కేసీఆర్ అక్రమ సంపాదనకు హద్దు అదుపులేకుండా పోతోంది

కేసీఆర్ అక్రమ సంపాదనకు హద్దు అదుపులేకుండా పోతోంది

కామారెడ్డి జిల్లా:  కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతూ  హద్దు అదుపు లేకుండా సంపాదిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు.  ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.  శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిత్యవసర సరుకుల ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నడ్డివిరుస్తున్నాయని ఫైర్ అయ్యారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైందన్నారు. ఒకపప్పుడ అద్దె ఇంట్లో నివసించిన కల్వకుంట్ల కవిత... ఇవాళ ఏకంగా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా కొనుక్కుందని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన కాళేశ్వరం ఏడాదిలోపే నీటిలో మునిగిపోయిందన్నారు. కేసీఆర్ ధన దాహానికి అడ్డులేకుండా పోతోందన్న ఆయన... హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కేసీఆర్ అమ్మేశారని మండిపడ్డారు. 

ఇక... ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ... ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. జన్ ధన్ అకౌంట్లు తెరిచి ఒక్కరికి పది లక్షల రూపాయల ఇస్తానన్న ప్రధాని... ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు.  సోయి ఉన్నోరెవరైనా పాలపై జీఎస్టీ వేస్తారా అని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టులు, సీపోర్టులను కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు అమ్మేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ప్రజల కష్టాలు తప్పవన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.