ఒంటరి మహిళలను చంపి.. ఒంటిపై బంగారం చోరీ

ఒంటరి మహిళలను చంపి.. ఒంటిపై బంగారం చోరీ
  • ఇప్పటివరకు రెండు హత్యలు..
  • చనిపోయిందనుకుని మరొకరిని వదిలేసిండు
  • బెట్టింగ్, వ్యభిచారానికి డబ్బుల కోసమే మర్డర్లు
  • నిందితుడి అరెస్ట్
  • పది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

మెదక్, వెలుగు: బెట్టింగ్,వ్యభిచారానికి అలవాటు పడి డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్​గా హత్యలు చేసి ఒంటిపై బంగారం ఎత్తుకెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒక హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానంతో విచారిస్తుండగా అంతకుముందు చేసిన రెండు మర్డర్ల గురించి చెప్పాడు. శుక్రవారం మెదక్​ ఏఆర్​హెడ్​క్వార్టర్స్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరాలు తెలియజేశారు. ఈ నెల 24న మెదక్ పట్టణ పరిధిలోని పిట్లంబేస్​ వీధిలోని తన ఇంట్లో తలకొక్కుల సుజాత (42) హత్యకు గురైంది. ఆమెను చంపేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, కమ్మలు ఎత్తుకెళ్లారు. దీంతో దర్యాప్తు కోసం మెదక్​ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో మూడు స్పెషల్​టీంలను ఏర్పాటు చేశారు. 

సీసీ కెమెరాల పుటేజీ, ఇతర ఎవిడెన్స్​ఆధారంగా పిట్లంబేస్ వీధికే చెందిన గోల్డ్​స్మిత్​ వజ్రబోయిన కౌశిక్​ (27)ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే సుజాతను హత్య చేసినట్టు అంగీకరించాడు. కూరగాయలు అమ్ముకునే సూజాత తరచూ నిందితుడి షాపుకు వచ్చిపోయేది.  ఈ పరిచయంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న టైం చూశాడు. ఒకరోజు ఆమె ఇంటికి వెళ్లి చంపి బంగారం చోరీ చేశాడు. అలాగే 2017 ఫిబ్రవరిలో మెదక్ బ్రాహ్మణ వీధిలో ఒంటరిగా ఉన్న కుకునారపు సుశీల ​(70)ను కూడా తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మెదక్ లోని పెద్ద బజార్ వీధికి చెందిన అంగని లక్ష్మి(70)పై ఒంటరిగా ఉండడం చూసి దాడి చేయగా ఆమె పడిపోయిందని, చనిపోయిందని భావించి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లానని చెప్పాడు. కొన ఊపిరితో ఉన్న ఈమె బతికి బయటపడినా కౌశిక్​ పట్టుబడలేదు. చివరకు సుజాత కేసుతో గుట్టు రట్టయ్యింది. 
 

బెట్టింగ్​, వ్యభిచారానికి అలవాటు పడి..

మెదక్​ పెద్ద బజార్​లో గోల్డ్​ స్మిత్​పని చేసే కౌశిక్​ బెట్టింగ్, వ్యభిచారానికి అలవాటుపడ్డాడు. డబ్బులు సరిపోక ఒంటరి మహిళలను చంపి బంగారం చోరీ చేస్తే ఎక్కువ డబ్బుల వస్తాయని భావించాడు. వాటిని అమ్మడం తేలికే అనుకున్నాడు. అనుకున్నట్టుగానే 2017 నుంచి అదును చూసి ఒంటరి మహిళలను గుర్తించి చంపి ఒంటిపై బంగారం ఎత్తుకెళ్తున్నాడు. నిందితుడు ఒకరికి ఇచ్చిన 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. హత్య కేసును ఛేదించడంలో కృషి చేసిన మెదక్ డీఎస్పీ సైదులు, టౌన్​, రూరల్ సీఐలు మధు, విజయ్​, సీసీఎస్​ సీఐ గోపీనాథ్​, పీసీలు పవన్​, మహేందర్, గంగరాజులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.