నేడు కాళోజీ జయంతి

నేడు కాళోజీ జయంతి

‘ఏ భాష నీది.. ఏమి వేషమురా
ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకు రా..
తెలుగువాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి.. ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’

ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారు కాళోజీ చెప్పిన ఈ మాటలను చెవులారా వినాలి. ఇంగ్లీషు మాట్లాడుతూ మురిసిపోయేవారు.. కాళన్న చెప్పిన ఈ మాటల్లోని సందేశాన్ని బుర్రకు ఎక్కించుకోవాలి.  సాహిత్యాన్ని గ్రంథాల్లో రాసి తరించడానికే కాదు. ప్రజల మెదళ్లను సానబెట్టే అస్త్రంగానూ ప్రయోగించవచ్చని గుర్తించిన జనం కవి కాళోజీ నారాయణరావు. అందుకే ఆయన జయంతి సెప్టెంబర్ 9న. ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా గుర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహిస్తున్నాం. ఆ  రోజున రాష్ట్రమంతా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు పెడ్తున్నరు. తెలంగాణ భాషా, సాహిత్యరంగాల్లో విశేష కృషి చేసిన వారికి భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్ర స్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాలు కూడా ఇస్తున్నరు. కాళోజీ అన్నట్లు రెండున్నర జిల్లాల భాషనే తెలుగు భాషగా మనపై గతంలో బలవంతంగా రుద్దిన్రు. ఇప్పుడట్ల లేదు. తెలంగాణ తల్లి భాషకు విముక్తి కలిగింది. తెలంగాణ యాసే.. ఇప్పుడు అధికార భాషగా అవతరించింది. ఇంత గొప్పగా చెప్పుకునే తెలంగాణ భాష, యాస గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..!

తెలంగాణ భాషకు పెరుగుతున్న ఆదరణ 
తెలంగాణ భాష, యాస అంటే చాలామందికి చిన్నచూపు ఉండొచ్చు. ‘ఇదేం భాష?’ అన్నట్టూ అనిపించవచ్చు. కానీ, తెలంగాణ భాష విలువ తెలిసినోళ్ళు, అందులోని మమకారం తెలిసినోళ్ళు ఆ భాషపై ప్రేమ సూపెట్టకుంట ఉండలేరు. ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు మారుతున్నా.. తెలంగాణ భాషకు ఉనికి మాత్రం ఏ మాత్రం తగ్గలే. నిజానికి ఈ భాషలో చెప్పుకునేంత గొప్పగా పదాలు, అక్షరాలు లేకపోవచ్చు. కానీ, భాషను ఉచ్చరించేటప్పుడు మనలో కలిగే భావన ఉంటది కదా... అది మరే భాషలోనూ కనిపించదు. అద్భుతం, అజరామరం లాంటి పదాలతో వర్ణించకపోయినా.. తెలంగాణ భాషపై రోజురోజుకు ఆదరణ పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస

తెలంగాణ భాష అనేది నిజానికి ఎక్కువగా ఉర్దూ భాషతో మిళితమై ఉంటది. ఎవరైనా ఈ భాషలో మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్థమైతది. మామూలుగా తెలంగాణ అంటే... తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన భాషగా చెప్తారు. కానీ, ఈ 33 జిల్లాల్లోనూ ఒక్కో తీరు యాస ఉండడం చెప్పుకోదగిన విషయం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తెలంగాణ యాస ఉండడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలలో ఈ భాష ఒక్కో రకంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

