తాడేపల్లి గ్యాంగ్ రేప్ విచారణలో సంచలన నిజాలు

తాడేపల్లి గ్యాంగ్ రేప్ విచారణలో సంచలన నిజాలు
  • నిందితులెవరైనా వదిలిపెట్టేది లేదు..
  • ఇలాంటి కేసులు వేగంగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలో 3 కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు: హోం మంత్రి సుచరిత
  • బాధితురాలికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం: స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత

అమరావతి: తాడేపల్లి పుష్కరఘాట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్ వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ స్పందించడంతో పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. నిందితుల కోసం ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. పాత నేరస్తుల, మాజీ రౌడీషీటర్ల విచారణతో మరికొన్ని బృందాలు రంగంలోకి దిగాయి. పాత నేరస్తుల పనే అయి ఉంటుందనే కోణంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాలకు చెందిన పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 
అసలు ఆరోజు ఏం జరిగిందంటూ  సీన్ రీకన్ స్ట్రక్షన్ 
కేసు చాలా సున్నితమైనది.. మరో వైపు పోలీసు యంత్రాంగం మొత్తం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ చేస్తోంది. పాత నేరస్తులు ఇచ్చిన క్లూల ఆధారంగా బాధితురాలి కాబోయే భర్తతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసి నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు బాధితురాలి కాబోయే భర్త కూడా పోలీసులకు సహకరిస్తుండడంతో కేసు తొందర్లోనే కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఇప్పటి వరకు పోలీసులు జరిపిన విచారణలో నిందితులు వీరి కదలికలపై పక్కా సమాచారంతోనే రెక్కీ చేసి అత్యాచారానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. కత్తులు పెట్టుకుని తిరిగితే పట్టుపడతామనే భయంతోనే బ్లేడ్లు, తాళ్లు పెట్టుకుని తిరుగుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది తమ పరువు పోతుందని.. పెళ్లి కాదేమోననే భయంతో పోలీసులకు చెప్పేందుకు లేదా ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తారని.. వీరు కూడా అదేబాపతు అని నిర్ధారించుకుని అఘాయిత్యానికి ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. 
దండుపాళ్యం గ్యాంగ్ కంటే దారుణంగా వ్యవహరించారు
విజయవాడకు చెందిన బాధితురాలు ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈమె డ్యూటీ ముగిశాక యువకుడు వచ్చి తీసుకుని వెళ్తుంటే దుండగులు వీరిని పలుమార్లు వెంబడించినట్లు అనుమానాలున్నాయి. ఈకోవలోనే శనివారం యువకుడు ఆస్పత్రికి వచ్చి బాధితురాలిని తీసుకుని బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో పుష్కర ఘాట్ వద్ద అదను చూసి దుండగులు దాడి చేశారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న వీరిపై బ్లేడ్లతో దాడి చేసి గాయపరచి తాళ్లతో బంధించారు. యువకుడు కేకలు వేయకుండా బెదిరించి అతడి ఎదురుగానే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇద్దరూ కలసి దుండగుల కాళ్లు పట్టకుని ప్రాధేయపడినా వినిపించుకోలేదని చెబుతున్నారు. తాము ఆవారా మనుషులం కాదని.. కాబోయే భార్యా భర్తలమని.. పెళ్లి నిశ్చయమైన ఫోటోలు మొబైల్ లో చూసి.. మమ్మల్ని వదిలేయండి... కావలంటే మొబైల్.. చైన్.. డబ్బులు అన్నీ తీసుకుని వెళ్లిపోండి.. మేము ఎవరికీ చెప్పమని వేడుకున్నా కనికరించలేదు. మా సుఖం అయిపోయాక.. మీ సుఖం చూసుకోమని బూతులు తిడుతూ అత్యాచారం చేసి.. చెవి రింగులు, డబ్బులు, మొబైల్ ఫోన్లు తీసుకుని ఓ నాటుపడవలో కృష్ణా నదిలో పారిపోయారు. 
బాధితులిద్దరూ నిందితులు పారిపోయాక రోడ్డుపైకి వచ్చి స్థానికుల సమాచారంతో ముందుగా కుటుంబ సభ్యులకు జరిగింది వివరించారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దండుపాళ్యం గ్యాంగ్ కంటే దారుణంగా వ్యవహరించినట్లు తేలడంతో కేసు సంచలనం సృష్టించింది. అంతేకాదు సీఎం జగన్ నివాసం తాడేపల్లికి కిలోమీటరున్నర లోపు దూరంలోనే ఘటన జరగడం కలకలం రేపింది. ఒకవైపు దిశ చట్టం తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసు శాఖ కేసును సవాల్ గా తీసుకుంది. 

సీఎం ఆదేశాలతో హోం మంత్రి సుచరిత, మహిళా సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత ఇద్దరూ కలసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధుతరాలిని సోమవారం పరామర్శించారు. 
ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను కఠినంగా అణచివేసేందుకే తమ ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. యువతులు, మహిళల్లో మానసిక ధైర్యం కల్పించి అండగా నిలిచేందుకు దిశ యాప్ అభివృద్ధి పరచి ఊరూరా.. వీధి వీధినా ప్రచారం చేస్తున్నామని.. ఈ యాప్ ను ఇప్పటికే 15 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని.. కేసును శాస్త్రీయంగా విచారించేందుకు మరో మూడు ఫోరెన్సిక్ ల్యాబ్ లు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కేసులో బ్లేడ్ బ్యాచ్ పనేనని అనుమానాలున్నాయని, ఇప్పటికే చాలా ఆధారాలు దొరికాయని, వీలైనంత వేగంగా నిందితులను పట్టుకుంటామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని.. కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. 
స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయం 5 లక్షలతోపాటు  తమ శాఖ తరపున మరో 50 వేలు అందిస్తామన్నారు.