ సెక్రటేరియట్‌కు బీఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టారు. ఇటీవలే అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దానికి సమీపంలోనే ఈ కొత్త భవన నిర్మాణం చేశారు.

ప్రత్యేకతలు..

కొత్తగా రూపొందించిన ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో  ఎనిమిది అంతస్తులు ఉన్నాయి(లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఆరు). పైభాగంలో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO), దాని పైన స్కై లాంజ్ ఉన్నాయి. "విశాలమైన ప్రాంతంలో నిర్మితమైన ఈ నిర్మాణంలో 24 ఎలివేటర్లు, 635 గదులు, 30 సమావేశ మందిరాలు ఉన్నాయి. 2.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనంలో 564 కార్ల పార్కింగ్‌కు అవకాశం ఉంది. ఈ భవనం మొత్తం విస్తీర్ణం 27.9 ఎకరాల అని CMO ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ, గుజరాత్‌లోని కాకతీయుల వాస్తుశిల్పం, దేవాలయాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని ఈ భవనం డిజైన్‌ చేశారని పేర్కొంది. ముఖ్యమంత్రి.. అతిథులకు (ఎక్కువగా ప్రభుత్వ అధికారులు, విదేశీ ప్రతినిధులు) ఆతిథ్యం ఇవ్వడానికి, వారికి నగరం వైమానిక వీక్షణను అందించడానికి స్కై లాంజ్ రూపొందించబడిందని తెలిపింది.

వీటితో పాటు ఆరో అంతస్థులోని సీఎంఓలో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉన్నాయి. అలాగే మంత్రులతో సీఎం సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా క్యాబినెట్ గది కూడా ఉంది. ఈ కొత్త భవనంలోని మరో ప్రధాన ఆకర్షణీయమైన విషయం ఏంటంటే.. 22 మంది కూర్చునే భోజనాల గది. ఇందులో తెలుపు, బంగారు రంగు ఇంటీరియర్ డిజైన్, మెరిసే టైల్డ్ ఫ్లోర్, షాన్డిలియర్లు, ఒక గోడపై కేసీఆర్ పెద్ద ఫోటో, చెక్క డైనింగ్ టేబుల్ ఉన్నాయి.

కొత్త సచివాలయం ప్రధాన ద్వారం ఎత్తు 24 అడుగులు. టేకు చెక్కతో చేసిన 'బాహుబలి మహాద్వారం'గా దీన్ని అభివర్ణించారు. కాంప్లెక్స్‌లోని అన్ని తలుపులు టేకువుడ్‌తో తయారు చేసినట్లు సీఎంఓలోని ఓ అధికారి తెలిపారు. ఈ భవనంలో మొత్తం 34 గోపురాలు ఉన్నాయి. అందులో రెండు అత్యంత ప్రధానమైనవి. ఈ రెండు ప్రధాన గోపురాలపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.

ఎందుకు మార్చారంటే..

2020 జూలైలో కూల్చివేసిన నిజాం కాలం నాటి పాత సచివాలయం స్థానంలో తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ను నిర్మించారు. అయితే ఈ కొత్త భవనం నిర్మాణం వెనుక ఉన్న కారణాలపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి.. ఇది కేవలం విలాసవంతమైన సౌకర్యాలకు మాత్రమే సంబంధించినది కాదని చెప్పారు. మునుపటి భవనం అగ్నిమాపక భద్రతకు అనుగుణంగా లేదని, ప్లంబింగ్ లైన్లు, ఎలక్ట్రిక్ ఇన్ స్టాల్మెంట్స్ పాతవయ్యావని చెప్పారు. అంతేకాదు మంత్రి కార్యాలయం ఫలానా బ్లాక్‌లో ఉంటే ఆయన సిబ్బంది కార్యాలయం మరో బ్లాక్‌లో ఉండేదన్నారు. ఇలాంటి చాలా అవాంతరాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.

