సెల్ఫీ రోబో వచ్చేసింది..!

సెల్ఫీ రోబో వచ్చేసింది..!

ఇప్పుడు జనానికి ఉన్న సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. పెళ్లికెళ్లినా, ఏదైనా ఫంక్షన్​కు పోయినా కావాల్సినోళ్లు కనిపిస్తే చాలు స్మైల్​ అంటూ చెయ్యి పైకెత్తి ఫోన్​ ఫ్రంట్​ కెమెరాతో సెల్ఫీ క్లిక్​మనిపించేస్తారు. ఈసారి ఒక చిన్న చేంజ్​ చేద్దామా? మనకు మనమే సెల్ఫీ తీసుకునే బదులు ఓ రోబోతో సెల్ఫీ తీసేసుకుంటే ఎట్లుంటది? ఆ రోబో ఇదే. సెల్ఫీలు తీయడమే కాదు, ఆ ఫొటోలను వెంటనే ఈమెయిల్​కు దాని నుంచే పంపించుకోవచ్చు. ‘ఈవా ఫొటోగ్రఫీ రోబో’ అని దాన్ని పిలుస్తున్నారు. బర్మింగ్​హాంకు చెందిన సర్వీస్​ రోబో అనే సంస్థ దానికి రూపునిచ్చింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఈ సెల్ఫీ రోబోలను అద్దెకిస్తుంది.

కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. బర్మింగ్​హాంకే చెందిన ఓ జంట తమ పెళ్లిలో ఈ రోబోతోనే ఫొటోలు తీయించుకుంటే కొత్తగా ఉంటుందని భావించి ఈవాను అద్దెకు తెచ్చుకున్నారు. వాళ్ల పెళ్లితో పాటు ఈవా పేరు మార్మోగిపోయింది. పెళ్లికొచ్చిన చుట్టపక్కాలతో పాటు ఫ్రెండ్స్​ ఎంచక్కా ఈవాతో సెల్ఫీలు తీయించుకున్నారు. ఈవా టచ్​స్క్రీన్​పై ఉన్న ఆప్షన్​లను క్లిక్​ చేసి పర్​ఫెక్ట్​ సెల్ఫీ దిగొచ్చు. దీని అద్దె ధర మాత్రం పేలిపోతుంది. ఒక్కసారి 8 గంటలు మాత్రమే అద్దెకిస్తారు. దానికయ్యే ఖర్చు 500 పౌండ్లు. దాదాపు ₹44 వేలు. వ్యాట్​ కలిపితే 750 పౌండ్లు. మన పైసలల్ల అయితే దగ్గరదగ్గర ₹65 వేలు. బర్మింగ్​హాం నుంచి దూరంగా వెళ్లాలంటే మాత్రం డెలివరీ చార్జీలు వేస్తారు. టెక్నాలజీ అంతా తమదే అయినా, దాని బాడీ మాత్రం చైనాదని కంపెనీ చెప్పింది.