
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఐబీ దాఖలు చేసిన తొలి చార్జిషీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారమే ఆమోదించింది. దాన్ని అనుసరించి నిందితులు (విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ ఆర్.పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్) అందరికీ సమన్లు జారీ చేసింది. వీరందరూ జనవరి 3న తమ ఎదుటు హాజరుకావాలని ఆదేశించింది. దాదాపు 10వేల పేజీల తొలి చార్జిషీట్ లో పలు సంచలన విషయాలను సీబీఐ పొందుపరిచింది. చార్జిషీట్ లోని వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ లిక్కర్ దందాను గుప్పిట్లోకి తీసుకునేందుకు..
ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు స్కెచ్ గీశారు. వీరందరితో ఏర్పడిన సౌత్ గ్రూప్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) పేర్కొన్న విషయాన్ని సీబీఐ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీలో తమకు ప్రయోజనం చేకూర్చే విధంగా మార్పులు చేయించుకునేందుకు సౌత్ గ్రూప్ కుట్ర పన్నింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి ఈ వ్యవహారం నడిపినట్లు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది. అభిషేక్ బోయినపల్లి దాదాపు రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు చార్జిషీటులో ప్రస్తావించారు. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు అందజేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు.. హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు వచ్చేలా, అందులో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని సీబీఐ వివరించింది.
ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు
హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా చార్జిషీట్ లో తెలిపింది. అంతేకాకుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు (విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ ఆర్.పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్) నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది.
కొందరు ప్రజా సేవకులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించింది. అడ్వాన్స్ కింది ముడుపులు అందాయని తెలిపింది. చట్ట విరుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కుట్రకు సంబంధించిన అంశాలను ఛార్జిషీటులో సీబీఐ పొందుపరిచింది. సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేనివారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు చార్జిషీటులో వెల్లడించింది.