- ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర సర్కారు ఉదారత
- కేవలం తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసమే 120 టీఎంసీలకుపైగా మళ్లింపు
- దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళికలు
- ఇప్పటికే 5 ఇంటర్ లింక్‌లకు డీపీఆర్‌లు పూర్తి
- లోక్‌సభలో ఏపీ ఎంపీ ప్రశ్నకుకేంద్ర జలశక్తి శాఖ సమాధానం
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది. నదుల అనుసంధానంలో భాగంగా ఏడు ఇంటర్ లింక్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కోసం నిర్మించి ఇవ్వబోతున్నది. ఏడు నదుల అనుసంధానం ద్వారా ఏపీకి కేవలం తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసమే 120 టీఎంసీలకుపైగా జలాలను అప్పనంగా అప్పగించబోతున్నది. ఏపీకి కేంద్రం సహకారంతో ఎన్ని ఇంటర్ లింక్ ప్రాజెక్టులు ఇచ్చారని ఎంపీ అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన సమాధానంతో ఈ విషయం బయటపడింది.
గోదావరి –కావేరి లింక్ కాకుండానే ఏడు లింక్‌లను ఏపీ భాగస్వామిగా చేపడుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ‘‘నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ) కింద నదుల అనుసంధానంలో భాగంగా ఏపీలో 7 ఇంటర్ లింక్ ప్రాజెక్టులను చేపడుతున్నాం. 1980ల్లో ద్వీపకల్ప (పెనిన్సులార్) నదుల లింక్‌లో భాగంగా గోదావరి (పోలవరం)–కృష్ణా (విజయవాడ) లింక్ ప్రాజెక్టును చేపడుతున్నాం. 1999లోనే ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా తయారైంది. ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్‌గా దీనిని ఏపీ చేపట్టింది.
దానికి సంబంధించిన డీపీఆర్‌ను 2005లో సమర్పించింది. దాదాపు 165 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా తరలించేలా ఆ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను 2009లో తయారు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు మినహా ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదాను ఇవ్వలేదు’’ అని జలశక్తి శాఖ వెల్లడించింది. ఈ 7 లింకుల ద్వారా ఏపీలోని దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీళ్లను ఇవ్వనున్నది.
ఆర్థికసాయంపై నో క్లారిటీ..
ఏడు లింకులనూ ఏపీ భాగస్వామ్యంతో చేపడుతున్నట్టు స్పష్టం చేసిన కేంద్రం.. వాటికి ఎంత ఆర్థిక సాయం చేస్తున్నదన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. మహానది (మణిభద్ర)–గోదావరి (ధవళేశ్వరం) లింక్ కింద 11 లక్షల ఎకరాలకు 28.32 టీఎంసీల నీటిని ఏపీకి కేంద్రం ఇవ్వనుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పూర్తయింది.
దానికి ప్రత్యామ్నాయం అనుకుంటే.. మహానది (బార్ముల్)–రుషికుల్య– గోదావరి (ధవళేశ్వరం) లింక్‌నూ ప్రతిపాదించింది. ఇందులో ఏపీకి తాగు నీటి అవసరాల కోసం 3.3 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 4 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించేందుకు ప్రతిపాదనలున్నాయి. పోలవరం–విజయవాడ లింక్‌లో భాగంగా 3 లక్షల ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం 1.18 టీఎంసీలను వాడనున్నారు.
తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం 11 టీఎంసీలను కేటాయించనున్నారు. నాలుగో లింక్‌గా నాగార్జునసాగర్–సోమశిలనూ కేంద్రం చేపట్టనుంది. 4 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వనుంది. తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం 4.38 టీఎంసీలు కేటాయించేలా తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది. మరో ప్రత్యామ్నాయంగా గోదావరి– కావేరి లింక్‌లో దీనిని చేర్చి అదనంగా మరో 4 టీఎంసీలూ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నది.
దాంతోపాటు శ్రీశైలం –సోమశిల లింక్ ద్వారా మరో 2 టీఎంసీలు, ఆల్మట్టి–సోమశిల లింక్ ద్వారా 1.5 టీఎంసీలు ఇచ్చేలా ప్రాజెక్టు డీపీఆర్‌నూ పూర్తి చేశారు. సోమశిల – కావేరి లింక్‌లో భాగంగా ఏపీకి 2 టీంఎసీల తాగునీటితోపాటు పరిశ్రమల అవసరాలకు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. దీనికీ డీపీఆర్ పూర్తయింది. ఈ వివరాలన్నింటినీ లోక్‌సభ సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా వెల్లడించడం గమనార్హం.
