
- 247 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై: మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఘర్షణలు, గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీనమైన ధోరణుల కారణంగా బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. వరుసగా రెండో సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 845.12 పాయింట్లు క్షీణించి రెండు వారాల కనిష్ట స్థాయి 73,399.78 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 929.74 పాయింట్లు క్షీణించి 73,315.16 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 247 పాయింట్లు తగ్గి 22,272.50 వద్ద స్థిరపడింది. రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా కీలక సూచీలు వరుసగా రెండు రోజులూ పతనమయ్యాయి.
గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 1,638 పాయింట్లు లేదా 2.19 శాతం నష్టపోయింది. నిఫ్టీ 481 పాయింట్లు లేదా 2.13 శాతం క్షీణించి 22,300 స్థాయికి పడిపోయింది. యూఎస్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండటం కూడా మార్కెట్లకు నష్టదాయకంగా మారింది. విదేశీ నిధుల ఔట్‌ఫ్లోలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, భారత్–-మారిషస్ పన్ను ఒప్పందంలో మార్పులను ప్రతిపాదించడం, యూఎస్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువ పెరగడంతో ఇండెక్స్‌లు నేలచూపులు చూశాయని ఎనలిస్టులు తెలిపారు.
సెన్సెక్స్ బాస్కెట్ నుంచి విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, టెక్ మహీంద్రా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెనుకబడి ఉన్నాయి. నెస్లే, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 1.54 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50 శాతం క్షీణించింది.
సెక్టార్ల ఇండెక్స్‌లు ఇలా...
సూచీలలో సేవలు 2.12 శాతం, ఆర్థిక సేవలు 1.81 శాతం, ఐటీ 1.58 శాతం, బ్యాంకెక్స్ 1.55 శాతం, యుటిలిటీస్ 1.37 శాతం చొప్పున క్షీణించాయి. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ లాభపడ్డాయి. మొత్తం 2,991 స్టాక్‌లు క్షీణించగా, 913 లాభపడ్డాయి. మిగతా 145 మారలేదు. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో హాంకాంగ్ నష్టాల్లో స్థిరపడగా, షాంఘై సానుకూలంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం నష్టాలను మూటగట్టుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.04 శాతం తగ్గి 89.51 డాలర్లకు చేరుకుంది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం రూ. 8,027 కోట్ల విలువైన, సోమవారం రూ.3,268 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇదిలా ఉంటే, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా మార్చిలో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 0.53 శాతానికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గింది.