సర్వర్​ బిజీ..పది రోజులుగా సతాయిస్తున్న పీఎం విశ్వకర్ సైట్

సర్వర్​ బిజీ..పది రోజులుగా సతాయిస్తున్న పీఎం విశ్వకర్ సైట్
  •     అప్లై చేసుకోవడానికి వచ్చి తిరిగి వెళ్తున్న పబ్లిక్​

మహబూబ్​నగర్​, వెలుగు :  పీఎం విశ్వకర్మ స్కీంకు అప్లయ్​ చేసుకునేందుకు  ప్రాబ్లమ్స్​ఎదురవుతున్నాయి. రోజుల తరబడి మీసేవా సెంటర్లు,  సర్వీస్​ సెంటర్లకు  వస్తున్న ప్రజలు  సర్వర్​ బిజీ ఉండటం చూసి తిరిగెళ్లిపోతున్నారు. దాదాపు రెండు నెలలుగా  ఇదే పరిస్థితి ఉండటంతో అప్లయ్​ చేసుకునేందుకు ఎవరూ ముందకు రావడం లేదు.గతేడాది సెప్టెంబరు 17న ఈ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం వడ్డీ రేటుతో  రూ.లక్ష లోన్​ అందించేందుకు నిర్ణయించింది.  వడ్రంగి, బోటు తయారీదారులు, కమ్మరి, సుత్తె  పని ముట్లు, తాళాలు చేసే వారు, గోల్డ్ స్మిత్, శిల్పి, స్టోన్ బ్రేకర్, చర్మకారులు, బార్బర్, దోబీ, టైలర్​తో పాటు 18 వర్గాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది.  

  అప్లికేషన్లు చేసుకోవడానికి ఆన్​లైన్​ సెంటర్లకు వెళ్తున్న వారికి సైట్ ఓపెన్​ కావడం లేదు. కొన్ని సెంటర్లలో సైట్​ ఓపెన్​ అవుతున్నా,  వివరాలన్నీ  అప్​లోడ్​ చేశాకా సబ్మిట్​ కావడం లేదు.  దీనికితోడు బెనిఫీషరి వన్​ టైం పాస్​ వర్డ్​ (ఓటీపీ) ఆన్​లైన్​లో ఎంట్రీ చేసే సమయంలో కూడా సర్వర్​ రావడం లేదు.  అప్లికేషన్​లు చేయడానికి మీ సేవా సెంటర్లు, కామన్​ సర్వీర్​ సెంటర్లలో ఒకే సారి ఓపెన్​ చేస్తుండటంతో సైట్​పై ఓవర్​ లోడ్​ పడుతోందని నిర్వహకులు చెపుతున్నారు. 

అప్లికేషన్​కు వంద వసూలు

మీ సేవా సెంటర్లు, కామన్​ సర్వీస్​ సెంటర్లలో ఈ  అప్లికేషన్​లు ఫ్రీగా చేయాలి.  ఒక్కో అప్లికేషన్​కు సెంట్రల్​ గవర్నమెంట్​ ఈ సెంటర్లకు రూ.80 చొప్పున చెల్లిస్తుంది. అయితే సెంటర్ల నిర్వాహకులు మాత్రం పబ్లిక్​ నుంచి ప్రతి అప్లికేషన్​కు రూ.వంద చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రింట్ తీయడం​, స్కానర్​, ఆధార్​ అథెంటికేషన్​, బయోమెట్రిక్​ లింక్​ తదిరత ఆన్​లైన్​ చేయాల్సి ఉంటుందని రూ.వంద సర్వీస్ చార్జ్​ తీసుకుంటున్నారు.

గతంలో చేసిన పనికి పైసల్​ రాలే..

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట పీఎం కుసుమ్​ సర్వే చేయించింది. ఈ సర్వే చేసేందుకు కామన్​ సర్వీస్​ సెంటర్​ నిర్వాహకులైన విలేజ్​ లెవల్​ ఎంటర్​ ప్రెన్యూర్​ (వీఎల్​ఏ) సేవలు వినియోగించుకుంది. ప్రతి రోజూ వీఎల్​ఏలు వారి పరిధిలోని గ్రామంలో సోలార్​ సిస్టం, సోలార్​ మోటార్ల వినియోగం గురించి రైతులను అవగాహన కల్పించాలి. గ్రామాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. 

ఈ సర్వే చేసినందుకు గాను కేంద్రం ఒక్కో వీఎల్​ఏకు రూ.10 వేల పారితోషికం ఇచ్చేందుకు ఒప్పుకుంది. తీరా వీఎల్ఏలు సర్వే చేశాకా ఇంత వరకు ఈ పారితోషికాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం విశ్వకర్మ స్కీముకు సంబంధించి ఒక్కో అప్లికేషన్​కు రూ.వంద చెల్లిస్తామన్న కేంద్రం మాటలు వీఎల్​ఏలు నమ్మడం లేదు. దీంతో ప్రతి అప్లికేషన్​కు సర్వీస్​ చార్జ్​ కింద రూ.వంద తీసుకుంటున్నారు.

నాలుగు సార్లు సెంటర్​కు వెళ్లి వచ్చా..

నేను ఆర్టిస్ట్ వర్క్ చేస్తుంటా. పీఎం విశ్వకర్మ స్కీంలో తక్కువ మిత్తీతో లోను వస్తుందని తెలిసి అప్లై చేసుకుందామని నెట్ సెంటర్​కు వెళ్లా. సైట్​ ఓపెన్​ కావడం లేదని  చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు సెంటర్​కు వచ్చి వెళ్లా. కానీ, అప్లై చేసుకోలేకపోయాను.
 
రామకృష్ణ, ఆర్టిస్ట్​, మిడ్జిల్​

పది సార్లు తిరిగిన..

నేను దోభీ పని చేస్తుంటా. విశ్వకర్మ స్కీంలో రూ.లక్ష లోన్​లు ఇస్తున్నారంటే అప్లికేషన్​ పెట్టుకోవడానికి అన్ని పేపర్లు సిద్ధం చేసుకున్నరు. పది రోజుల నుంచి మీ సేవ సెంటర్​కు వెళ్లి వస్తున్నా. ఎప్పుడు వెళ్లినా సర్వర్​ బిజీ వస్తోంది. నెట్​ సెంటర్​ వాళ్లను అడిగితే సర్వర్​ ప్రాబ్లం, మాకేం తెల్వదని చెబుతున్నారు.

రామస్వామి, మున్ననూరు