పాక్​లో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు - ఏడుగురు మృతి

పాక్​లో బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు - ఏడుగురు మృతి

పెషావర్ :  పాకిస్తాన్​లో మరోసారి టెర్రర్ దాడి జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పద్దెనిమిది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిల్గిట్​ బాల్టిస్తాన్ లోని ఘిజెర్ జిల్లా నుంచి ప్రైవేట్ బస్సు ఒకటి ప్రయాణికులతో ఇస్లామాబాద్ కు బయలుదేరింది. 

అయితే, మార్గమధ్యంలో బస్సుపై టెర్రరిస్టులు దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ప్రయాణికులలో చాలామందికి గాయాలయ్యాయి. టెర్రరిస్టుల కాల్పుల ధాటికి బస్సుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్​లోనే చనిపోయారు. ఇందులో పాక్ ఆర్మీ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు.  బుల్లెట్ గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడం, విపరీతమైన రక్త స్రావం కారణంగా క్షతగాత్రులలో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. 

కాగా, బస్సుపై కాల్పులు జరిపిన తర్వాత టెర్రరిస్టులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు వివరించారు. కాల్పుల ఘటనపై విచారణ చేపట్టడంతో పాటు పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పెషావర్ పోలీసులు తెలిపారు.