- బీజేపీ భావజాలమే మహిళా వ్యతిరేకం: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: బీజేపీ భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని, లోక్‌సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదన్నది నిరూపితమైందని మంత్రి సీతక్క శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కపట నీతి బహిర్గతమైందన్నారు.
మహిళల సాధికారతపై చిత్తశుద్ధి ఉంటే, సాధారణ మెజార్టీతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీలిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని పేర్కొన్నారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం కనిపిస్తోందన్నారు.

