అంతరిక్షానికి ‘కండల’ ఎలుకలు!

అంతరిక్షానికి  ‘కండల’ ఎలుకలు!

జన్యుమార్పిడితో కండబలం పెంచి పంపిన సైంటిస్టులు

స్పేస్ లో కండలు కరిగిపోయే ప్రమాదంపై పరిశోధన కోసమే  

సిమోన్ 2 ఏఐ రోబో, బార్లీ విత్తనాలు కూడా నింగికి

భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు అమెరికన్ సైంటిస్టులు ఎలుకలను పంపారు. వీటితో పాటు ఏఐ రోబోను, బార్లీ విత్తనాలూ నింగికి చేరాయి. నాసాతో కాంట్రాక్టులో భాగంగా స్పేస్ ఎక్స్ కంపెనీ తన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా గురువారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కేప్ కేనవెరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని డ్రాగన్ క్యాప్సూల్ లో పెట్టి నింగికి పంపింది. ఈ క్యాప్సూల్ ఈ రోజు (ఆదివారం) ఐఎస్ఎస్ కు అనుసంధానమై, వీటితో పాటు సరుకులనూ ఆస్ట్రోనాట్లకు అందించనుంది. ఐఎస్ఎస్ కు స్పేఎస్ ఎక్స్ రాకెట్ ద్వారా సరుకులు పంపడం ఇది19వ సారి. ఇంతకూ అంతరిక్షానికి ఎలుకలను ఎందుకు పంపారు? ఏఐ రోబో, బార్లీ విత్తనాలతో పనేంటీ?

8 వస్తాదు ఎలుకలు..  32 మామూలు ఎలుకలు

ఐఎస్ఎస్ కు సైంటిస్టులు మొత్తం 40 ఎలుకలను పంపారు. వీటిలో 32 సాధారణ ఎలుకలు. మిగతా 8 మాత్రం జన్యుమార్పిడి చేసిన మైటీ మైస్. అంటే మామూలు ఎలుకల కన్నా రెండు రెట్లు కండబలం ఉన్న ఎలుకలన్నమాట. వీటి కండల బరువు మిగతా ఎలుకల కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఇవన్నీ నెలరోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉంటాయి. సాధారణంగా ఆస్ట్రోనాట్లు లో గ్రావిటీ పరిస్థితుల్లో లేదా పూర్తి శూన్యంలో ఎక్కువ రోజులు గడిపితే వారి కండరాలు, ఎముకలు క్రమంగా బరువు తగ్గుతూ క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విషయంలో కొత్త పరిష్కార మార్గాలు కనిపెట్టేందుకని వీటిని పంపారు. ఈ నెలరోజుల పాటు ఐఎస్ఎస్ లో ఈ ఎలుకలపై అనేక రకాలుగా పరీక్షలు చేస్తారు. వీటికి ప్రత్యేక ఎక్సర్ సైజ్ మాదిరి పనులూ చేయిస్తారు. ఈ రీసెర్చ్ లో ఎలుకల కండలు, ఎముకలు క్షీణించకుండా నివారించగలిగితే, ఆ పద్ధతులను తర్వాత దీర్ఘకాలం అంతరిక్ష యాత్రలు చేసే సమయంలో ఆస్ట్రోనాట్లకూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.

స్పేస్ బీర్ తయారీ కోసం బార్లీ గింజలు

లో గ్రావిటీ పరిస్థితుల్లో బార్లీ విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? అన్నది తెలుసుకునేందుకు వీటిని అమెరికన్ కంపెనీ అనెసర్ బుష్​(బడ్ వైజర్ బీర్ తయారు చేసే కంపెనీ) పంపింది. ఈ కంపెనీ ఐఎస్ఎస్ లో ఇలాంటి ప్రయోగం చేయడం ఇది మూడోసారి. అంతరిక్షంలో మంచి రుచికరమైన బీర్ ను ఎలా తయారు చేయాలి? అక్కడ బీర్ తయారీలో ఎలాంటి సమస్యలు వస్తాయి? అన్నవి తెలుసుకునేందుకే ఆ కంపెనీ ఇలా బీర్ మాల్టింగ్ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తోంది.

సిమోన్ 2.. ఫ్లోటింగ్ రోబో

స్పేస్ లో ఆస్ట్రోనాట్లలాగే ఎగురుతూ, పనిచేసే ఫ్లోటింగ్ రోబో ఇది. దీన్ని జర్మన్ సైంటిస్టులు 3డీ ప్రింటింగ్ ద్వారా చేశారు. గతేడాది సిమోన్1 ప్రొటోటైప్ పంపిన ఈ కంపెనీ తాజాగా సిమోన్ 2ను పంపింది. ఏఐతో అప్ గ్రేడ్ చేసిన ఈ రోబో.. ఆస్ట్రోనాట్లతో కలిసి పని చేస్తూ ప్రేమను ఒలకబోస్తుందట. ఇది ఐఎస్ఎస్ లో మూడేళ్లు ఉండనుంది. మూన్, మార్స్‌‌లకు వెళ్లినప్పుడు ఆస్ట్రోనాట్లకు ఓ సహచరుడిలాగా హెల్ప్ చేసేందుకు ఈ రోబో ఉపయోగపడుతుందని చెప్తున్నారు.