
ముంబై: ఐటీ, ఫైనాన్షియల్ సెక్టార్ షేర్లలో వాల్యూ బయింగ్ కారణంగా స్టాక్ మార్కెట్లు సోమవారం వరుసగా మూడో రోజు ర్యాలీ చేశాయి. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 583 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మళ్లీ 25 వేల స్థాయిని చేరుకుంది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 0.72 శాతం పెరిగి 81,790.12 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 639.25 పాయింట్లు (0.78 శాతం) పెరిగి 81,846.42 గరిష్ట స్థాయికి చేరుకుంది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 183.40 పాయింట్లు (0.74 శాతం) పెరిగి 25,077.65 వద్ద ముగిసింది.
ఇది మూడు సెషన్లలో 466 పాయింట్లు (1.89 శాతం) పెరిగి సోమవారం 25 వేల స్థాయిని మళ్లీ అందుకుంది. సెన్సెక్స్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ ఎక్కువగా లాభపడ్డాయి. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, టైటాన్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.68 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం తగ్గింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లు ఇలా..
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లలో బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ అత్యధికంగా 2.21 శాతం దూసుకెళ్లింది. దీని తరువాత ఐటీ (1.96 శాతం), టెక్ (1.60 శాతం), బ్యాంకెక్స్ (1.10 శాతం), హెల్త్‌కేర్ (1.05 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.93 శాతం) ఉన్నాయి. కమోడిటీస్, ఎఫ్ఎంసీజీ, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, మెటల్ నష్టపోయాయి.
"బ్యాంకింగ్, ఐటీ హెల్త్‌కేర్ స్టాక్‌లలో లాభాల కారణంగా మార్కెట్ సెషన్ అంతా సానుకూలంగా ఉంది. అయితే ఇది బ్రాడ్‌బేస్డ్ ర్యాలీ కాదు. విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరుపుతున్నారు’’ మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ దాదాపు 5 శాతం పెరిగింది.
హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ నష్టపోయింది. చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు సెలవుల వల్ల పనిచేయలేదు. యూరప్‌లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.78 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.68 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ. 1,583.37 కోట్ల ఈక్విటీలను అమ్మారు.