
కొత్త సర్కార్ కు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. కొత్త ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు, బాధలను తనకు తెలియజేయడం శుభపరిణామం అని చెప్పారు. ప్రజా అభిమానాన్ని చూరగొనేలా పనిచేయాలని తాను చెప్పానని.. ప్రభుత్వంలో తన పాత్ర ఏమి ఉండదు.. కానీ సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తానని చెప్పానని జానారెడ్డి వెల్లడించారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలిసారు. సీఎం అయ్యాక రేవంత్ తొలిసారి జానారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ను శాలువా కప్పి సన్మానించారు. జానారెడ్డి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదు. ఆయన కుమారుడు జై వీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి గెలిచారు.
సీఎం రేవంత్ జానారెడ్డిని కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ లో ఇప్పటి వరకు 11 మంది మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అంతేగాకుండా కీలక హోంశాఖ ఇంకా ఎవరికి కేటాయించలేదు. సీఎం వద్దే ఉంది.
జానారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత కావడంతో .. ఆయనకు హోంశాఖను ఇస్తారా.? సీఎం రేవంత్ అందుకే కలిశారా అని.. పొలిటికల్ సర్కిల్ లో డిస్కస్ చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేబినె ట్లో చోటు దక్కింది. మరి జానారెడ్డికి మంత్రి పదవి ఇస్తారా లేదా? అనేది వేచి చూడాలి.