గీ :
ఇగో : ఇదిగో
గిట్ల : ఇట్ల
తూటు : రంధ్రం
ఏతులు : గొప్పలు
మలుపు : మూల
తాపతాపకు : మాటిమాటికి
జల్ది : త్వరగా
కొత్తలు : డబ్బులు
ఎంచు  : లెక్కించు
నాదాన : బలహీనం
నప్పతట్లోడు : పనికి మాలినవాడు
ల్యాగ : ఆవు దూడ
గుపాయించు : జొరబడు
కూకొ : కూర్చో
కూనం : గుర్తు
మడిగ : దుకాణం
పొట్లం : ప్యాకింగ్
బత్తీసలు : అప్పడాలు
పతంగి : గాలిపటం
సోంచాయించు : ఆలోచించు
పయఖాన : టాయిలెట్
మోసంబి : బత్తాయి
అంగూర్ : ద్రాక్ష
కష్‌కష్ : గసాలు
కైంచిపలంగ్ : మడత మంచం
చెత్రి : గొడుగు
కల్యామాకు : కరివేపాకు
మచ్చర్‌దాన్ : దోమతెర
మడుగుబూలు : మురుకులు
జమీర్‌ఖాన్ : భూస్వామి
జాగా : స్థలం
జల్ది : తొందరగా
లెంకడం : వెతకడం
అచ్చిండ్రా, పోయిండ్రా : వచ్చినరా, పోయినారా
జమానా : అప్పట్లో
శాయిపత్తి : తేయాకు
పెంక : పెనం
లాగు : నెక్కరు
తోల్కపోవు : తీసుకెళ్లు
శాన్పి : కళ్లాపి


ఇక గిట్లా చెప్పుకుంటూ పోతే గిలాంటి పదాలు శాన్నే ఉంటయ్. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే మరాఠీ ప్రభావం శాన్నే ఉంటది అక్కడ.  పదం ఏదైనా అర్థమైతే అదే. గలాంటప్పుడు గీ భాషపై విమర్శలెందుకు..!

సైన్మలల్ల దుమ్ము దులుపుతున్న తెలంగాణ యాస...

ఈ దినాన తెలంగాణ భాషను సినిమాల్లో మస్తు  వాడుతుండ్రు. దీని వల్ల ఇంకా ఎక్కువ మందికి తెలంగాణ భాష ఎరికైతుంది. ఒకప్పటి సినిమాల్లోనూ బాబుమోహన్, కోట శ్రీనివాస రావు, తెలంగాణ శకుంతల లాంటోల్లు తెలంగాణ భాషల డైలాగులు చెప్పి ఎంత పేరు తెచ్చుకున్నరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష గురించి చెప్పాల్నంటే శాననే ఉంటది. 

కోట శ్రీనివాస్ రావు : ఏం రోవ్ రామ్మూర్తి గట్ల గుడ్లగూబ లెక్క జూస్తున్నావ్. నీ లెక్క ఫాల్తు సైన్మల్ దీస్తననుకున్నావ్ రా. సూప్పర్ ఇస్టార్ కృష్ణను వెట్టి జబ్బర్దస్త్ సైన్మ దీస్త బిడ్డా...ఆ!!!

నల్లబాలు (వేణుమాధవ్) : అబె వో ఏం రా ఉర్కుతుర్రు. మా కి కిర్ కిరి పెద్ద పెద్ద అక్షరాలతో రాయుర్రి బే, దేత్తడి పోచమ్మ గుడి. నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క.

జయప్రకాష్ రెడ్డి : ఏమయిందిరా, అచ్చిర్రు, కొట్టుకుర్రు, బోయిండ్రు.

మహేష్ బాబు : కళ్ళున్నోడు ముందు మాత్రమే జూస్తడు. దిమాక్ ఉన్నోడు దునియ మొత్తం జూస్తడు.

అయితే గీ కథ గిప్పటిది అనుకుంటున్నరా.. కాదండోయ్.. 1989లో రాఘ‌వేంద్ర రావు ద‌ర్శక‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి తీశిన సిన్మా ఉంది కదా. అదే రుద్రనేత్ర. గా సిన్మాతోని మొదలైంది మన తెలుగు సినిమాలల్ల ఈ తెలంగాణ యాస. అప్పట్లో ఈ సిన్మా బాగానే ఆడింది. ఒక్క తెలంగాణల తప్ప. అన్ని చోట్లా అందరికీ కొత్తగానే అనిపించింది గీ సిన్మా లోని యాస. ఆ త‌ర్వాత విక్టరీ వెంక‌టేష్ న‌టించిన పోకిరి రాజా సినిమాలోనూ తెలంగాణ స్లాంగ్ ను వాడిండ్రు. గీ సిన్మాల గిట్ల మస్తు తెలంగాణ డైలాగులు ఉంటయ్. కానీ, సరైన ప్రచారం లేక‌పోవ‌డంతో ఆ స్లాంగ్ కు ఆద‌ర‌ణ అంత‌గా ద‌క్కలేదని అంటుంటారు. మ‌ళ్లీ కొన్నేళ్ల త‌ర్వాత అక్కినేని నాగార్జున నటించిన కింగ్ సినిమా తెలంగాణ యాస‌తోనే బాక్సాఫీస్ దగ్గర బంప‌ర్ హిట్ కొట్టింది. దీనికోసం నాగార్జున అప్పట్ల స్పెషల్ ట్రైనింగ్ కూడా తీస్కుండట. అప్పట్నుంచి తెలంగాణ యాస‌కు మ‌రింత ఐడెంటిటీ ద‌క్కిందని  చెబుతుంటారు.

