కరోనా భయంతో 15 నెలలుగా గుడిసెలోనే..

V6 Velugu Posted on Jul 22, 2021

కాకినాడ: కరోనా భయంతో ఓ కుటుంబం 15 నెలలుగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు. పొరుగు ఇంట్లో ఒకరు కరోనా వల్ల చనిపోవడంతో బయటకు వస్తే తామూ ప్రాణాలు కోల్పోతామన్న భయం పట్టుకుంది. అంతే అప్పటి నుంచి ఒకే రూం ఉండే చిన్న గుడిసెలో ఉండిపోయారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటకు రాలేదు. మలమూత్రాలకూ ఆ రూమ్‌లోనే వెళ్లేవాళ్లు. ఇంతటి దుర్భరంగా జీవితం గడుపుతున్న ఆ కుటుంబాన్ని విలేజ్‌ వాలంటీర్‌‌ గుర్తించడంతో రెండ్రోజుల క్రితం గ్రామ సర్పంచ్, పోలీసులు కలిసి కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలించి వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడలిలో జరిగింది.
ఆ కుటుంబానికి ఇంటి పట్టా వచ్చిందని వాలంటీర్ వెళ్తే..
గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ‘స్టే హోం స్టే సేఫ్’ అంటూ పదే పదే చెబుతూ వచ్చాయి. కరోనా నుంచి కాపాడుకోవాలంటే అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించాయి. కానీ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడలి గ్రామంలోని జాన్ బెన్నీ (50) అనే వ్యక్తి, భార్య, ఇద్దరు కూమార్తెలు.. భయం కారణంగా ఈ విషయాన్ని మరీ ఎక్కువగా ఇంప్లిమెంట్‌ చేసింది. తమ పొరుగు ఇంట్లో ఒక వ్యక్తి గత ఏడాది కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాము బయటకు వస్తే కరోనా అంటుకుని చచ్చిపోతామని భయపడిపోయి.. 15 నెలలుగా ఒక పరదాతో కప్పిన చిన్న గుడిసెలో ఉండిపోయారు. ‘‘గతంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఆ ఇంటికి హెల్త్ సర్వేలో భాగంగా వెళ్లినప్పటికీ రోజుల కొద్దీ ఎవరూ లేనట్టుగా అనిపించడంతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఉచిత ఇంటి పట్టా వచ్చింది. దానికి సంబంధించి బయోమెట్రిక్ కోసం విలేజ్ వాలంటీర్ వాళ్ల ఇంటికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది’’ ఆ గ్రామ సర్పంచ్ చొప్పల గురునాథం చెప్పారు. విలేజ్ వాలంటీర్ ఆ ఇంటికి వెళ్లినప్పుడు లోపల ఎవరో ఉన్నట్టుగా అలికిడి వినిపించడంతో జాన్‌ బెన్నీని పిలిచాడని, బయటకు వస్తే కరోనా చచ్చిపోతామంటూ వచ్చేందుకు నిరాకరించడంతో వాలంటీర్ వచ్చి తమకు సమాచారం ఇచ్చాడని తెలిపారు.
ఇంకొన్ని రోజులు ఉంటే చనిపోయే వాళ్లు
వాలంటీర్ సమాచారం ఇవ్వడంతో పోలీసులను తీసుకుని ఆ ఇంటి దగ్గరకు వెళ్లామని, ఎట్టకేలకు జాన్ బెన్నీ సహా ఆ కుటుంబం మొత్తాన్ని బయటకు రప్పించామని గురునాథం చెప్పాడు. వాళ్లందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే ఇంట్లో సరుకులు లాంటి వాటికి జాన్‌ మాత్రమే ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లి వచ్చేవాడని, మిగతా వాళ్లంతా అడుగు బయటపెట్టలేదని అన్నారు. కనీసం నేచర్ కాల్స్‌కు కూడా బయటకు రాలేదనని, మలమూత్రాల అవసరాలనూ ఆ ఇంటి లోపలే తీర్చుకున్నారని చెప్పారు. ఇంకో రెండు మూడ్రోజులు ఆ కుటుంబం అలానే ఆ ఇంట్లో గడిపి ఉంటే ప్రాణాలకే ప్రమాదం వచ్చేదని అన్నారు.

Tagged andhrapradesh, Corona fear, Self Lock down, Andhra Family, Death Fear

Latest Videos

Subscribe Now

More News