సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ స్టాఫ్ క్రూ లాబీ ఏర్పాటు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ స్టాఫ్ క్రూ లాబీ ఏర్పాటు

సికింద్రాబాద్ : రైల్ రన్నింగ్ స్టాఫ్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డులకు విశ్రాంతి, సరైన ఆహార సౌకర్యాలు, వసతులు కల్పించడం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ క్రూ లాబీని  ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ స్టాఫ్ క్రూ లాబీ టూర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, విశ్రాంతి తీసుకున్న తరువాత వారు మళ్ళీ  విధుల్లోకి వెళ్ళేప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. 

ఈ సందర్బంగా శ్రీధర్ మాట్లాడుతూ.. రైల్వే సిబ్బందిలో రన్నింగ్ స్టాఫ్ యొక్క పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. డ్యూటీ అనంతరం తప్పని సరిగా 16గంటల విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఔట్ స్టేషన్ సిబ్బంది ఇక్కడ రిలీవ్ అయిన తరువాత మళ్ళీ విధుల్లోకి వెళ్ళే వరకూ అన్ని రకాల వసతులు కల్పించినట్లు వివరించారు. వారు తిరిగి విధుల్లోకి వెళ్ళేప్పుడు ముఖ గుర్తింపు, బయో మెట్రిక్ తో పాటు ఆల్కహాల్ శాతాన్ని కూడా కియోస్కీ మెషిన్ ద్వారా చెకింగ్ జరుగుతుందని చెప్పారు. ఆల్కహాల్ శాతం సున్నా ఉంటేనే లాగ్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు.