బ్యాంకుల​ సేవలు కొనసాగుతాయి

బ్యాంకుల​ సేవలు కొనసాగుతాయి
  •                 బ్యాంకుల ఐటీ, ట్రెజరీ, క్లియరింగ్‌‌
  •                 సర్వీసులు కొనసాగుతాయ్‌
  •                 ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు
  •                 కంటింజెన్సీ ప్లాన్స్​ రెడీ​

కరోనా వైరస్‌‌ కేసులు మరింత పెరిగి బ్యాంకులను మూసివేసే పరిస్థితి వచ్చినా ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా మేనేజ్‌‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. డిజిటల్‌‌ బ్యాంకింగ్‌‌, ట్రెజరీ సర్వీసులు, చెక్‌‌ క్లియరింగులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమైన ఐటీ యూనిట్లు నడిచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరో పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి సిబ్బంది ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారు. కరోనా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి ముఖ్యమైన ఉద్యోగులు కచ్చితంగా బ్యాంకులకు వచ్చి పనిచేస్తున్నారు. ఇదే విషయమై బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా హెచ్‌‌ఆర్‌‌ హెడ్‌‌ జాయ్‌‌దీప్‌‌ దత్తా రాయ్‌‌ మాట్లాడుతూ అన్ని బ్రాంచ్‌‌ల కోసం కంటింజెన్సీ ప్లాన్లను తయారు చేశామని చెప్పారు. ఎలాంటి ఆపద వచ్చినా బ్యాంకు ఆపరేషన్స్‌‌ కొనసాగుతాయని తెలిపారు. బ్రాంచ్‌‌లో ఎవరికైనా కరోనా సోకితే దానిని మూసివేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బ్రాంచ్‌‌  క్లస్టర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఎక్కువ మంది గుమిగూడకుండా ఆపడానికి బ్యాంకుల లోపలికి తక్కువ సంఖ్యలో మాత్రమే కస్టమర్లను అనుమతిస్తున్నామని చెప్పారు. సగం మంది బ్యాంకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని ఇండియన్ బ్యాంక్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. అయితే బ్యాంకులు అత్యవసర సర్వీసుల పరిధిలోకి వస్తాయి కాబట్టి ఈ రూల్‌‌ తమకు వర్తించదని అన్నారు. పన్నుల వసూలు ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకుల నుంచే జరుగుతుంది కాబట్టి ఉద్యోగులు రావాల్సిందేనన్నారు.

వర్క్‌‌ ఫ్రం హోం‌ సాధ్యం కాదు..

మనదేశంలోని పది బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ఈ నెల 31లోపు పూర్తి కావాలి కాబట్టి వీటి ఉద్యోగులకు ‘వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌’ ఇవ్వడం సాధ్యం కాదని మేనేజర్లు చెబుతున్నారు.  నాన్‌‌–బ్యాంక్‌‌ లెండర్లు మాత్రం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌‌ హోం ఇస్తున్నాయి. ఎడల్‌‌వైజ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ కంపెనీ రెండు వారాలపాటు ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులను కోరింది. కస్టమర్లు బ్రాంచ్‌‌లకు రాకుండా మొబైల్‌‌ యాప్స్‌‌ను వాడుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

ఎలాగైనా సేవలు అందిస్తారు..

ఎంతటి ఇబ్బంది వచ్చినా సేవలను కొనసాగించడానికి బ్యాంకులు బిజినెస్‌‌ కంటిన్యుటీ ప్లాన్లను రెడీ చేసుకున్నాయి. ప్రధాన హబ్‌‌, డిజాస్టర్‌‌ రికవరీ సెంటర్‌‌లో పనిచేయడానికి ఐటీ సిబ్బందిని కేటాయించాయి. ట్రెజరీ, ఫారెక్స్ ట్రేడింగ్‌‌ సేవలు యథాతథంగా కొనసాగించేందుకు ప్రత్యేక డివిజన్లను ఏర్పాటు చేశాయి. తమ ఉద్యోగులు ఫేస్‌‌మాస్కులు, శానిటైజర్లు కొనుక్కోవడానికి ప్రత్యేక అలవెన్సు ఇస్తామని ఎస్‌‌బీఐ తెలిపింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ టార్గెట్లను పూర్తి చేయాలని కొందరు బ్యాంకు మేనేజర్లు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. బీమా పాలసీల టార్గెట్లను చేరుకోవాలంటూ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ మహారాష్ట్ర సిబ్బందిపై ఒత్తిడి తేవడంపై యూనియన్లు అభ్యంతరం తెలిపాయి.