
కాజీపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం హనుమకొండ జిల్లా మడికొండ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కాజీపేట డివిజనల్ ఏసీపీ డేవిడ్‌రాజ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జహనాబాద్ జిల్లా ఫతేపూర్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అమీన్ ఖాన్, ఒడిశా లోని గజపతి జిల్లా సిరోంచకు చెందిన తపన్ పాణి ఈజీ మనీ కోసం గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఒడిశాలో గంజాయి కొని హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 58 కిలోల గంజాయితో రైలులో కాజీపేటకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో మడికొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు వెయిట్ చేస్తుండగా గమనించిన మడికొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో గంజాయి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు రూ. 14 లక్షల విలువైన 58 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.