- నిందితుల్లో మహిళా వైద్యురాలు
- అగ్రిమెంట్ బాండ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన శిశు విక్రయాల ఘటనలో ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 27 న నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 15 రోజులు ఆడ శిశువును విక్రయించారని, 28న 21 రోజుల మగ శిశువును విక్రయించారని నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
మొదటి కేసులో...
తిరుమలగిరి సాగర్ మండలంలోని ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. 15 రోజుల క్రితం హాలియా పట్టణంలోని నిర్మల ఆసుపత్రిలో పార్వతి మరో సారి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తండ్రి బాబు శిశువును అమ్ముతామని ఆసుపత్రిలో పనిచేసే హైదరాబాద్ కు చెందిన వైద్యురాలు శాంతి ప్రియకు చెప్పాడు. ఆమె మధ్యవర్తిత్వం వహించి ఏలూరు పట్టణానికి చెందిన కడాలి సాంబమూర్తి, రజిత దంపతులకు శిశువును రూ.2. 30 లక్షలకు విక్రయించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు.
ఈ నెల 25న తల్లిదండ్రులు బాబు, పార్వతిలకు రూ.10 వేల అడ్వాన్సుగా చెల్లించి శిశువును తీసుకెళ్లారు. ఈ కేసులో కొర్ర బాబు, శిశువును కొనుగోలు చేసిన దంపతులు కడలి సాంబమూర్తి, రజిత, మధ్యవర్తిత్వం వహించిన డాక్టర్ శాంతి ప్రియను అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
మరో కేసులో...
గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీనుకు గతంలో పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఆయనకు దూరంగా ఉంటున్నాడు. ఒరిస్సా రాష్ట్రంలో మట్టి పనికి వెళ్లిన శ్రీను అక్కడ జంకర్ మాల అలియాస్ మాలతిని వివాహం చేసుకున్నాడు. రెండు నెలల క్రితం వీరు స్వగ్రామమైన కోనాయిగూడెంకు వచ్చారు. అప్పటికే మాలతి 8 నెలల గర్భవతిగా ఉంది. తమకు జన్మించిన శిశువును ఎవరికైనా అమ్ముకొని తిరిగి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. తన దూరపు బంధువైన కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన దూరపు బంధువు ఓర్సు శ్రీనుతో తమకు జన్మించే శిశువును అమ్మివేస్తామని చెప్పారు.
ఆయన తన గ్రామానికి చెందిన వేముల నాగరాజు, ఆయన భార్య సువర్ణకు విషయం చెప్పాడు. ఈ నెల 8న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం జాయిన్ అయ్యారు. జంకర్ మాల అలియాస్ మాలతి మగ శిశువుకు జన్మనివ్వడంతో 10 తేదీన మధ్యవర్తితో పాటు వేముల నాగరాజు, సువర్ణ దంపతులు ఆస్పత్రికి వచ్చి శిశువును చూశారు. మగ శిశువు కాబట్టి రూ. 6 లక్షలు ఇవ్వాలని తండ్రి ఓర్సు శ్రీను డిమాండ్ చేయగా రూ 4. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 15 వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే శిశువును ఓర్సు శ్రీను, మమత దంపతులు మధ్యవర్తి ఓర్సు శ్రీను సమక్షంలో వేముల నాగరాజు, సువర్ణల నుంచి డబ్బులు తీసుకుని బాబును అప్పగించారు.
రెస్క్యూ చేసి కాపాడిన ఇద్దరు శిశువులను శిశు గృహకు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శిశువులను అక్రమంగా దత్తత ఇవ్వడం చట్టరీత్యా నేరమని చట్ట ప్రకారం శిశువులను దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు. కేసు పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శివరాం రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి తదితరులును ఎస్పీ అభినందించారు.