మంత్రులు, కార్యదర్శులు, శాఖల అధికారులు మొదలైన 2,000 మందికి పైగా వసతి కల్పించే కొత్త ప్యాలెస్ లాంటి నిర్మాణాన్ని నిర్మించడానికి 4,000 మందికి పైగా ప్రజలు రెండేళ్లపాటు శ్రమించారని గణపతి రెడ్డి చెప్పారు. పాత సచివాలయంలో వలే కొత్త కాంప్లెక్స్ లోనూ ఒక ఆలయం, మసీదు, చర్చికి వసతి కల్పిస్తుందని, ఇందులో సహాయక భవనాల్లో భాగంగా అగ్నిమాపక కేంద్రం, క్రెచ్, డిస్పెన్సరీ కూడా ఉన్నాయని తెలిపారు.

వాస్తు సూత్రాలు..

చెన్నైకి చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్నీ ఈ కొత్త సెక్రటేరియట్‌కు రూపకల్పన చేశారు. కొత్తగా నిర్మితమైన ఈ భవనానికి రూపకర్తలు ఎన్నో సూత్రాలను పాటించినట్టు తెలుస్తోంది. భవన నిర్మాణానికి ముందు సీఎంతో చాలా రోజులు చర్చలు జరిపినట్టు, డిజైన్ వర్క్ షాప్ ను నిర్వహించినట్టు సమాచారం. సచివాలయంలోని వివిధ భాగాలకు సంబంధించిన మాస్టర్ ప్లానింగ్, వాస్తు సూత్రాలు, సైట్-గ్రేడింగ్,  ఫ్లోర్-బై-ఫ్లోర్ జోనింగ్ గురించి సీఎం వివరంగా చర్చించి, ఓకే చేసినట్టు తెలుస్తోంది.

కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై స్పందించిన డిజైన్ రూపకర్తలు.. తాము దాదాపు రెండు వారాల పాటు ప్రతి రోజూ సీఎంకు అప్ డేట్ చేసే వారమని, భవనానికి సంబంధించిన దానిపై ఎన్నో చర్చలు సాగేవని చెప్పారు. ఈ కొత్త సచివాలయం కనీసం 150 ఏళ్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగానే భవనం బయటి భాగాన్ని చెట్లు, ఫౌంటెన్లతో రూపొందించామన్నారు. స్వచ్ఛత, కొత్త ప్రారంభాలు, సమగ్రతను వర్ణించేలా సచివాలయానికి తెలుపు రంగును ఎంపిక చేశారని వారు తెలిపారు.

265 అడుగులఈ  సచివాలయం నగరంలోనే అత్యంత ఎత్తైన భవనమని, ఐకానిక్ చార్మినార్ కంటే, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే కూడా ఎత్తైన భవనమని కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇది10.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, కేవలం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సెంట్రల్ విస్టా పార్లమెంట్ భవనం (న్యూఢిల్లీలో) కంటే సచివాలయం పెద్దదని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల అన్నారు.

కొత్త సెక్రటేరియట్ ఎందుకు?

కొత్త సచివాలయం ఆలోచనను 2017లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం మొదటగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో పాత భవనం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో అప్పట్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త భవనానికి అప్పట్లో ప్రాథమికంగా రూ. 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అది 2020 నాటికి రూ. 617 కోట్లకు చేరుకుంది. అదే సంవత్సరం కొత్త సచివాలయానికి అధికారికంగా అనుమతి లభించగా..  జూలైలో తెలంగాణ పాత సచివాలయాన్ని కూల్చివేశారు.

కూల్చివేతతో హుస్సేన్ సాగర్ సరస్సు కలుషితం అవుతుందని కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ట్రిబ్యునల్ కూడా కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కొందరు ఈ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించినా... ముందుకు సాగామని ఇటీవలే కేసీఆర్ చెప్పారు. తరచుగా పైకప్పు కూలిపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు, అన్ని సౌకర్యాలతో కూడిన మంచి క్యాంటీన్‌కు స్థలం లేకపోవడం, పార్కింగ్ సౌకర్యాల కొరత కారణంగా కొత్త సచివాలయం నిర్మాణం జరిగిందని తెలంగాణ సీఎంఓ పేర్కొంది. వాటికి తోడు పరిపాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం ఉండేదని తెలిపింది.