ఇవే కావండోయ్.. ఖుషీ, జ‌ల్సా సినిమాల్లోనూ తెలంగాణ యాస‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ అద‌ర‌గొట్టిండు. ఇగ మ‌హేష్ బాబు హీరోగా చేశిన ‘దూకుడు’ సైన్మల అయితే చెప్పనే అక్కరలేదు. సినిమా మొత్తం తెలంగాణ యాస‌ను హైలైట్ చేస్తూ.. మరింత ఆదరణ వచ్చేలా చేసిండ్రు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏమన్నా తక్కువా..? ‘బాద్ షా’ సినిమాలో  ‘కాకా’ అనే డైలాగ్ ను మర్చిపోతమా ఏందీ ? ఇక విజ‌య్ దేవర‌కొండ తెలంగాణ యాస‌తోనే కదా పెద్ద స్టార్ అయింది. ఆయన స్టార్ అవ్వడానికి ప్రధాన కార‌ణమే తెలంగాణ భాష అయితే. ఈ మ‌ధ్యనే హీరోగా ప‌రిచ‌య‌మైన విశ్వక్ సేన్ కూడా హైద‌రాబాద్ యాసతోనే కదా (ఫ‌ల‌కనుమా దాస్) బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ అంటూ పక్కా హైద‌రాబాద్ యాసతో బ్లాక్ బ‌స్టర్ కొట్టిన రామ్ పోతినేని సిన్మా గురించి చెప్పకపోతే ఎట్లా..? గీ సిన్మా అయితే రామ్ కు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఇంకా ఎఫ్-2లో హీరో వ‌రుణ్ తేజ్, రుద్రమ‌దేవి సినిమాలో అల్లు అర్జున్, శ్రీకాంత్, నితిన్, విష్ణు, నిఖిల్ తెలంగాణ యాసలో మెప్పించినొళ్లే. 

ఇక ఇప్పట్ల వస్తున్న సినిమాలల్లో ఒకటో, రెండో తెలంగాణ భాష డైలాగులు పెట్టడం మామూలైంది. ఆ విషయానికొస్తే వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి తీసిన సిన్మా ఫిదా ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే కదా. దీంట్ల హీరోయిన్ ఏయ్ పిలగా, భానుమతి ఒక్కటే పీస్. హై బ్రీడ్‌ పిల్ల, అమ్మాయిలు కాదు అమ్మాయి, గట్టిగా అనుకో అయితదిలే... లాంటి డైలాగులు ఇప్పటికీ మస్తు ఫేమస్. రీసెంట్ గా వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా గురించైతే ఎంత చెప్పినా తక్వనే. తెలంగాణ యాసతోటి హీరో సిద్దు మస్తు యాక్టింగ్ చేశిండు. ‘అట్లుంటది మనతోని’ అన్న డైలాగు చిన్న పోరని కాన్నుంచి ముసలోళ్ల వరకూ వాడుతున్నరంటేనే అర్థం చేస్కోవచ్చు సినిమా ఎంత హిట్ అయ్యిందో. గిట్ల చెప్పుకుంటూ పోతే శాన్నే ఉంటయ్. కానీ, ఇక్కడ మంచిగా లేని విషయం ఒక్కటే. అప్పట్లో తెలంగాణ భాషల సినిమాలు అంటే ఒకటో, రెండో. ఇప్పుడిప్పుడు ఆ యాసలో సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నరు. కానీ, ఇంతకు ముందు ఉన్నదా గిట్ల. ఈ టైం వస్తానికే ఇన్ని ఏళ్ళు పట్టే. ఇంకా మన తెలంగాణలో ఉన్న యాక్టర్లకు ఛాన్స్ లు మాత్రం శానా తక్కువే అని చెప్పాలి. ఇప్పడు తెలంగాణ భాషకు డిమాండ్ వచ్చినట్టే.. మన తెలంగానోళ్లకూ ఎప్పుడు మంచి రోజులొస్తాయో ఏమో..?

