Cyber crime : సైబర్ నేరగాళ్ల చేతిలో 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా

Cyber crime : సైబర్ నేరగాళ్ల చేతిలో 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసు విచారణలో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు.. దేశంలోని కోట్లమంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పబ్లిక్ కు ఫోన్ చేసి.. బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ఫోన్లు, మెసేజ్ లు చేస్తుంటారని గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 16 కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసినట్లు కనుగొన్నారు. దీంట్లో ప్రముఖంగా ఉమెన్ డేటా కూడా చోరీకి గురైందని గుర్తించారు.

వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అంతేకాదు.. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా సైతం చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లు గుర్తించారు. దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అంతేకాదు.. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.