అమ్మా నాన్నా… విడిపోతే..!

అమ్మా నాన్నా… విడిపోతే..!

స్వేచ్ఛ అనేది వ్యక్తిగతం.  ప్రేమ ఇద్దరు మనుషుల అనుబంధం. ఇక్కడి వరకు ఏదీ ఇంకొకళ్ళని నొప్పించేది కాదు. ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయం. కానీ పెళ్లితో రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారంగా, పిల్లలు పుట్టిన తర్వాత సోషల్​ రెస్పాన్సిబులిటీగా మారుతుంది. పిల్లలు కేవలం తల్లిదండ్రుల ఆస్తి కాదు వాళ్ళు ఈ సొసైటీకి కూడా చెందిన వాళ్ళు. అమ్మా నాన్నలు విడిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి?

‘కస్టడీ పోరులో తల్లిదండ్రుల్లో ఎవరు గెలిచినా.. చివరకు ఓడేది చిన్నారులే. ఈ పోరాటంలో మూల్యం చెల్లిస్తోంది పిల్లలే’  అని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించటంతో మళ్ళీ ఒకసారి విడాకులమీద, విడిపోయిన జంటల పిల్లల మీద ఓ చర్చ జరుగుతోంది.

ఆ గాయాలు మానవు

భార్యాభర్తలుగా విడిపోవటం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ  కానీ తల్లిదండ్రులు విడిపోవడం అనేది పిల్లలు అంత ఈజీగా మర్చిపోలేని విషయం. తల్లిదండ్రులలో ఏ ఒక్కరు దూరమైనా పిల్లలు బాధపడతారు. తల్లి, తండ్రి ఎవరో ఒకరు దూరం అవడాన్ని తట్టుకోలేరు. ప్రతి విషయంలోనూ తమ బలం అని అనుకునే పిల్లలకి  పేరెంట్స్‌‌లో ఒకరు దూరం కావటం మానసికంగా పెద్ద షాక్. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలపై ఆ ప్రభావం పెద్దయ్యాక కూడా ఉంటుంది. ఆ గాయాలు మానవు. అయితే విడిపోవటం అనేది తప్పనిసరి పరిస్థితి కాబట్టి విడిపోయిన భార్యాభర్తలు బిడ్డలపై ఎటువంటి నెగెటివ్ ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మానసికమైన ఒత్తిడి

బాగా గుర్తుంచుకోవాల్సింది పిల్లలని రాయబారానికి ఉపయోగించొద్దు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలని విడిపోయిన భార్య లేదా భర్తతో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకుంటారు. ‘ఈ విషయం చెప్పు, ఫలానా విషయం కనుక్కో…’  అంటూ పిల్లలతో మాట్లాడిస్తుంటారు. ఆ కమ్యూనికేషన్  పిల్లల మీద మానసికమైన ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల ఇదివరకు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న ప్రభావం నుంచి బయటపడకుండానే, ‘నేను ఒంటరినీ’ అన్న బాధలో పడిపోతారు.

మళ్లీ మళ్లీ చర్చించకూడదు

పిల్లలు సైకాలజిస్టులు కారు, వాళ్లతో మళ్లీ మళ్లీ డైవోర్స్ విషయం చర్చించకూడదు. ఎందుకు విడిపోవాల్సి వస్తోందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే చాలు. పిల్లలతో డైవోర్స్ విషయాలు పంచుకోవడం మంచిది కాదు. తల్లిదండ్రులుగా టీనేజ్ వయసు పిల్లలపై పడే ఒత్తిడి ని కంట్రోల్ చెయ్యవలసిన బాధ్యత కూడా అమ్మానాన్నలిద్దరిది.

ఇలా పెద్దవాళ్ళ విషయాలు పిల్లలతో పంచుకోవడం వల్ల వారు మరింత అసహనానికి గురవుతారు. పదే పదే ఈ విషయాలని చర్చిస్తూ వాళ్ళలో అసహనం పెంచటం వాళ్ల మానసిక ఒత్తిడిని ఇంకా ఎక్కువ చేయటమే.

