రాష్ట్రంలో భారీగా పడిపోతున్న విత్తన ఉత్పత్తి

రాష్ట్రంలో భారీగా పడిపోతున్న విత్తన ఉత్పత్తి
  • డిమాండ్‌‌ ఉన్న విత్తనాలకు తీవ్ర కొరత 
  • రైతులను దోచుకుంటున్న వ్యాపారులు  
  • చితికిపోయిన విత్తనాభివృద్ధి సంస్థ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులకు క్వాలిటీ విత్తనాలు దొరకడంలేదు. మేలురకం విత్తనాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. దీంతో రైతులు ఎక్కువ పైసలు పెట్టి ప్రైవేట్ కంపెనీల విత్తనాలనే కొనుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు యాసంగిలో పంటలపై ఆక్షలు లేవని ఒకసారి.. వరి సాగు తగ్గించుకోవాలని మరోసారి చెప్తున్న సర్కారు రైతులను గందరగోళంలో పడేస్తోంది. అయినా ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు వేయాలనుకున్న రైతులకు సీడ్‌‌ కార్పొరేషన్‌‌ విత్తనాలు అందించే స్థితిలో మాత్రం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఏటా సీడ్‌‌ ప్రొడక్షన్‌‌ గణనీయంగా పడిపోతోంది. దీంతో ప్రతీ సీజన్‌‌లో విత్తనాలు టైమ్‌‌కు అందక సీడ్‌‌ సర్టిఫికేషన్‌‌ లేని ప్రైవేటు కంపెనీలను రైతులు ఆశ్రయించాల్సిన దుస్థితి కొనసాగుతోంది.

‘ఆర్‌‌ఎక్స్‌‌ 100’కు భారీ డిమాండ్‌‌ 

యాసంగిలో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు వడ్లకు డిమాండ్‌‌ ఉంటోంది. నూక శాతం తక్కువగా ఉండే రకాలను ప్రోత్సాహించాల్సిన సర్కారు ఆ దిశలో ప్రయత్నాలే చేయడం లేదు. దొడ్డు వరి విత్తన రకాలు మార్కెట్‌‌లో దొరకట్లేదని రైతులు అంటున్నారు. వరి విత్తనాల్లో ఆర్‌‌ఎక్స్‌‌100 విత్తనాలకు భారీగా డిమాండ్‌‌ ఉంది. ఈ రకం విత్తనాలు మార్కెట్‌‌లో షార్టేజ్‌‌ ఉండడంతో బ్లాక్‌‌ దందా నడుస్తోంది. ప్రైవేటు కంపెనీకి చెందిన ఈ దొడ్డు రకం సీడ్‌‌ తో ఎకరానికి 40 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో రైతులు ఎగబడుతున్నారు. డిమాండ్ పెరగడం, మార్కెట్లో కొరత ఏర్పడటంతో ఈ సీడ్ ధరను వ్యాపారులు అడ్డగోలుగా పెంచేస్తున్నారు. మూడు కిలోలు ఉండే ఆర్‌‌ఎక్స్‌‌ 100 బ్యాగుకు రూ.900 రేటు ఉండగా వ్యాపారులు ఒక్కో దగ్గర ఒక్కోలా రూ. 1800 నుంచి రూ.3,600 వరకు కూడా బ్లాక్‌‌లో అమ్ముకుంటున్నరు. ఎకరానికి 6 నుంచి 9 కిలోల సీడ్స్ అవసరం కావడంతో విత్తనాలకే రైతులు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.   

పడిపోతున్న సీడ్‌‌ ప్రొడక్షన్‌‌ 

రాష్ట్రం విత్తన భాండాగారమని గొప్పలు చెప్పుకోవడం తప్పితే రైతులంతా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే వేరుశనగ, హైబ్రిడ్‌‌ మక్కజొన్న, హైబ్రిడ్‌‌ వరి, వెజిటేబుల్స్‌‌, ఫాడర్‌‌ సీడ్‌‌ ప్రొడక్షన్‌‌, జొన్న, సజ్జ, రాగులు వంటి పంటలకు విత్తనాల ఉత్పత్తి లేకుండాపోయింది. ఈ వానాకాలంలో 75 వేల ఎకరాల్లో వేయాల్సిన సర్టిఫైడ్‌‌ వరి సీడ్‌‌ గణనీయంగా మూడో వంతుకు పడిపోయింది. గత సీజన్‌‌లో కేవలం 25 వేల ఎకరాల్లోనే సర్టిఫైడ్ సీడ్‌‌ సాగైంది. ఇక పప్పు దినుసుల్లో పెసర్లు, కందులు, పప్పు శనగ సీడ్‌‌ ప్రొడక్షన్‌‌ కూడా భారీగా తగ్గిపోయింది. ఇక రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా విత్తన ఉత్పత్తిదారులు పక్క రాష్ట్రాలైన చత్తీస్‌‌గఢ్, కర్నాటకకు తరలిపోతున్నారు. గతంలో దేశంలోని 8 రాష్ట్రాలు ఇంటర్నేషనల్‌‌ సీడ్‌‌ సర్టిఫికేషన్‌‌ కోసం తెలంగాణ సీడ్‌‌ సర్టిఫికేషన్‌‌ ఆథారిటీ పరిధిలో ఉండేవి. అయితే, అడ్మినిస్ట్రేషన్‌‌ ఫెల్యూర్స్‌‌తో ఇప్పటికే 6 రాష్ట్రాలు వైదొలిగాయి. ఇప్పుడు మన రాష్ట్రంతో పాటు చత్తీస్‌‌గఢ్‌‌ మాత్రమే కొనసాగుతోంది. ప్రచార ఆర్భాటం తప్పితే  ఇది రైతులకు ఉపయోగం లేని సంస్థగా మారింది. సీడ్ విత్తనాలపై పారదర్శకంగా ఉండేందుకు పొందుపరచాల్సిన క్యూఆర్‌‌ కోడింగ్‌‌, సీడ్‌‌ సర్టిఫికేషన్‌‌, సీడ్‌‌ తనిఖీ యాక్టివిటీ వంటివి చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

దయనీయంగా సీడ్ కార్పొరేషన్

విత్తనాల అభివృద్ధి, ఉత్పత్తిలో సీడ్‌‌ కార్పొరేషన్‌‌ ఫెయిల్ కావడంతో ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా మారింది. గతంలో ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు. కానీ సీడ్‌‌ ఉత్పత్తిలో వెనకబడి ఆదాయం పడిపోవడంతో ఇప్పడు సర్కారు దయతలిస్తే కానీ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సీడ్‌‌ సర్టిఫికేషన్‌‌, సీడ్‌‌ ప్రొడక్షన్‌‌, సీడ్‌‌ రీసెర్చ్‌‌, సీడ్‌‌ క్వాలిటీపై పర్యవేక్షణ లేకుండాపోయింది. కరీంనగర్‌‌లోని సీడ్ టెస్టింగ్‌‌ ల్యాబ్‌‌ను ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఉండట్లేదు. దీంతో ప్రైవేటు కంపెనీలు అక్రమ దందాలతో వేల కోట్లకు పడగలెత్తుతుండగా ప్రభుత్వ రంగ సంస్థ మాత్రం దీనావస్థలో కొనసాగుతోంది.