నేతల రాతలు తల కిందులు .. పార్లమెంట్​టికెట్​ ఆశించి భంగపడ్డ సోయం, రమేశ్​

నేతల రాతలు తల కిందులు .. పార్లమెంట్​టికెట్​ ఆశించి భంగపడ్డ సోయం, రమేశ్​
  • ఎమ్మెల్యే, ఎంపీ చాన్స్​ దక్కని బాపూరావ్​, రేఖ

ఆదిలాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్​లో  గతంలో మాదిరిగా  పోటీ చేయాలనుకున్న  నేతలకు నిరాశే ఎదురయ్యింది. అసెంబ్లీలో టికెట్లు రాని వారు కూడా లోక్​సభ బరిలో దిగాలని ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.  కొత్తతరం నేతలు అధికారాన్ని అందుకోగా.. సీనియర్​నేతల తలరాతలు మారిపోయాయి.  నమ్ముకున్న పార్టీలు అవకాశం ఇవ్వకపోవడంతో కొందరు నిరాశకు గురికాగా.. కొందరు ఇతర పార్టీల్లో  చేరి అందలమెక్కారు.  మొన్నటి ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్తవారే  ఎమ్మెల్యేలుగా గెలిచారు. 

 ఈసారి  నిరాశే

 సీనియర్ లీడర్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు 2018   అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్​ నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయనకు  2019 లోకసభ ఎన్నికల్లో  బీజేపీ టికెట్​ ఇచ్చింది.  ఇక్కడ నుంచి ఆయన అనూహ్యంగా విజయం సాధించి పార్లమెంట్​లో అడుగుపెట్టారు.  తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలను బీజేపీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపింది. కరీంనగర్​ లో బండి సంజయ్​, కొరుట్లలో  ధర్మపురి అర్వింద్​ ఓడిపోయినా వారి సిట్టింగ్​స్థానాల్లో  మరోసారి అవకాశం ఇచ్చింది.  బోథ్​ నుంచి ఓడిపోయిన సొయం బాపూరావుకు మాత్రం పార్టీ టికెట్​ నిరాకరించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

 ఒకదశలో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరగగా.. హైకమాండ్​ భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పినట్టు తెల్సింది.   మరో సీనియర్ బీజేపీ  లీడర్ రాథోడ్ రమేశ్ కు కూడా నిరాశే ఎదురైంది.  2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్​నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్​ఓడిపోయారు. అయినా కాంగ్రెస్​2019 పార్లమెంట్​ ఎన్నికల్లో తిరిగి టికెట్​ ఇచ్చింది. ఆతర్వాత బీజేపీలో చేరిన రమేశ్​ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఖానాపూర్​ నుంచే పోటీ చేశారు. ఈసారీ ఓటమి చవిచూసిన ఆయన పార్లమెంట్​ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు. 

మోదీ, రామమందిరం తదితర అంశాలు కలిసివస్తాయన్న నమ్మకంతో ఆయన టికెట్​ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసినా ఫలితందక్కలేదు.  ఇలా ఈ సారి ఇద్దరు మాజీ ఎంపీలు పోటీకి దూరమయ్యారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ లో  ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారారు.  రేఖానాయక్​ కాంగ్రెస్​ నుంచి, రాథోడ్​ బాపురావు బీజేపీ నుంచి  పార్లమెంట్ టికెట్​ఆశించినా దక్కించుకోలేకపోయారు.

లోకసభకు  ఫస్ట్​ టైమ్ పోటీ

 ఈసారి  ఆదిలాబాద్​ పార్లమెంట్​ బరిలో  కొత్త ముఖాలకు అవకాశం వచ్చింది.   బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి  ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ  మొదటి సారి ఎంపీ గా పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్​లోక్​సభ సీటు 2009లో ఎస్టీ రిజర్వ్​డ్​గా  మారింది.  ఇక్కడ  2009లో   టీడీపీ నుంచి రాథోడ్ రమేశ్, 2014లో బీఆర్ఎస్ నుంచి గొడం నగేశ్​,   2019లో బీజేపీ నుంచి సోయం బాపురావు  ఎంపీలుగా గెలిచారు.   రాథోడ్ రమేశ్​ 2009 నుంచి వరుసగా  పోటీ చేస్తూ వస్తున్నారు. 2009,2014లో టీడీపీ నుంచి, 2019 కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేశారు.      కాగా..  ఆదిలాబాద్​ ఎంపీలుగా వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన   రాథోడ్ రమేశ్, గొడం నగేశ్​, సోయం బాపురావు  ముగ్గురు ప్రస్తుతం  బీజేపీలోనే  ఉండటం విశేషం.