బైక్లు చోరీ చేస్తున్న ఏడుగురు అరెస్ట్ ..నిందితుల్లో నలుగురు మైనర్లు

బైక్లు చోరీ చేస్తున్న ఏడుగురు అరెస్ట్ ..నిందితుల్లో నలుగురు మైనర్లు
  • హనుమకొండలో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హనుమకొండ సిటీ/పర్వతగిరి(సంగెం), వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు హైదరాబాద్ లో బైక్​లు చోరీ చేస్తున్న ఏడుగురిని హనుమకొండ జిల్లా సంగెం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు   వివరాలను వరంగల్​ఈస్ట్​జోన్​ డీసీపీ అంకిత్​ కుమార్​ వెల్లడించారు. హనుమకొండకు చెందిన దరాంగుల అంజి, వరంగల్ ఉర్సుకు చెందిన సంతోష్, కరీంనగర్​ జిల్లా జమ్మికుంటకు చెందిన జైదా రామకృష్ణ, నలుగురు మైనర్లు ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది.

జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం పార్క్​చేసిన బైక్​లను చోరీ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 5, సంగెం, హసన్‌‌‌‌పర్తి, మిల్స్‌‌‌‌కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 6, హనుమకొండ, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ల​పరిధిలో 2, హైదరాబాద్ మడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వాటిని హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో దాచారు. ఈ నెల 1న సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాలపల్లిలో టూవీలర్​ను చోరీ చేయగా.. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

టెక్నాలజీని ఉపయోగించుకొని, ప్రత్యేక  బృందాల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం గవిచర్లలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్​లపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విచారణలో బైక్​లు చోరీ చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని చెప్పారు. వాహనాలను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్​చేసినట్లు పేర్కొన్నారు. వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మామునూరు ఏసీపీ వెంకట్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సీసీఎస్ ఇన్స్‌‌‌‌స్పెక్టర్ రాఘవేందర్, సంగెం ఎస్సై వంశీకృష్ణ, సిబ్బందిని అభినందించారు.