గ్రామాల్లో మళ్లీ మొదలైన సెల్ఫ్​ లాక్​డౌన్‌లు

గ్రామాల్లో మళ్లీ మొదలైన సెల్ఫ్​ లాక్​డౌన్‌లు
  • ఆటోల్లో వరి నాట్లకు వెళ్లిన 29 మందికి కరోనా

మల్యాల, వెలుగు: వరి నాట్లు వేసేందుకు ఆటోల్లో పక్క ఊళ్లకు గుంపులుగా వెళ్తున్న 29 మందికి కరోనా సోకింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో ప్రస్తుతం రూ.300 కూలి నడుస్తోంది. పక్క గ్రామాలైన తాటిపల్లి, అల్లిపూర్ గ్రామాల్లో రూ.500 ఇస్తున్నారు. దీంతో మద్దుట్లకు చెందిన చాలా మంది ఆటోల్లో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారిలో 10 మందికి కరోనా సింప్టమ్స్​కనిపించడంతో సోమవారం టెస్టు చేయించుకున్నారు. వారిలో నలుగురికి పాజిటివ్ ​అని తేలింది. అప్రమత్తమైన సర్పంచ్ మల్లవ్వ మాల్యాల మెడికల్ ఆఫీసర్ లావణ్యతో మాట్లాడి మంగళవారం గ్రామంలో మెడికల్​ క్యాంప్​ పెట్టించారు.130 మందికి కరోనా టెస్టులు చేయగా 29 మందికి పాజిటివ్​వచ్చింది. వారంతా పక్క ఊళ్లలో వరినాట్లకు వెళ్తున్నవారే. దీంతో సర్పంచ్ ​గ్రామంలో సెల్ఫ్​ లాక్​డౌన్​ విధించారు. పాజిటివ్ ​వచ్చిన వారి ఇండ్ల చుట్టూ శానిటేషన్ ​చేయించారు.

ఎండపల్లిలో ఆగస్టు 1 వరకు..
వెల్గటూర్: వెల్గటూర్ మండలం‌‌ ఎండపల్లికి చెందిన ఒకరు రెండు రోజుల క్రితం కరోనాతో చనిపోగా, మరో 12మంది వైరస్ ​బారిన పడ్డారు. దీంతో మంగళవారం పంచాయతీ పాలకవర్గం సెల్ఫ్​లాక్​డౌన్​విధిస్తూ తీర్మానం చేసింది. ఆగస్టు ఒకటో తేదీ వరకు లాక్​డౌన్​అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. గ్రామంలో గుంపులుగా తిరిగితే వెయ్యి రూపాయల ఫైన్​విధిస్తామని సర్పంచ్​హెచ్చరించారు.