
- నేడు వెబ్ ఆప్షన్లు
యాదాద్రి, వెలుగు : జిల్లాలో ఎస్జీటీ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. స్కూల్‌అసిస్టెంట్లు(ఎస్ఏ)గా ప్రమోషన్లు పొందడానికి అర్హులైన వారి సీనియార్టీ లిస్ట్ రెడీ చేయడంతోపాటు ఖాళీలను గుర్తించారు. వీటికి సంబంధించిన లిస్ట్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌కు జిల్లా ఆఫీసర్లు ఆదివారం పంపించారు. ఇటీవల 16 మంది ఎస్ఏలు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు పొంది మల్టీ జోన్– 1 పరిధిలోని స్కూల్స్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎస్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు ఇస్తున్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్ఏ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా 99 ఖాళీలను గుర్తించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అదే సంఖ్యలో ఎస్జీటీల్లో సీనియార్టీ లిస్ట్‌ను రెడీ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపించారు. ప్రమోషన్లకు సంబంధించి ఎస్జీటీలు సోమవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రమోషన్లలో ఎస్సీ టీచర్లకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 26తో ముగియనుంది. ప్రమోషన్లు పొందిన టీచర్లు 27న స్కూల్స్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది.