న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కాంగ్రెస్ ప్రతిపాదించిన కె. సురేశ్ పై ఓం బిర్లా విజయం సాధించారు. 18వ లోక్ సభకు స్పీకర్ ఎన్నిక ప్రక్రియను బుధవారం ఉదయం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ఎన్డీయే తరఫున ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ పేరును ప్రతిపాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు తీర్మానం ప్రవేశపెట్టాయి.
అనంతరం వాయిస్ ఓట్ ద్వారా ఓం బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా లోక్ సభ స్పీకర్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. అయితే, ఈసారి స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు కూడా పోటీ పడటంతో ఓటింగ్ అనివార్యమైంది. స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్అఖిలేశ్ యాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కూడా ఒకరినొకరు పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆసక్తికరంగా కనిపించింది. అనంతరం మోదీ, రాహుల్, రిజిజు వెంట రాగా.. ఓం బిర్లా సభాధ్యక్ష స్థానంలోని తన చైర్ లో ఆసీనులయ్యారు.
స్పీకర్ కు సభ్యులంతా కంగ్రాట్స్ చెప్పారు. ఓం బిర్లా (61) రాజస్థాన్ లోని కోటా నుంచి వరుసగా మూడు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. లోక్ సభకు ఒకటి కంటే ఎక్కువ సార్లు స్పీకర్ అయిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. ఇప్పటివరకు ఎంఎం అయ్యంగార్, జీఎస్ థిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే, బలరాం జాఖడ్ ఒక్కరే రెండు సార్లూ పూర్తికాలం పదవిలో కొనసాగారు. కాగా, ప్రస్తుత లోక్ సభలో 543 ఎంపీ సీట్లకు గాను ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీయే కూటమికి మెజార్టీ మార్క్ కంటే 21 అదనంగా293 మంది, ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది.
ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానం..
స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓం బిర్లా సభా కార్యకలాపాలను ప్రారంభించారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో నాటి సర్కారు నిర్ణయాన్ని ఖండిస్తూ ‘డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ’ పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చదివి వినిపించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు, చర్చలకు ఎల్లప్పుడూ మద్దతు ఉండేది. కానీ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రూపంలో దేశంపై నియంతృత్వం విధించారు. భారత ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతును నొక్కారు” అని పేర్కొన్నారు. ‘‘1975, జూన్ 26న ఉదయం దేశం ఎమర్జెన్సీ క్రూర వాస్తవాలతో నిద్ర లేచింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టింది.
మీడియాపై ఆంక్షలు విధించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ దెబ్బతీసింది. ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా నాటి సర్కారు నిర్ణయాన్ని 18వ లోక్ సభ ఖండిస్తోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటిస్తోంది” అని స్పీకర్ వివరించారు. తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే, ఎమర్జెన్సీపై తీర్మానాన్ని స్పీకర్ చదువుతుండగా సభలోని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎన్డీయే పక్షాల సభ్యులు మౌనం పాటించారు. మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ బయట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, కిరెన్ రిజిజు, లలన్ సింగ్, ఎన్డీయే ఎంపీలు ధర్నా చేపట్టారు. ఎమర్జెన్సీ అంశంపై దేశానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమర్జెన్సీపై ఖండన.. బాధితులకు గౌరవం: మోదీ
గత లోక్ సభకు స్పీకర్ గా పని చేసిన ఓం బిర్లా సభను చాలా బ్యాలెన్స్డ్ గా నడిపారని ప్రధాని మోదీ ప్రశంసించారు. పార్లమెంటేరియన్‌గా ఓం బిర్లా చేసిన కృషి కొత్త ఎంపీలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఓం బిర్లా అధ్యక్షత వహించిన కాలం లోక్ సభ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంలాంటిదని, ఆయన హయాంలో ఎన్నో చరిత్రాత్మక బిల్లులు పాస్ అయ్యాయన్నారు. సభా సంప్రదాయా లను పాటిస్తూనే.. అవసరమైనప్పుడు ఆయన కఠిన నిర్ణయాలు సైతం తీసుకున్నారని మెచ్చుకున్నారు. సభను నడిపించడం లో ఓం బిర్లా మరింత పకడ్బందీగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. కొవిడ్ సమయంలోనూ సభను సమర్థవంతంగా నడిపారని కొనియాడారు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానాన్ని చదవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో బాధితులుగా మారిన ఎంతో మందికి ఈ తీర్మానం ఒక గౌరవమని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా సభను మరింత బాగా నడపడంలో ఓం బిర్లా కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
మమ్మల్ని మాట్లాడనిస్తారని ఆశిస్తున్నా: రాహుల్
సభా నిర్వహణలో స్పీకర్‌కు ప్రతిపక్షాల నుంచి పూర్తిగా సహకరిస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సభలో మాట్లాడేందుకు తమకు కూడా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మంది ప్రజలకు ప్రతిపక్షం ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. ఎంపీల సస్పెన్షన్ల వంటి ఘటనలు మళ్లీ జరగవని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్షం కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అందుకే ప్రతిపక్షం గొంతు నొక్కడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. సభలో ఎంపీల సస్పెన్షన్లు ఉండబోవని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్షం పట్ల ఓం బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, సమాన అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