పిల్లలకీ హక్కులుంటాయి

పిల్లలని దగ్గర ఉంచుకునే హక్కులే కాదు పిల్లలకి ఉండే హక్కులని కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తరువాత పిల్లలు ఇన్ఫీరియారిటీకి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్లకి దగ్గరగా ఉండి డైవోర్స్ అంటే ఏదో జరగకూడని విషయం కాదని, దీనివల్ల వాళ్ల లైఫ్ మీద ఏ ప్రభావమూ ఉండదనే నమ్మకం కలిగించాలి.

పిల్లల భయాలని అర్థం చేసుకోవాలి. పిల్లల ముందు ఎప్పుడూ విడిపోయిన పార్ట్‌‌నర్‌‌‌‌ని తిట్టొద్దు. ఒక వేళ పిల్లలు వాళ్ల అమ్మ లేదా నాన్నతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి.

సమస్యని అర్థం చేసుకోవాలి

విడిపోవటం ఇద్దరు మనుషుల లైఫ్‌‌లో విషాదమే కానీ…. ఆ బాధలో పిల్లల్ని అవాయిడ్ చేయకూడదు. మనకన్నా పిల్లలు మరింత బాధలో, భయంలో ఉంటారు. అందుకే పిల్లలతో ఆ సమయంలో ఎక్కువ గడపటం అవసరం. కొన్ని నెలల పాటు వాళ్ళ ప్రవర్తనలో, చదువులో వచ్చే మార్పుని గమనిస్తూ ఉండాలి. ఏమాత్రం మార్పు కనిపించినా వాళ్ల సమస్యని అర్థం చేసుకుని వాళ్ల గురించి కేర్ తీసుకోవాలి. అవసరమనుకుంటే కౌన్సెలింగ్ ఇప్పించాలి.

చిన్నాపెద్దా సమస్యలొచ్చినా.. గొడవలు పెద్దవై విడిపోయినా.. అది తాత్కాలికంగానే ఉండేది. అయితే.. ఫాస్ట్ కల్చర్‌‌లో మార్పులూ ఫాస్ట్‌‌ఫాస్ట్‌‌గానే వచ్చేస్తున్నాయి. చిన్న గొడవ వచ్చినా విడిపోవడం కామన్ అయిపోయింది. అదీ చట్టబద్ధంగానే. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబ వ్యవస్థ ప్రభావం పిల్లల కెరీర్లపై ఖచ్చితంగా పడుతుంది. తల్లిదండ్రులతో పాటు పెరిగిన పిల్లలూ, సింగిల్ పేరేంట్స్ పిల్లల మీద యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్ సిన్ సోషియాలజీ శాఖలోని హైయున్ సిక్ కిమ్ చేసిన ఒక సర్వే ప్రకారం తల్లిదండ్రులతో కలసి పెరిగిన పిల్లలతో పోలిస్తే, డైవోర్సు తీసుకున్న వారి పిల్లలు సమాజంలో కొద్దిపాటి పోరాటం సాగిస్తారని, చదువులో కూడా వెనుకబడతారని, విడాకులు తీసుకున్న వారి పిల్లలు, ఆందోళన, ఒంటరితనంతో కెరీర్ లో వెనుకబడతారని తేలింది. కిమ్ దాదాపు 3,500 మంది అమెరికా ఎలిమెంటరీ స్కూలు పిల్లల ప్రవర్తనని గమనించారు. డైవోర్స్ కు ముందు, డైవోర్స్ తర్వాత పిల్లల ప్రవర్తనని గమనించారు. ఇందులో బాగా వెనుకబడ్డట్టు ఉన్నవాళ్లని చూస్తే వాళ్లలో 99% మంది పిల్లల పేరెంట్స్ డైవోర్స్ తీసుకున్న వాళ్లే అని తేలింది.