చక్రం తిప్పుతున్న సీనియర్లు.. గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా

చక్రం తిప్పుతున్న సీనియర్లు.. గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా

వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో చోటామోటా నాయకులతో పాటు గతంలో చక్రం తిప్పిన సీనియర్లు సైతం తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీల్లో సీనియర్లు గతంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. పరిస్థితి అనుకూలించకపోవడంతో సైలెంట్  అయిన వీరంతా తమ పార్టీల్లో సత్తా చాటేందుకు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

టీడీపీ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, పి.చంద్రశేఖర్, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం,   మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన సీనియర్  నాయకులు సీఆర్  జగదీశ్వర్ రావు తదితరులు  ఆయా పార్టీల్లో చురుకైన పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. 

తగ్గేదేలే అంటున్న సీనియర్లు..

నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అచ్చంపేటలో తన పట్టు కొనసాగిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్  పార్టీలోని మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లురవి, గద్వాలకు చెందిన మాజీ మంత్రి సమరసింహారెడ్డి, కొడంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, అలంపూర్ కు చెందిన బీజేపీ నాయకులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి 70 ఏండ్లకు చేరుకుంటున్నారు. అయినా రాజకీయాలపై మక్కువతో నేటికి ఏదో ఒక సందర్భంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు.

వీరిలో చిన్నారెడ్డి, జగదీశ్వర్ రావు, మల్లురవి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్  నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. వీరంతా తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ  హైకమాండ్, ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, మక్తల్ కు చెందిన సీతా దయాకర్ రెడ్డి, షాద్ నగర్ కు చెందిన బక్కని నర్సింలు ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తాము పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీలో 70 ఏళ్లు దాటిన వారికి పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఆశలు వదులుకున్నారు. 

కాంగ్రెస్​లో మాజీ మంత్రుల లొల్లి..

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి వ్యవహారం కాంగ్రెస్  పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న చిన్నారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి పరస్పర అవగాహనతో పార్టీలో కొనసాగుతున్నారు. జూపల్లి కృష్ణారావు వీరిద్దరికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనపై విరుచుకుపడుతున్నారు.

తమ నియోజకవర్గాల్లో జూపల్లి కృష్ణారావు జోక్యంపై చిన్నారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్​కు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్  పార్టీ టికెట్లు కేటాయిస్తే వారిని గెలిపిస్తానని జూపల్లి పేర్కొనడం సీనియర్లకు మండుకొస్తోంది. క్రమశిక్షణ కలిగిన నేతగా ఏఐసీసీ నేత చిన్నారెడ్డికి పేరుంది. ఆయన నియోజకవర్గంలో సైతం జూపల్లి మరొకరిని ప్రోత్సహించడాన్ని చిన్నారెడ్డి తప్పుపడుతున్నారు. కొల్లాపూర్ లో గెలిచి చూపించాలని జూపల్లిని చిన్నారెడ్డి సవాల్​ చేస్తుండగా, ఆయనకు అంత సీన్  లేదంటూ నాగం ఎద్దేవా చేస్తున్నారు. కొల్లాపూర్ తో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, గద్వాల అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని జూపల్లి  షరతు పెట్టడంలో అర్థం లేదని చిన్నారెడ్డి విమర్శిస్తున్నారు..

ఎన్నికల ఖర్చుపైనే ఆందోళన..

ఎన్నో ఏళ్లుగా సీనియర్  నేతలను నమ్ముకొని రాజకీయాల్లో ఉన్న ఆయా పార్టీల కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వీరిపై ఒత్తిడి పెంచుతున్నారు. 30 ఏండ్ల ముందున్న పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. పెరిగిన ఎన్నికల ఖర్చును భరించి విజయం సాధించగలమా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేయాలని ఉన్నా ప్రస్తుత పరిస్థితులను భయపెడుతున్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని వనపర్తి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల్లో తమకు పట్టు ఉన్నప్పటికీ ఎన్నికల ఖర్చు, తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్నారు.