మాటల్లో మంచి, చెడు ఉంటయ్ గానీ.. భాషలో మంచీ, చెడు ఉంటాయా..? గట్లనే తెలంగాణలో ఒక్కో పదం ఉచ్చారణ ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కానీ, అర్ధం మాత్రం మారదుగా. అలాగే ఒకళ్లు స్నానం అంటే... ఇంకో కాడ తానం అంటరు. ఒకలు బాట అంటే.. ఇంకొకళ్ళు తొవ్వ అంటరు. ఒకళ్ళు సోపతి అంటే.. మరొకళ్ళు స్నేహం అంటరు. యాదికుందా అని కొందరంటే... గుర్తుందా అని కొందరంటరు.. ఇట్ల ఎట్ల అన్నా ఒకటే. కానీ భాషను ఉచ్చరించడంలో ఉన్న ఆ గొప్పతనం పేరే యాస అనుడు కరెక్టేనేమో. అచ్చిండ్రా, పోయిండ్రా అన్న పదాలు తెలంగానోళ్లకు కొత్త కాదేమో. అయినా అనుకుంటం గానీ ఏ గడ్డ మీద పుట్టినోళ్ళు ఆ భాష మాట్లాడాలె. అంతేగానీ దానికి నామూషీ ఎందుకో ఇంతకీ అర్ధం కాదు. అచ్చమైన తెలంగాణ పల్లెల అయితే స్నానం చేసి వస్తావా అని అనరు. తానం చేశి అస్తవా అంటరు. నిజానికి తెలుగు అనేది సంస్కృతం కలవని భాష. కానీ, తెలంగాణ భాషలో సంస్కృతం ఉంటది, ఉర్దూ ఉంటది.. ఇంకేమన్నా అంటే హిందీ కూడా ఉంటది. ఒకప్పుడు పోతన్న, వత్తన్న అన్న పదాలు గిప్పుడు వినిపిస్తలేవు అని చెప్పే టైం రావడం నిజంగా గడ్డు కాలమే కదా. అందుకేనేమో తెలుగు, తెలంగాణ అన్న భాషలు వేరైనై. అందుకే మన సంస్కృతి, భాష, సాహిత్యం దోసుకున్నరు అన్న చర్చ జరిగింది. వాల్లు వాల్లది వాల్ల చేతులల్ల ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా వాడిండ్రు. అవి అందరి మీద రుద్దిండ్రు. ఇప్పుడు ఎవ్వలది వాళ్లకు వేరే అయినంక మనం మన సోయిలకు రావాలె. గప్పుడే తెలుగు అంటే తెలంగాణం అని తెలుస్తది.   

‘నా గొడవ’లో కాళోజీ నారాయణ రావు చెప్పినట్టు ‘‘ఇకనైనా తెలంగాణ భాషల రాయండ్రి, తెలంగాణ భాషల మాట్లాడుండ్రి, తెలంగాణ బతుకు బతుకుండ్రి. మన బతుకులను అన్యాయం చేసి, దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమాలె. మన ప్రాంతంవాడే దోపిడీ చేస్తే.. ప్రాణంతోటే పాతర పెట్టాలె.- అంత అగ్వకున్నదా తెలంగాణ భాష..? ఇగ సహించవద్దు. నేను గిట్లనే మాట్లాడ్త, గిట్లనే రాస్త. మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ సంస్కృతున్నది, ఈ యాసలున్న పల్కుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నది” అంటూ నినదించిన కవి మన కాళోజీ నారాయణరావును మరో పారి యాదికి తెచ్చుకుంటూ ఆయనకివే మన ఘన నివాళులు.