వెయ్యి రూపాయలకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్

వెయ్యి రూపాయలకే రెండు డోసుల   కరోనా వ్యాక్సిన్

కరోనావైరస్ విరుగుడు కోసం ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను రూ. 1000కే రెండు డోసులు అందిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనవల్లా అన్నారు. ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫిబ్రవరి 2021 నాటికి హెల్త్ వర్కర్లకు మరియు వృద్ధులకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆయన అన్నారు. కాగా.. 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తారని ఆయన అన్నారు.

‘దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి రెండు లేదా మూడు సంవత్సరాలు పడుతుంది. బడ్జెట్, వ్యాక్సిన్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, సరఫరా మొదలైన వాటివల్ల ఇంతసమయం పడుతుంది. కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేశ జనాభాలో 80-90 శాతం మందికి రెండు మోతాదుల వ్యాక్సిన్ వేయడానికి 2024 వరకు సమయం పడుతుంది. ఈ వ్యాక్సిన్ ధర రెండు మోతాదులకు కలిపి 5 నుంచి 6 డాలర్లు అంటే 1,000 రూపాయలు ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా తక్కువ ధరకు, 3-4 డాలర్లకే సరఫరా చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయబడుతోంది. ఈ రోజు మనం మార్కెట్లో ఉన్న ఇతర వ్యాక్సిన్ల కంటే చాలా తక్కువ ధరతో మరియు సరసమైన ధరలకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నాం’ అని పూనవల్లా అన్నారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధులలో చాలా బాగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇది మంచి టి-సెల్ ప్రతిస్పందనను ప్రేరేపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలికంగా రోగనిరోధక శక్తి మరియు యాంటీబాడీలను పెంచుతుందన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయో లేవో తెలియాలంటే మాత్రం ఇంకా టైం పడుతుందని పూనవల్లా అన్నారు.

యూకే అధికారులు మరియు యూరోపియన్ మెడిసిన్స్ ఎవాల్యుయేషన్ ఏజెన్సీ (ఇఎంఇఎ) అత్యవసర ఉపయోగం కోసం దీనిని ఆమోదించిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగం కోసం అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పుడే పిల్లలకు అందుబాటులోకి తీసుకురాబోమని, మొదటగా వృద్ధులకు మరియు సీరియస్‌గా ఉన్నవాళ్లకు మాత్రమే వేస్తామని ఆయన అన్నారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడిందని పూనవల్లా చెప్పారు. ఈ ఉష్ణోగ్రతల వద్ద భారత్‌లో కూడా వ్యాక్సిన్‌ను నిల్వ చేయోచ్చని ఆయన అన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు 10 కోట్ల మోతాదులను తయారు చేయాలని ఎస్‌ఐఐ యోచిస్తోందని.. భారత్‌కు ఎన్ని డోసులు అందించాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఈ విషయంలో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పూనవల్లా అన్నారు.

‘జూలై నాటికి భారతదేశం 400 మిలియన్ డోసులు కావాలంటోంది. అయితే ఆ డోసులన్నీ సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి తీసుకుంటుందో లేదో నాకు తెలియదు. కానీ, మేం మాత్రం ఆ డోసులను సప్లై చేయడానికి సన్నద్ధమవుతున్నాం. అయితే ఈ డోసుల విషయంపై ఇంతవరకు ఎటువంటి ఒప్పందం లేదు. మాకు భారతదేశం ముఖ్యం కాబట్టి ఇతర దేశాలతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం లేదు. మేం ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు తప్ప మరే దేశానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం చాలా దేశాలతో భాగస్వామ్యం కావడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా దగ్గర సప్లై చేయడానికి తగినంత స్టాక్స్ లేవు. మేం మొదట భారతదేశానికి ఆ తర్వాత ఆఫ్రికాకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం’ అని పూనవల్లా అన్నారు.

For More News..

కార్పొరేటర్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన టీఆర్ఎస్

పది నిమిషాల్లో రూ. 12 కోట్ల విలువైన బంగారం దోపిడీ

మారువేషంలోనైనా భాగ్యలక్ష్మి గుడికి చేరుకుంటా